Friday, December 20, 2024

నేడు సౌతాఫ్రికాతో చివరి టీ20.. సిరీస్ పై భారత్ కన్ను

- Advertisement -
- Advertisement -

జోహెన్నస్‌బర్గ్: సౌతాఫ్రికాతో శుక్రవారం జరిగే నాలుగో, చివరి టి20 మ్యాచ్‌కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఉత్కంఠభరితంగా సాగిన మూడో టి20లో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుతో భారత్ సిరీస్‌లో 21 ఆధిక్యంలో నిలిచింది. చివరి టి20లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. ఆతిథ్య సౌతాఫ్రికాకు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం తప్పించి మరో మార్గం లేదు. దీంతో ఎలాగైనా గెలవాల్సిన పరిస్థితి జట్టుకు నెలకొంది. కిందటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా అసాధారణ ఆటను కనబరిచినా విజయం మాత్రం సాధించలేక పోయింది. టీమిండియా 219 పరుగుల భారీ స్కోరు సాధించినా గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మార్కొ జాన్సన్, హెన్రిచ్ క్లాసెన్‌లు విధ్వంసక బ్యాటింగ్‌తో భారత బౌలర్లను హడలెత్తించారు.

సంజు ఈసారైనా..
తొలి టి20లో సెంచరీతో ఆకట్టుకున్న సంజు శాంసన్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా సంజు తన బ్యాట్‌క పనిచెప్పాల్సిన అవసరం ఉంది. సంజు వైఫల్యం జట్టుకు ఇబ్బందిగా మారింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన సంజు రెండు మ్యాచుల్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు. కానీ కీలకమైన ఈ మ్యాచ్‌లో ఎలాగైనా బ్యాట్‌ను ఝులిపించాలనే పట్టుదలతో ఉన్నాడు.

జోరు సాగాలి..
మరోవైపు యువ ఓపెనర్ అభిషేక్ శర్మ, హైదరాబాదీ యువ సంచలనం తిలక్ వర్మ కిందటి మ్యాచ్‌లో విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి పోయిన విషయం తెలిసిందే. ఇద్దరు సఫారీ బౌలర్లపై విరుచుకుపడి జట్టుకు భారీ స్కోరు అందించడంలో ముఖ్య భూమిక పోషించారు. ఈ మ్యాచ్‌లో కూడా జట్టు వీరిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఇద్దరు తమ మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే టీమిండియాకు ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోరు ఖాయం. తిలక్‌వర్మ మూడో టి20లో అజేయ శతకంతో చెలరేగి పోయాడు.

విధ్వంసక బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న తిలక్ 56 బంతుల్లోనే అజేయంగా 107 పరుగులు సాధించాడు. అభిషేక్ 25 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. ఇద్దరు రెండో వికెట్ 8.2 ఓవర్లలోనే 107 పరుగులు జోడించారు. ఈసారి కూడా ఇలాంటి ఇన్నింగ్సే ఆడాలనే పట్టుదలతో ఉన్నారు. కాగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. అతని వైఫల్యం జట్టుకు ఇబ్బందిగా మారింది. కిందటి మ్యాచ్‌లో సూర్య ఒక పరుగు మాత్రమే చేశాడు. కానీ ఈసారి ఎలాగైనా భారీ ఇన్నింగ్స్ ఆడాలనే లక్షంతో కనిపిస్తున్నాడు. హార్దిక్ పాండ్య, రింకు సింగ్ తదితరులు కూడా తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడం లేదు. ఈసారి ఆ లోపాన్ని సరిదిద్ధుకోవాలని భావిస్తున్నారు. బౌలింగ్‌లో కూడా భారత్ బలంగా ఉంది. అర్ష్‌దీప్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌ల వంటి టి20 స్పెషలిస్ట్ బౌలర్లు జట్టులో ఉన్నారు. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
సవాల్ వంటిదే..
ఇదిలావుంటే ఆతిథ్య సౌతాఫ్రికాకు ఈ మ్యాచ్ సవాల్ వంటిదేనని చెప్పాలి. మూడో టి20లో ఓటమి పాలు కావడంతో సఫారీ టీమ్ ఒత్తిడిలో కనిపిస్తోంది. సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కిందటి మ్యాచ్‌లో ఓడడంతో సౌతాఫ్రికా సిరీస్‌లో 12 తేడాతో వెనుకబడి పోయింది. సిరీస్‌ను డ్రా చేయాలంటే ఆఖరి మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. రియాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, మార్‌క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కొ జాన్సెన్, కొయెట్జి వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. దీంతో సౌతాఫ్రికా కూడా విజయంపై కన్నేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News