Wednesday, January 22, 2025

సూర్య ప్రతాపం… టి20 సిరీస్ టీమిండియా కైవసం

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: శ్రీలంకతో శనివారం రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో, చివరి టి20లో ఆతిథ్య టీమిండియా 91 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ 112 (నాటౌట్) అజేయ శతకంతో కదంతొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన శ్రీలంక 16.4 ఓవర్లలో కేవలం 137 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం చవిచూసింది. తొలి రెండు టి20లలో అసాధారణ ఆటను కనబరిచిన శ్రీలంక ఈసారి మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అసాధారణ ఆటను కనబరిచిన టీమిండియా సిరీస్‌ను దక్కించుకుంది.
త్రిపాఠి విధ్వంసం
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (1) విఫలమయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన రాహుల్ త్రిపాఠి విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించాడు. అతనికి మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అండగా నిలిచాడు. ప్రారంభం నుంచే దూకుడును కనబరిచిన త్రిపాఠి స్కోరును పరిగెత్తించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించాడు. అయితే 16 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 35 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠిని కరుణరత్నె వెక్కి పంపాడు.
సూర్యకుమార్ వీర విధ్వంసం
ఈ దశలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఆరంభం నుంచే చెలరేగి పోయాడు. లంక బౌలర్లను హడలెత్తిస్తూ పరుగుల వరద పారించాడు. అతన్ని కట్టడి చేసేందుకు లంక బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శుభ్‌మన్ గిల్ సహకారంతో సూర్య స్కోరును పరిగెత్తించాడు. భారీ సిక్సర్లు, బౌండరీలతో కనువిందు చేశాడు. లంక బౌలర్లను బెంబేలెత్తించిన సూర్య వేగంగా అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత మరింత దూకుడును ప్రదర్శించాడు. కళ్లు చెదిరే షాట్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. మరోవైపు శుభ్‌మన్ గిల్ 3 సిక్సర్లు, రెండు ఫోర్లతో 46 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఇక విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ 51 బంతుల్లోనే 9 భారీ సిక్సర్లు, ఏడు బౌండరీలతో అజేయంగా 112 పరుగులు చేశాడు. సూర్యకు అంతర్జాతీయ టి20ల్లో ఇది మూడో శతకం కావడం విశేషం. అక్షర్ పటేల్ కూడా 9 బంతుల్లోనే 4 ఫోర్లతో అజేయంగా 21 పరుగులు సాధించడంతో భారత్ స్కోరు 228 పరుగులకు చేరింది. తర్వాత భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన లంకను 137 పరుగులకే పరిమితం చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. లంక ఏ దశలోనూ లక్షం దిశగా సాగలేదు. వరుస క్రమంలో వికెట్లు కోల్పోతూ 137 పరుగులకే కుప్పకూలింది. కుశాల్ మెండిస్ (23), దాసున్ శనక (23), ధనంజయ డిసిల్వా (22) మాత్రమే కాస్త రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ మూడు, హార్దిక్, ఉమ్రాన్, చాహల్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News