Monday, December 23, 2024

నేడు లంకతో తొలి వన్డే.. ఫేవరెట్‌గా భారత్

- Advertisement -
- Advertisement -

కొలంబో: శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే 3 మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్ వన్డేల్లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. కొత్త కోచ్ గౌతం గంభీర్ పర్యవేక్షణలో కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి ఆడుతున్న తొలి సిరీస్ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. వన్డేల్లో భారత్ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు బరిలో దిగుతుండడంతో భారత్ మరింత బలోపేతంగా మారింది. సిరీస్‌లో ఇద్దరిపై అందరి దృష్టి నిలిచింది. ఇద్దరు ఇప్పటికే టి20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇలాంటి స్థితిలో వన్డేలపై వీరు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి వీరిపైనే నిలిచింది. టి20 సిరీస్‌లో ఆడిన సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ తదితరులు సిరీస్‌కు దూరమయ్యారు.

వీరి స్థానంలో కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తదితరులు జట్టులోకి వచ్చారు. రాహుల్‌కు కూడా సిరీస్ కీలకంగా మారింది. టీమిండియాలో స్థానం శాశ్వతం చేసుకోవాలంటే సిరీస్‌లో సత్తా చాటాల్సిన పరిస్థితి రాహుల్‌కు నెలకొంది. ఇందులో అతను ఎంత వరకు సఫలం అవుతాడనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక రోహిత్, శుభ్‌మన్ గిల్, అయ్యర్, రిషబ్ పంత్, కోహ్లి, శివమ్ దూబె, రాహుల్ తదితరులతో భారత్ చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో టీమిండియా సమతూకంగా కనిపిస్తోంది. అర్ష్‌దీప్, సిరాజ్, ఖలీల్, సుందర్, రియాన్ పరాగ్, కుల్దీప్, అక్షర్, హర్‌షిత్ రాణా వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. దీంతో సిరీస్‌లో భారత్‌కే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

తక్కువ అంచనా వేయలేం..
మరోవైపు ఆతిథ్య శ్రీలంక టీమ్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో లంక బలంగా ఉంది. పాథుమ్ నిసాంకా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, సమర విక్రమ, హసరంగ, కెప్టెన్ చరిత్ అసలంక, మహీశ్ తీక్షణ, మదుష్కా, దునిత్ వెల్లెలాగే వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అంతేగాక సొంత గడ్డపై సిరీస్ జరుగుతుండడం కూడా లంకకు సానుకూల పరిణామంగా చెప్పాలి. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News