Friday, November 22, 2024

సిరీస్‌పై భారత్ కన్ను

- Advertisement -
- Advertisement -

IND vs SL 2nd ODI match tomorrow

సిరీస్‌పై భారత్ కన్ను
లంకకు పరీక్ష, నేడు రెండో వన్డే
కొలంబో: తొలి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన టీమిండియా మంగళవారం శ్రీలంకతో జరిగే రెండో వన్డేకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో శిఖర్ ధావన్ బరిలోకి దిగుతోంది. మరోవైపు తొలి వన్డేలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుని సిరీస్‌ను సమం చేయడమే లక్షంగా ఆతిథ్య శ్రీలంక కనిపిస్తోంది. మొదటి వన్డేలో టీమిండియా కుర్రాళ్లు ఆల్‌రౌండ్‌షోతో అదరకొట్టారు. ఇషాన్ కిషన్, పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్‌లు అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌కు అలవోక విజయాన్ని అందించారు. ఈసారి కూడా జట్టు వీరిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఇక శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో సఫలమైన భారత స్పిన్నర్లు ఈసారి కూడా అదే జోరును కనబరచాలనే పట్టుదలతో ఉన్నారు. కృనాల్ పాండ్య, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లు తొలి వన్డేలో అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్‌లో కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక ఈ మ్యాచ్ లంకకు చావోరేవోగా మారింది. ఇందులో గెలిస్తేనే సిరీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఓడిపోతే సిరీస్ భారత్ వశమవుతోంది. దీంతో ఆతిథ్య జట్టుపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఒత్తిడిని తట్టుకుని ఎలా ముందుకు సాగుతుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
జోరు సాగాలి..
మరోవైపు తొలి మ్యాచ్‌లో అద్భుత శుభారంభం అందించిన యువ ఓపెనర్ పృథ్వీషా ఈసారి కూడా అదే జోరును కొనసాగించక తప్పదు. మెరుపు బ్యాటింగ్‌తో లంక బౌలర్లను హడలెత్తించిన షా రెండో వన్డేలోనూ చెలరేగేందుకు తహతహలాడుతున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన షా విజృంభిస్తే భారత్‌కు గెలుపు నల్లేరుపై నడకే. ఇక తొలి మ్యాచ్‌లో కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టుకు అండగా నిలిచిన శిఖర్ ధావన్ మరోసారి అలాంటి జోరును కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. ధావన్ తన మార్క్ ఇన్నింగ్స్‌తో చెలరేగితే లంక బౌలర్ల కష్టాలు రెట్టింపు కావడం ఖాయం.
అందరి కళ్లు ఇషాన్‌పైనే..
ఇక అరంగేట్రం మ్యాచ్‌లోనే విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న యువ సంచలనం ఇషాన్ కిషన్‌పై అందరి దృష్టి నిలిచింది. ఆరంభ మ్యాచ్‌లోనే ఇషాన్ కళ్లు చెదిరే షాట్లతో ఆకట్టుకున్నాడు. ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్ కొట్టి పెను సంచలనం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కూడా విజృంభించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇషాన్ చెలరేగితే భారత్‌కు విజయం నల్లేరుపై నడకేనని చెప్పాలి. మరో బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ కూడా తొలి మ్యాచ్‌లో అద్భుతంగా ఆడాడు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. మరోవైపు సీనియర్ ఆటగాడు మనీష్ పాండేకు ఈ మ్యాచ్ సవాలుగా మారింది. తొలి మ్యాచ్‌లో దూకుడుగా ఆడడంలో విఫలమైన మనీష్‌కు రెండో వన్డేలో చోటు దక్కుతుందా అనేది కష్టమే. ఇక హార్దిక్ పాండ్య, కృనాల్, భువనేశ్వర్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. బౌలింగ్‌లో కూడా టీమిండియా మెరుగ్గా కనిపిస్తోంది. దీంతో మరో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్‌ను సొంతం చేసుకునే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి.

IND vs SL 2nd ODI match tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News