Monday, December 23, 2024

మువ్వన్నెల రెపరెపలకు భారతావని సర్వంసిద్ధం.. ఆన్‌లైన్ సెల్ఫీ పోటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : 77వ సాతంత్ర దినోత్సవ వేడుకలకు యావత్ భారతావని సిద్ధమైంది. ఊరూవాడా మువ్వెన్న జెండాలు రెపరెపలాడనున్నాయి. మంగళవారం ఢిల్లీ ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. అనంతరం దేశ పౌరులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మోడీకి ఇది వరుసగా 10వ ప్రసంగం కావడం విశేషం. ఈ సందర్భంగా తన ప్రభుత్వ విజయాలతో పాటు కీలక పథకాలు కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా భారత్‌కు పెరుగుతున్న ప్రతిష్టను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశాలులన్నాయి. 2021 మార్చి 12న అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమం నుంచి ప్రధాని ప్రారంభించిన స్వాతంత్య్ర అమృత మహోత్సవ వేడుకలు ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవంతో పరిసమాప్తమవుతాయి. దేశం మరోసారి అమృత కాలంలోకి ప్రవేశిస్తుంది. గతేడాదితో పొలిస్తే ఈ ఏడాది భారీ సంఖ్యలో అతిథులను ఆహ్వానించారు. ఎర్రకోట దగ్గర నిర్వహించే వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ రంగాల నుంచి సుమారు 1,800 మందిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు.

జన భాగస్వామ్యం పేరిట ప్రభుత్వం అనుసరిస్తున్న దార్శనిక కార్యక్రమానికి అనుగుణంగా ఈ ఆహ్వానం పంపారు. ఈ ప్రత్యేక అతిథులలో ఉజ్వల గ్రామాల నుంచి 400 మంది సర్పంచులు సహా 660 మందికిపైగా ఆహ్వానితులున్నారు. అలాగే రైతు ఉత్పత్తిదారు సంస్థల నుంచి 250 మంది, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం-ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి పథకం కింద 50 మంది వంతున, కొత్త పార్లమెంట్ భవనం సహా సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న 50 మంది కార్మికులు, 50 మంది ఖాదీ కార్మికులు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారుల నుంచి 50 మంది వంతున వీరిలో ఉన్నారు.

సందర్శకులు సెల్ఫీలు తీసుకునేందుకు 12 నిర్దిష్ట ప్రదేశాలను ప్రకటించారు. నేషనల్ వార్ మెమోరియల్, ఇండియా గేట్, విజయ్ చౌక్, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ప్రగతి మైదాన్, రాజ్ ఘాట్, జామా మసీదు, రాజీవ్ చౌక్, ఢిల్లీ గేట్ మెట్రో స్టేషన్లు, ఐటిఓ మెట్రో గేట్, నౌబత్ ఖానా, షీష్ గంజ్ గురుద్వారా ప్రాంతాలను వివిధ పథకాలు-ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతిబింబించేలా సిద్ధం చేశారు.

ఆన్‌లైన్ సెల్ఫీ పోటీ…
వేడుకల్లో భాగంగా ఆగస్టు 15 నుంచి 20 వరకు మైగవ్ పోర్టల్‌లో రక్షణ మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్ సెల్ఫీ పోటీ నిర్వహిస్తుంది. ఇందులో పాల్గొనేవారు 12 ప్రసిద్ధ ప్రదేశాల్లో తీసుకున్న ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సెల్ఫీలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. ఈ పోటీ ఆధారంగా ప్రతి ప్రదేశంలోని సెల్ఫీ ఆధారంగా 12 మంది విజేతలను ఎంపిక చేసి ఒక్కొక్కరికి పది వేల వంతున నగదు బహుమతిని అందజేచేస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News