Friday, November 22, 2024

సౌతాఫ్రికాతో టి20 సిరీస్‌: కుర్రాళ్లకు మరో ఛాన్స్!

- Advertisement -
- Advertisement -

భారత్‌-సౌతాఫ్రికా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు ఆదివారం తెరలేవనున్న విషయం తెలిసిందే. డర్బన్ వేదికగా ఇరు జట్ల మధ్య మొదటి టి20 జరుగనుంది. రానున్న టి20 ప్రపంచకప్ నేపథ్యంలో ఇటు సౌతాఫ్రికా అటు భారత్ యువ ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇచ్చింది. వరల్డ్‌కప్ నాటికి బలమైన జట్లను తయారు చేసుకోవాలనే లక్షంతో ఇరు జట్ల క్రికెట్ బోర్డులు ఉన్నాయి. టీమిండియా అయితే చాలా కాలంగా టి20లలో యువ ఆటగాళ్లకే ప్రాధానత్య ఇస్తుంది. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్‌లో కూడా భారత్‌యువ ఆటగాళ్లతో బరిలోకి దిగింది. సొంత గడ్డపై జరిగిర సిరీస్‌లో యువ భారత్ టీమ్ అదరగొట్టింది.

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో సొంతం చేసుకుంది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జడేజా, షమి, బుమ్రా, రాహుల్, శుభ్‌మన్, సిరాజ్ వంటి స్టార్ ఆటగాళ్లు దూరంగా ఉన్నా టీమిండియా సిరీస్‌ను దక్కించుకుంది. ఇదే జోరును సౌతాఫ్రికా సిరీస్‌లోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ బలంగా ఉంది. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, కెప్టెన్ సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా సిరీస్‌లో యశస్వి, రుతురాజ్, రింకుసింగ్, అయ్యర్ తదితరులు అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఈసారి కూడా జట్టు వీరిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఈసారి జడేజా, వాషింగ్టన్ సుందర్ వంటి ఆల్‌రౌండర్లు కూడా జట్టులోకి వచ్చారు. దీంతో జట్టు మరింత బలోపేతంగా మారింది.

అంతేగాక అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, సిరాజ్, ముకేశ్ కుమార్, కుల్దీప్, దీపక్ చాహర్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు ఉండనే ఉన్నారు. ఇలాంటి స్థితిలో భారత్ మరింత ఆత్మవిశ్వాసంతో సిరీస్‌కు సిద్ధమైంది. యువ ఆటగాళ్లు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రానున్న వరల్డ్‌కప్ నాటికి జట్టులో స్థానాన్ని పదిలం చేసుకోవాలనే లక్షంతో కనిపిస్తున్నారు. సెలెక్టర్లు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టి జట్టుకు సిరీస్‌ను అందించాలని తహతహలాడుతున్నారు. రింకు సింగ్, యశస్వి, రుతురాజ్ తదితరులపై అందరి దృష్టి నిలిచింది. విధ్వంసక బ్యాటింగ్‌కు మరోపేరుగా చెప్పుకునే వీరు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరిస్తే సౌతాఫ్రికా గడ్డపై సిరీస్‌ను సాధించడం టీమిండియాకు పెద్ద కష్టమేమీ కాదు.

భారత్‌దే పైచేయి..
ఇరు జట్ల మధ్య జరిగిన టి20లలో భారత్‌దే పైచేయిగా ఉంది. ఇప్పటి వరకు రెండు జట్ల మధ్య 24 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 13 మ్యాచుల్లో విజయం సాధించింది. సౌతాఫ్రికా పదింటిలో జయకేతనం ఎగుర వేసింది. ఒక మ్యాచ్ రద్దయ్యింది. అయితే సొంత గడ్డపై సౌతాఫ్రికా ఆరు మ్యాచుల్లో విజయం సాధించింది. బారత్ ఐదింటిలో మాత్రమే గెలిచింది. ఈసారి సిరీస్‌ను గెలవడం ద్వారా ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని భారత్ భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News