భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ గురువారం జరుగనుంది. ఈ సిరీస్‌లో ఇరు జట్లు ఐదు మ్యాచుల్లో తలపడనున్నాయి. మూడు మ్యాచ్‌లు విండీస్‌లో, చివరి రెండు టి20లు అమెరికాలో జరుగనున్నాయి. టీమిండియాకు హార్దిక్ పాండ్య సారథ్యం వహిస్తున్నాడు. వెస్టిండీస్ కెప్టెన్‌గా రొమన్ పొవెల్ వ్యవహరించనున్నాడు. భారత్ యువ ఆటగాళ్లతో బరిలోకి దిగుతుండగా విండీస్ అగ్రశ్రేణి శ్రేణి ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించింది. యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ వంటి కుర్రాళ్లు టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
సీనియర్లు రోహిత్, విరాట్, జడేజా, అశ్విన్, కెఎల్ రాహుల్, షమి, సిరాజ్ వంటి సీనియర్లు జట్టుకు దూరంగా ఉన్నారు. వీరు లేకున్నా టీమిండియా బలంగానే ఉంది. ఇక వెస్టిండీస్‌లో పలువురు టి20 స్పెషలిస్ట్ ఆటగాళ్లకు చోటు దక్కింది. నికోలస్ పూరన్, హెట్‌మెయిర్, జేసన్ హోల్డర్, చార్లెస్, అకిల్ హుస్సేన్, బ్రాండన్ కింగ్, మేయర్స్, పొవెల్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్నారు. భారత్‌తో పోల్చితే విండీస్ సిరీస్‌లో బలంగా కనిపిస్తోంది. అయితే హార్దిక్, గిల్, సూర్యకుమార్, శాంసన్, ఇషాన్ వంటి ప్రతిభావంతులు ఉండడంతో భారత్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం.