హరారే: జింబాబ్వేతో శనివారం జరిగే నాలుగో టి20 మ్యాచ్‌కు యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఆతిథ్య జింబాబ్వేకు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి జట్టుకు నెలకొంది. అయితే వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి జోరుమీదున్న భారత్‌ను ఓడించడం ప్రస్తుత పరిస్థితుల్లో జింబాబ్వేకు చాలా కష్టమనే చెప్పాలి. తొలి మ్యాచ్‌లో ఓడిన యువ భారత్ ఆ తర్వాత చెలరేగి ఆడుతోంది. వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి సిరీస్‌లో 21 ఆధిక్యంలో నిలిచింది. ఈ పోరులోనూ విజయం సాధించి సిరీస్‌ను పట్టేయాలనే లక్షంతో కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. కిందటి మ్యాచ్ ద్వారా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా ఫామ్‌లోకి రావడం జట్టుకు శుభసూచకంగా చెప్పాలి.
యశస్వి జైస్వాల్ చేరికతో జట్టు బ్యాటింగ్ మరింత బలోపేతంగా మారింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్‌తో కలిసి యశస్వి శుభారంభం అందించాలని భావిస్తున్నాడు. ఇదే జరిగితే జట్టుకు భారీ స్కోరు చేయడం కష్టమేమీ కాదు. యశస్వి తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కష్టాలు తప్పక పోవచ్చు. మరోవైపు రెండో టి20లో అద్భుత శతకంతో అలరించిన యువ సంచలనం అభిషేక్ శర్మ కూడా మరోసారి బ్యాట్‌ను ఝులిపించేందుకు సిద్ధమయ్యాడు. విధ్వంసక బ్యాటింగ్‌కు మరో పేరుగా చెప్పుకునే అభిషేక్ చెలరేగితే ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా మెరుగైన లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచడం ఖాయం. ఇక రుతురాజ్ గైక్వాడ్ జోరుమీదున్నాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో జింబాబ్వే బౌలర్లను హడలెత్తిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు.
రుతురాజ్ విజృంభిస్తే కట్టడి చేయడం జింబాబ్వే బౌలర్లకు శక్తికి మించిన పనిగానే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే సంజు శాంసన్ కిందటి మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపక పోవడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఈ మ్యాచ్‌లోనైనా శాంసన్ తన బ్యాట్‌కు పనిచెప్పాల్సిన అవసరం ఉంది. మరోవైపు రింకు సింగ్, రియాన్ పరాగ్, శివమ్ దూబె వంటి విధ్వంసక బ్యాటర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేగాక బౌలింగ్‌లోనూ భారత్ సమతూకంగా ఉంది. వాషింగ్టన్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్, పరాగ్, బిష్ణోయ్ తదితరులు నిలకడైన బౌలింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తారు. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
సవాల్ వంటిదే..
మరోవైపు ఆతిథ్య జింబాబ్వేకు ఈ మ్యాచ్ సవాల్ వంటిదేనని చెప్పాలి. సిరీస్‌లో నిలవాలంటే మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సింది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచుల్లో ఓడడంతో జట్టు ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. కీలక ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పోతున్నారు. ఇది జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. కెప్టెన్ సికందర్ రజా వైఫల్యం జట్టును వెంటాడుతోంది. బ్రియాన్, మధెవర్, క్లైవ్ మదాండె, చతరా, మేయర్స్ తదితరులు తమ తమ బ్యాట్‌లను ఝులిపించాల్సిందే. అప్పుడే జింబాబ్వేకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.