Saturday, December 28, 2024

నేడు సౌతాఫ్రికాతో నాలుగో టి20.. టీమిండియాకు కీలకం

- Advertisement -
- Advertisement -

IND vs SA 4th T20 Match Today

రాజ్‌కోట్: సౌతాఫ్రికాతో శుక్రవారం రాజ్‌కోట్ వేదికగా జరిగే నాలుగో టి20 మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. ఇక విశాఖపట్నంలో జరిగిన మూడో టి20లో ఘన విజయం సాధించిన రిషబ్ సేన ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ కూడా విజయం సాధించి సిరీస్‌ను సమయం చేయాలని భావిస్తోంది. కిందటి మ్యాచ్‌లో బౌలర్లు రాణించడం భారత్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పొచ్చు. హర్షల్ పటేల్, యజువేంద్ర చాహల్ విశాఖలో అద్భుత బౌలింగ్‌ను కనబరిచారు. వీరి ధాటికి నిలువలేక సౌతాఫ్రికా 131 పరుగులకే ఆలౌటైంది. ఇక సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ సిరీస్‌లో నిలకడైన ప్రదర్శనతో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్ తదితరులు కూడా తమవంతు పాత్ర పోషిస్తే ఈ మ్యాచ్‌లో కూడా సౌతాఫ్రికా బ్యాటర్లకు ఇబ్బందులు ఖాయమనే చెప్పాలి.
జోరుమీదున్న ఓపెనర్లు..
మరోవైపు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్‌లు ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. కిందటి మ్యాచ్‌లో వీరిద్దరూ భారత్‌కు శుభారంభం అందించారు. ఇద్దరు అర్ధ సెంచరీలతో అలరించారు. ఈసారి కూడా మెరుగైన ఆరంభం ఇవ్వాలనే లక్షంతో ఉన్నారు. ఇద్దరిలో ఏ ఒక్కరూ రాణించినా భారత్‌కు భారీ స్కోరు ఖాయం. ఇక శ్రేయస్ అయ్యర్ కూడా నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈసారి కూడా జట్టుకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాడు. కెప్టెన్ రిషబ్ పంత్ కూడా తన బ్యాట్‌కు పనిచెబితే టీమిండియాకు తిరుగే ఉండదు. దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్య, అక్షర్‌పటేల్, హర్షల్, భువనేశ్వర్ తదితరులతో భారత బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచాలని భావిస్తోంది.
సిరీస్‌పై కన్ను..
ఇక సౌతాఫ్రికా సిరీస్‌పై కన్నేసింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. మిల్లర్, క్లాసెన్, డుసెన్, ప్రెటోరియస్, బవుమా, పర్నెల్ తదితరులతో సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. క్లాసెన్, మిల్లర్‌లు ఫామ్‌లో ఉండడం సౌతాఫ్రికాకు ఊరటనిచ్చే అంశమే. ఈ మ్యాచ్‌లో మిల్లర్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. డుసెన్, బవుమా, క్లాసెన్ తమవంతు పాత్ర పోషిస్తే సఫారీలకు భారీ స్కోరు చేయడం కష్టమేమీ కాదు. ఇక రబడా, పర్నెల్, నోర్జే, షమ్సి, కేశవ్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయం.

IND vs SA 4th T20 Match Today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News