Tuesday, September 17, 2024

ఆత్మవిశ్వాసంతో భారత్

- Advertisement -
- Advertisement -

నేడు యుఎఇతో ఢీ
మహిళల ఆసియా కప్

దంబుల్లా: ఆసియా కప్ ఆరంభ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన టీమిండియా ఆదివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. రెండో మ్యాచ్‌లోనూ చెలరేగాలనే పట్టుదలతో టీమిండియా కనిపిస్తోంది. యుఎఇతో పోల్చితే రెండు విభాగాల్లోనూ భారత్ చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు.

ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మలు తొలి మ్యాచ్‌లో శుభారంభం అందించారు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. మంధాన, షఫాలీ ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసివచ్చే అంశంగా చెప్పాలి. కొంతకాలంగా మంధాన మూడు ఫార్మాట్‌లలోనూ అసాధారణ ఆటతో అదరగొడుతోంది. ఆసియా కప్‌లో కూడా మెరుపులు మెరిపించేందుకు సిద్ధమైంది. యుఎఇతో జరిగే మ్యాచ్‌లో షఫాలీతో కలిసి మెరుగైన ఆరంభాన్ని అందించాలనే లక్షంతో కనిపిస్తోంది. మరోవైపు హేమలత, జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్, దీప్తి శర్మ వంటి స్టార్ బ్యాటర్లు ఉండనే ఉన్నారు. వీరిలో ఏ ఇద్దరూ నిలదొక్కుకున్నా జట్టుకు భారీ స్కోరు ఖాయం.

అంతేగాక బౌలింగ్‌లోనూ భారత్ చాలా బలంగా ఉంది. తొలి మ్యాచ్‌లో రేణుకా సింగ్, పూజా వస్త్రకర్, శ్రేయంక పాటిల్, దీప్తి శర్మలు అసాధారణ బౌలింగ్‌ను కనబరిచారు. దీప్తి, రేణుకా, శ్రేయంక తదితరులు పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా కీలక సమయంలో వికెట్లను తీసి జట్టుకు అండగా నిలిచారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కాగా, నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన యుఎఇకి ఈ పోరు సవాల్‌గా మారింది. భారత్ వంటి బలమైన జట్టును ఎదుర్కొడం యుఎఇకి చాలా కష్టంతో కూడుకున్న అంశంగానే చెప్పాలి. ఇదిలావుంటే ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియాకు సెమీ ఫైనల్ బెర్త్ ఖాయమవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News