Sunday, November 17, 2024

నేడు తొలి వన్డే: ఆత్మవిశ్వాసంతో భారత్, గెలుపు కోసం శ్రీలంక

- Advertisement -
- Advertisement -

ఇక వన్డేల వంతు
ఆత్మవిశ్వాసంతో భారత్, గెలుపు కోసం శ్రీలంక
నేడు గౌహతిలో తొలి వన్డే
మధ్యాహ్నం 1.30 గంటల నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో..
గౌహతి: భారత్‌-శ్రీలంక జట్ల మధ్య జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సమరానికి మంగళవారం తెరలేవనుంది. గౌహతి వేదికగా తొలి వన్డే జరుగనుంది. ఈ సిరీస్‌లో భారత్ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగనుంది. రోహిత్ శర్మ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. సీనియర్లు విరాట్ కోహ్లి, షమి, రాహుల్, సిరాజ్ తదితరులు తిరిగి టీమిండియాలోకి చేరారు. అయితే కీలక బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వన్డే సిరీస్‌కు దూరం కావడం భారత్‌కు కాస్త ఎదురుదెబ్బగానే చెప్పాలి. పూర్తి ఫిట్‌నెస్ సాధించక పోవడంతో అతను వన్డే సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయాడు.

అందరి కళ్లు రోహిత్‌పైనే..
ఇక వన్డే సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియాకు కీలకంగా మారాడు. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌లోనూ రోహిత్ సత్తా చాటాల్సిన పరిస్థితి నెలకొంది. వన్డే ప్రపంచకప్‌కు కొద్ది నెలల సమయం మాత్రమే మిగిలివుండడంతో మెగా టోర్నీ నాటికి మెరుగైన జట్టును తయారు చేయాల్సిన బాధ్యత రోహిత్‌పై ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో అతను జట్టు ఎలా ముందుకు నడిపిస్తాడనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన రోహిత్ చెలరేగితే టీమిండియా బ్యాటింగ్ సమస్యలు చాలా వరకు తీరిపోతాయి. ఇక రోహిత్‌తో కలిసి శుభ్‌మన్ గిల్ లేదా కెఎల్ రాహుల్‌లు ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయి. ఒకవేళ ఇషాన్‌ను ఆడించాలని భావిస్తే మాత్రం రాహుల్ పెవిలియన్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.

కోహ్లికి చాలా కీలకం..
మరోవైపు సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లికి లంక సిరీస్ చాలా కీలకంగా మారింది. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో కోహ్లి ఘోరంగా విఫలమయ్యాడు. ఇలాంటి స్థితిలో లంకతో జరిగే వన్డేలు కోహ్లికి పరీక్షగా తయారయ్యాయి. మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలువాల్సిన పరిస్థితి కోహ్లికి నెలకొంది. ఇందులో అతను ఎంత వరకు సఫలం అవుతాడనేది బరిలోకి దిగితేకానీ తెలియదు. వన్డే ప్రపంచకప్ ముంచుకొస్తున్న నేపథ్యంలో కోహ్లి పూర్వవైభవాన్ని అందుకోవాల్సిన అవసరం జట్టుకు ఎంతైనా ఉంది.

సూర్య జోరు సాగాలి..
టి20 సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన సూర్యకుమార్ యాదవ్ కూడా వన్డేలకు కీలకంగా మారాడు. జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. కొంత కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో సూర్య పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో పలు మ్యాచుల్లో టీమిండియాకు ఒటిచేత్తో విజయాలు సాధించి పెడుతున్నాడు. టి20 సిరీస్‌లో వరుసగా హాఫ్ సెంచరీ, అర్ధ సెంచరీతో అలరించాడు. వన్డేల్లో కూడా చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. సూర్యకుమార్ వన్డేల్లో కూడా జోరు కొనసాగిస్తే సిరీస్‌ను సొంతం చేసుకోవడం భారత్‌కు కష్టమేమీ కాదు.

ఇక అక్షర్ పటేల్ కూడా జోరుమీదున్నాడు. బ్యాట్‌తో బంతితో చెలరేగిపోతున్నాడు. టి20 సిరీస్‌లో అక్షర్ పటేల్ ఆల్‌రౌండ్‌షోతో ఆకట్టుకున్నాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. హార్దిక్ పాండ్య, శ్రేయస్ అయ్యర్‌లతో భారత్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. షమి, సిరాజ్, ఉమ్రాన్, అర్ష్‌దీప్, చాహల్, కుల్దీప్ తదితరులతో భారత బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా కనిపిస్తోంది. దీంతో సిరీస్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

సంచలనాలకు మరో పేరు..
పర్యాటక శ్రీలంక జట్టును కూడా తక్కువ అంచనా వేయలేం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో లంక సమతూకంగా కనిపిస్తోంది. టి20 సిరీస్‌లో భారత్‌కు గట్టి పోటీ కూడా ఇచ్చింది. వన్డేల్లో కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉది. కుశాల్ మెండిస్, ధనంజయ, హసరంగ, నిసాంకా, అసలంక, కరుణరత్నె, తీక్షణ, కెప్టెన్ దాసున్ శనక, మదుశంకా, లహిరు కుమార తదితరులతో లంక పటిష్టంగా ఉంది. దీంతో భారత్‌కు గట్టిపోటీ ఎదురుకావడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News