Monday, December 23, 2024

భారత మహిళల నయా చరిత్ర.. టీమిండియా రికార్డు స్కోరు

- Advertisement -
- Advertisement -

భారత మహిళల నయా చరిత్ర
షెఫాలీ వర్మ డబుల్ ధమాకా..మంధాన మెరుపు శతకం
సౌతాఫ్రికాతో ఏకైక టెస్టు.. టీమిండియా రికార్డు స్కోరు

చెన్నై: దక్షిణాఫ్రికా మహిళలతో శుక్రవారం ప్రారంభమైన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య టీమిండియా అదరగొట్టింది. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ తొలి రోజు ఎన్నో రికార్డులను తిరగరాసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో రికార్డు స్థాయిలో 4 వికెట్ల నష్టానికి 525 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.

ఈ క్రమంలో మహిళా క్రికెట్ చరిత్రలోనే తొలి రోజు ఆటలో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. అంతేగాక ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ తొలి వికెట్‌కు 292 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో షెఫాలీ వర్మ 197 బంతుల్లోనే 23 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో 205 పరుగులు చేసింది. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన మంధాన 161 బంతుల్లో 27 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 149 పరుగులు సాధించింది. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రికార్డు స్కోరును నమోదు చేసింది.

కదంతొక్కిన మంధాన, షెఫాలీ
టాస్ నెగ్గి తొలి ఇన్నింగ్స్ చేపట్టిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మలు శుభారంభం అందించారు. ఇద్దరు సౌతాఫ్రికా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఈ జోడీని విడగొట్టేందుకు సఫారీ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇటు మంధాన, అటు షెఫాలీ తమ మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగి పోయారు. దీంతో పోరు వన్డేను తలపించింది. ఇద్దరు పోటీ పడి ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డారు.

మంధాన ఫోర్లతో చెలరేగి పోగా, షెఫాలీ బౌండరీలతో పాటు సిక్సర్ల వర్షం కురిపించింది. ఇద్దరు విధ్వంసక బ్యాటింగ్‌ను కనబరచడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. ఇదే క్రమంలో ఇద్దరు తొలి వికెట్‌కు ఏకంగా 292 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన మంధాన 161 బంతుల్లో 27 ఫోర్లు, ఒక సిక్స్‌తో 149 పరుగులు చేసింది.

మరోవైపు అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన షెఫాలీ 197 బంతుల్లో 23 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో 205 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగింది. జెమీమా రోడ్రిగ్స్ 8 ఫోర్లతో 55 పరుగులు సాధించింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌ప్రీత్ కౌర్ 42 పరుగులతో క్రీజులో నిలిచింది. వికెట్ కీపర్ రిచా ఘోష్ 9 బౌండరీలతో 43 పరుగులు చేసి నాటౌట్‌గా ఉంది. దీంతో శుక్రవారం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 98 ఓవర్లలో 4 వికెట్లకు 525 పరుగుల రికార్డు స్కోరును సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News