Sunday, December 22, 2024

విమానంలో మహిళతో ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన

- Advertisement -
- Advertisement -

ముంబై: విమానాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో తరచుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ముంబై నుంచి గౌహతి వెళ్తున్న విమానంలో ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీస్‌లు అరెస్ట్ చేశారు. పోలీస్‌లు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి 9 గంటలకు ఇండిగో విమానం 6ఇ5319 ముంబై నుంచి గౌహతికి బయలుదేరింది. ఈ విమానంలో అమన్ అనే ప్రయాణికుడు ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధిత మహిళ పక్క సీట్లో కూర్చున్న అతడు… క్యాబిన్ లైట్లు ఆఫ్ చేయగానే ఆమెపై చేతులు వేశాడు. నిద్రమత్తులో ఉండటంతో ఆమె ఈ విషయాన్ని గమనించలేదు.

మరోసారి అతడు ఆమెను తాకడానికి ప్రయత్నించగా బాధిత మహిళ గట్టిగా అరచి సీటు లైట్లు ఆన్ చేసి క్యాబిన్ సిబ్బందిని పిలిచింది. తనను అనుచితంగా తాకినట్టు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన గురించి వివరిస్తుండగా, వారి ఎదుటే బాధితురాలికి అతడు క్షమాపణలు చెప్పాడు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడ్ని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఇండిగో విమానయాన సంస్థ స్పందిస్తూ నిందితుడు అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు రావడంతో గౌహతి విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన వెంటనే అతడిని భద్రతా సిబ్బందికి అప్పగించాం. తమ ప్రయాణికుల , సిబ్బంది భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఆ విమానయాన సంస్థ ప్రకటించింది. వికృత ప్రవర్తన వంటి చర్యలను ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేసింది. ఇండిగో విమానాల్లో గత రెండు నెలల్లో నమోదైన లైంగిక వేధింపుల కేసుల్లో ఇది నాల్గో కేసు కావడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News