Tuesday, December 17, 2024

సిరీస్‌పై భారత్ కన్ను

- Advertisement -
- Advertisement -

బార్బడాస్ : వెస్టిండీస్‌తో శనివారం జరిగే రెండో వన్డేకు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. తొలి వన్డేలో గెలిచిన భారత్ ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ 144 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్ అసాధారణ బౌలింగ్‌తో ఆతిథ్య టీమ్ ఇన్నింగ్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశాడు. అయితే టీమిండియా కూడా బ్యాటింగ్‌లో తడబడింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు తీవ్రంగా కష్టపడింది. పిచ్ బౌలింగ్ అనుకూలంగా ఉండడంతో ప్రతి పరుగు కోసం బ్యాటర్లు కష్టపడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ కూడా బ్రిడ్జ్‌టౌన్‌లో జరుగుతుండడంతో బ్యాటర్లకు మరోసారి ఇబ్బందులు ఖాయంగా కనిపిస్తున్నాయి.

జోరుమీదున్న ఇషాన్..
మొదటి వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ మెరుగైన బ్యాటింగ్‌తో అలరించాడు. కఠినమైన పిచ్‌పై అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. రానున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని టీమిండియా యువ ఆటగాళ్ల సామర్థాన్ని పరీక్షిస్తోంది. ఇందులో భాగంగానే శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇషాన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఈసారి కూడా వీరే ఓపెనర్లుగా దిగే అవకాశం ఉంది. ఈ వన్డేలో కూడా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే అవకాశాలు కనిస్తున్నాయి. కాగా, తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ ఘోరంగా విఫలమయ్యాడు. ఏడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈసారైనా అతను తన బ్యాట్‌కు పని చెప్పాలి. మరోవైపు సూర్యకుమార్ కూడా పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు.

హార్దిక్ పాండ్య, శార్దూల్ ఠాకూర్‌లు కూడా విఫలమయ్యారు. ఇలాంటి స్థితిలో రెండో వన్డే వీరికి కీలకంగా మారింది. టీమిండియాలో చోటు కాపాడుకోవాలంటే సూర్యకుమార్, గిల్, శార్దూల్‌లు మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు. ఇదిలావుంటే బౌలింగ్‌లో మాత్రం టీమిండియాకు పెద్దగా ఇబ్బందేమీ లేదని చెప్పొలి. కుల్దీప్ యాదవ్ కిందటి మ్యాచ్‌లో ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. జడేజా కూడా బాగానే బౌలింగ్ చేశాడు. అతను కూడా మూడు వికెట్లు తీశాడు. హార్దిక్, ముకేశ్, ఉమ్రాన్, శార్దూల్ తదితరులతో భారత బౌలింగ్ చాలా బలంగా ఉంది. తొలి వన్డేలో వీరంతా మెరుగైన ప్రదర్శన చేయడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న టీమిండియాకే ఈ మ్యాచ్‌లో గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News