Saturday, November 9, 2024

సిరీస్‌పై టీమిండియా కన్ను..నేడు రెండో వన్డే

- Advertisement -
- Advertisement -

IND vs WI 2nd ODI Match Today

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన తొలి వన్డేలో మూడు పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా ఆదివారం విండీస్‌తో జరిగే రెండో వన్డేకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి మరో వన్డే మిగిలివుండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో భారత్ ఉంది. కిందటి మ్యాచ్‌లో ఆతిథ్య విండీస్ చివరి బంతి వరకు గెలుపు కోసం పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఉత్కంఠ సమరంలో విజయం భారత్‌కే వరించింది. ఇక తొలి వన్డేలో ఓడిన విండీస్‌కు ఈ మ్యాచ్ చావో రేవోగా తయారైంది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే రెండో వన్డేలో తప్పక గెలవాల్సిందే. టీమిండియా కూడా గెలుపే లక్షంగా పెట్టుకుంది. ఈ వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను దక్కించుకోవాలని తహతహలాడుతోంది. కిందటి మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ బాగానే ఆడినా మిడిలార్డర్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయింది. దీంతో ఆఖరి ఓవర్లలో భారత్ వేగంగా పరుగులు సాధించడంలో విఫలమైంది. తొలి వన్డేలో కెప్టెన్ శిఖర్ ధావన్ అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచాడు.

కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన ధావన్ 3 పరుగుల తేడాతో సెంచరీ సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా జట్టును ముందుండి నడిపించాలని భావిస్తున్నాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా తొలి వన్డేలో మెరపు ఇన్నింగ్స్ ఆడడం జట్టుకు ఊరటనిచ్చే అంశమే. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా జోరుమీదున్నాడు. తొలి మ్యాచ్‌లో అయ్యర్ కూడా అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే సూర్యకుమార్, వికెట్ కీపర్ సంజు శాంసన్‌లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరి నిరాశ పరిచారు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా వీరు తమ బ్యాట్‌కు పనిచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. సిరాజ్, చాహల్, ప్రసిద్ధ్, ఠాకూర్, అక్షర్‌లతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. కానీ తొలి వన్డేలో విండీస్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో మాత్రం మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
గెలిచి తీరాల్సిందే..
ఇక ఆతిథ్య విండీస్‌కు రెండో వన్డే సవాల్‌గా మారింది. సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించి బదులు తీర్చుకోవాలనే లక్షంతో విండీస్ పోరుకు సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విండీస్ బలంగానే ఉంది. అయితే నిలకడలేమి జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. తొలి వన్డేలో గెలిచే స్థితిలో ఉండి కూడా భారత్ చేతిలో ఓటమి తప్పలేదు. దీంతో విండీస్ ఆత్మవిశ్వాసం దెబ్బతింది. అయితే సొంత గడ్డపై ఆడుతుండడం విండీస్‌కు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు ఉండడంతో విండీస్‌ను తక్కువ అంచనా వేయలేం. ఇరు జట్లు కూడా గెలుపే లక్షంగా పెట్టకోవడంతో రెండో వన్డే కూడా హోరాహోరీగా సాగడం ఖాయం.
తొలి వన్డే భారత్‌దే
విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 3 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన విండీస్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 305 పరుగులు మాత్రమే చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. భారత బౌలర్లు తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుత బౌలింగ్‌ను కనబరిచారు. ఆఖర్లో అకిల్ హుసేన్ 32 (నాటౌట్), రొమారియో షెఫర్డ్ 39 (నాటౌట్) రాణించినా ఫలితం లేకుండా పోయింది. మిగతావారిలో ఓపెనర్ కిల్ మేయర్స్ (75), బ్రూక్స్ (46), బ్రాండన్ కింగ్ (54), కెప్టెన్ నికోలస్ పూరన్(25) పరుగులు చేశారు. అయితే కీలక సమయంలో భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో విండీస్‌కు ఓటమి తప్పలేదు.

IND vs WI 2nd ODI Match Today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News