Tuesday, November 5, 2024

చీలిక తంత్రం.. ఇండిపెండెంట్ల మంత్రం

- Advertisement -
- Advertisement -

ప్రత్యర్థి పార్టీల ఓట్లను చీల్చేందుకు కొత్త ఎత్తుగడలు!
ప్రధాన అభ్యర్థులకు మేలు చేసే విధంగా స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి..

ఒక్క ఓటు నేతల తలరాత, రాజకీయ భవిష్యత్‌ను తారుమారు చేస్తుంది. జయాపజయాలను నిర్ధేశిస్తుంది. నువ్వా, నేనా అనేంత పోటీ ఉన్న చోట ఓట్లను చేజారకుండా కాపాడుకోవటం అభ్యర్థులకు సవాలే అని చెప్పాలి. ప్రస్తుతం ఇంతటి క్లిష్ట వాతావరణం ఉన్న చోట ప్రధాన రాజకీయపార్టీలు గెలుపే లక్ష్యంగా ఎత్తుకు పై ఎత్తులతో తెరవెనుక రాజకీయం నడిపిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసేందుకు.. స్వతంత్ర అభ్యర్థులను బరిలోకి దింపి ఓట్లను చీల్చుతున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఓట్ల కోసం బహిరంగ ప్రచారాలతో పాటు తెరవెనుక రాజకీయాలు నడిపిస్తారు. ఇందులో వారి మొదటి అస్త్రం ఓట్లను చీల్చడం. దీంతో లబ్ధిపొందాలని ప్రణాళికలు రచిస్తున్నారు.

కులం, మతాల ఆధారంగా స్వతంత్రులు బరిలోకి…
మీ వెనుక మేమున్నాం ప్రత్యర్థి పార్టీల ఓట్లను చీల్చేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఓట్లను చీల్చడానికి నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల కులం, మతాల ఆధారంగా స్వతంత్రులను బరిలోకి దింపుతున్నారు. ఆయా సామాజిక వర్గాలు, తటస్థ ఓటర్ల ఓట్లు ప్రత్యర్థి పార్టీకి పడకుండా ఉండేలా అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ప్రతిసారి ఎన్నికల్లో నలుగురైదుగురు స్వతంత్ర అభ్యర్థులు ఇలా ప్రధానపార్టీలకు మేలు చేసేలా విధంగా పోటీలో ఉండటం సర్వసాధార ణంగా మారింది. అన్నిపార్టీల్లో అసెంబ్లీ టికెట్లు ఆశించి దక్కని కొందరు రెబల్స్‌గా తమ ప్రభావం చూపాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. తాము విజయం సాధించకున్నా ఓట్లు చీల్చి తమ ప్రత్యర్థులను ఓడించాలన్న ధోరణితో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలో నిలవడం విశేషం.రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 5.7లక్షల ఓటర్లున్నారు. ఇక్కడ బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపిల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. గెలుపును ప్రభావితం చేయగల మైనార్టీ ఓట్లు ఎంఐఎంకు చీలడంతో ఏ పార్టీకి మేలు జరుగుతుందన్నది చర్చనీయాంశంగా మారింది.

ఇక జూబ్లీహిల్స్ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన విష్ణువర్దన్ రెడ్డి బిఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ తరఫున మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పోటీలో నిలిచారు. ఇక్కడ మైనార్టీల ఓట్లు లక్షకు పైగానే ఉంటాయని అంచనా. అయితే ఎంఐఎం సైతం తమ అభ్యర్థిని బరిలో నిలిపింది. దీంతో ఇక్కడ చీలిక ఓట్లు ఏ అభ్యర్థికి గెలుపును తెచ్చిపెడతాయన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. కూకట్‌పల్లిలో సెటిలర్ల ఓటింగ్ కీలకం. 5 లక్షల ఓటర్లున్న ఇక్కడ బిఆర్‌ఎస్, కాంగ్రెస్, జనసేన బరిలో నిలిచాయి. బిజెపితో పొత్తులో భాగంగా జనసేన బరిలోకి దిగింది. ఆయా పార్టీల్లో కొందరు కీలక నేతలు, అసంతృప్త నేతలు తమ సొంతపార్టీని వదలి వేర్వేరు పార్టీలకు మద్దతు పలుకుతున్నారు. బహిష్కృత నేతలను పార్టీల కీలక నేతలు బుజ్జగించినా కొందరు నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలోకి దిగుతున్నారు. తాను కనీసం 10వేల ఓట్లు పొందుతానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఖైరతాబాద్ స్థానంలో కాంగ్రెస్ నుంచి విజయారెడ్డి, బిఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌లు పోటీపడుతున్నారు. ఇక బిజెపి నుంచి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పోటీలో ఉన్నారు. ఓ పార్టీ నుంచి టికెట్ దక్కని ఇద్దరు కీలక నేతలు తమ అభ్యర్థుల వెంట ప్రచారానికి వెళుతున్నారు. ఓటు మాత్రం మీకు నచ్చిన వారికి వేయమంటూ తమ అనుచరులు, అభిమానులకు సూచిస్తున్నారు. ఈ నేతలు కనీసం 25వేల మంది ఓటర్లను ప్రభావితం చేస్తారని అంచనా. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఓట్లను చీల్చడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నారు.

(ఎల్. వెంకటేశం/మనతెలంగాణ)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News