Wednesday, January 22, 2025

స్వతంత్రులకు గాలం

- Advertisement -
- Advertisement -

ప్రసన్నం చేసుకోవడానికి ఆపసోపాలు పడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు
పోలింగ్ ముందురోజు వరకు కొనసాగనున్న బేరసారాలు

ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో ఇండిపెండెంట్లు

మన తెలంగాణ / హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా నామినేషన్లు దాఖలు చేసిన వారిపై ప్రధాన పార్టీల అభ్యర్ధులు దృష్టిసారించారు. ఇండిపెండెంట్లు, వారికి మద్దతుగా నిలిచే ఓటర్లను కూడా తమవైపు తిప్పుకునేందుకు ఎన్నికల బరిలో ఉన్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్ధులు, నాయకులు భారీగా బేరసారాలు సాగిస్తున్నట్లుగా సమాచారం. నామినేషన్ల ఉపసంహరణకు ఒక్కరోజే గడువు ఉన్నందున (ఈనెల 15వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది) ప్రధాన పార్టీల అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేసిన అభ్యర్థులను ఎన్నికల బరిలో నుంచి తప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని, ప్రస్తుతం మూడు ప్రధాన పార్టీల నాయకులు అదే పనిలో నిమగ్నమయ్యారని ఆయా పార్టీల సీనియర్ నాయకులు వివరించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగుతున్నందున ప్రతి ఒక్క ఓటును ఒక యూనిట్‌గా భావించి ఓటర్లను ఆకట్టుకునేందుకు బూత్‌ల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి మరీ ఎన్నికల బరిలో “డూ ఆర్ డై” అనే పద్దతిలో కృషి చేస్తున్న అభ్యర్ధులు ఏ ఒక్క ఓటునూ కోల్పోకుండా తమకే ఓట్లు దక్కేటట్లుగా చేసుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డి కృషి చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఇండిపెండెంట్లను కూడా ప్రసన్నం చేసుకునేందుకు, వారితో నామినేషన్లను ఉపసంహరింపజేసుకునేందుకు రకరకాల తాయిలాలు ముట్టజెప్పడానికి, మేరసారాలు సాగించడానికి మధ్యవర్తులను పురమాయించినట్లుగా కొందరు సీనియర్ నాయకులు వివరించారు.

మొదటి ప్రయత్నంలో నామినేషన్లను ఉపసంహరింప జేసుకుంటామని, అప్పటికీ బేరసారాలు కుదరకపోయి ఎన్నికల బరిలో కొనసాగుతున్నప్పటికీ పోలింగ్ సమయం వరకూ తమకు మచ్చిక చేసుకునేందుకు తగినంత సమయం కూడా ఉంటుందని, పోలింగ్ జరిగే ఈనెల 30వ తేదీకి రెండు, మూడు రోజుల ముందు వరకూ బేరసారాలు కొనసాగిస్తామని, ఆ సమయానికి స్వతంత్రులు కూడా ఒక మెట్టు దిగుతారని, అప్పటికైనా తమతో బేరానికి రావడం తప్ప వేరే గత్యంతరం ఉండదని కూడా ఆ నాయకులు ధీమాగా చెబుతున్నారు. 4798 నామినేషన్లు దాఖలు కాగా అందులో 608 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని, ఇందులో 90 శాతం మంది ఇండిపెండెంట్లు తమతమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు సీనియర్ నాయకులు అంచనా వేస్తున్నారు.

ఒకవేళ నామినేషన్లను ఉప సంహరించుకోకుండా బరిలో కొనసాగినప్పటికీ పోలింగ్ సమయం దగ్గరపడే నాటికి ఏదో ఒక పార్టీకి, ఎవ్వరో ఒక అభ్యర్థికి అనుకూలంగా మారిపోతారని ధీమాగా చెబుతున్నారు. కాకుంటే ఒక్కొక్కరికి ఒక్కో లక్ష్యం ఉంటుందని, ఆ లక్ష్యాలను నెరవేర్చగలిగే అభ్యర్ధి ఎవ్వరైతే వారి వెంట ఇండిపెండెంట్లు నడుస్తారని అంటున్నారు. సాధారణంగా ఇండిపెండెంట్లుగా నామినేషన్లు దాఖలు చేసే వారికి కొన్ని లక్షాలు ఉంటాయని, అందులో తమతమ గ్రామాలు, పట్టణాల అభివృద్ధి, సంక్షేమం కోసం స్వతంత్రులుగా బరిలోకి దిగేది కొద్దిమందే ఉంటారని, అలాకాకుండా తమకు బలంగా ఉన్న కుటుంబ సభ్యులు, బంధువర్గాలు, కులపోళ్ళ మద్దతు, కుల సంఘాల మద్దతులను కూడగట్టుకొని ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓట్లకు గండికొట్టాలనే లక్షాలతో నామినేషన్లు దాఖలు చేస్తుంటారని వివరించారు. అంతేగాక ప్రత్యర్ధులను ఓడించడానికి కూడా మరో అభ్యర్థి పక్కా వ్యూహంతో ఇండిపెండెంట్లను బరిలోకి దించిన అసెంబ్లీ స్థానాలు కూడా ఉన్నాయని ఆ నాయకులు వివరించారు. తమతమ నియోజకవర్గాల్లో బలమైన సామాజిక వర్గం ఓట్లను చీల్చేందుకు కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ముగ్గురు వ్యక్తులను స్వతంత్రులుగా బరిలోకి దింపిన ప్రధాన పార్టీల అభ్యర్ధులు కూడా ఈ ఎన్నికల్లో ఉన్నారని, ఇలా స్థానికంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇండిపెండెంట్లను ఎక్కువ సంఖ్యలో బరిలోకి దింపడానికి అనేక కారణాలు ఉన్నాయని వివరించారు.

అధికార బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ఇండిపెండెంట్ల బెడద ఎక్కువగానే ఉందని అంటున్నారు. చివరకు ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లాల్లోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఇండిపెండెంట్లు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడానికి కూడా ప్రత్యేక ఎజెండానే ఉందని, ఈ జిల్లాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్లను దాఖలు చేసిన ఇండిపెండెంట్లతో ఉపసంహరింపజేసే ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోందని వివరించారు. కొన్ని స్పష్టమైన హామీలను ఇవ్వడమే కాకుండా అందుకు “తగిన భరోసా” ఇచ్చామని, అందుచేతనే స్వతంత్రులతో నామినేషన్లను ఉపసంహరింప చేయడమే కాకుండా, ఆ అభ్యర్ధులు అధికార బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధి గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృష్టి చేస్తారని వివరించారు. అంతేగాక కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారిన కొడంగల్‌లో కూడా స్వతంత్రులతో తమతమ నామినేషన్లను ఉపసంహరింపజేసేందుకు మధ్యవర్తులు రంగంలోకి దిగారని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు వివరించారు.

బిజెపి గంపెడాశలు పెట్టుకొన్న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా స్వతంత్రులతో నామినేషన్లను ఉపసంహరింపజేసే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోందని కమలం పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు వివరించారు. అయితే ఇండిపెండెంట్‌లుగా నామినేషన్లు దాఖలు చేసిన మెజారిటీ నేతలు పెద్దమొత్తాల్లో నిధులే కాకుండా రకరకాల డిమాండ్లు పెడుతున్నారని, వారిని ప్రసన్నం చేసుకోవడానికి తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆ స్వతంత్ర అభ్యర్ధికి ఏమేమి చేయాలో అవన్నీ ప్రామిసరీ నోట్‌లను రాసుకొని ఒప్పందాలు కూడా చేసుకొంటున్నామని వివరించారు. ఎలాగైనా సరే స్వతంత్రుల మూలంగా ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓట్లకు గండిపడకుండా చేసేందుకు ఆయా పార్టీలకు చెందిన మధ్యవర్తులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని వెల్లడించారు. అందుచేతనే స్వతంత్రులు, వారి బలగం ఎటువైపు నిలుస్తుందోనని తెలియాలంటే ఈనెల 25వ తేదీ వరకూ వేచి చూడాల్సిందేనని, అప్పటి వరకూ ఈ స్వతంత్రులు, వారికున్న ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతారోననే విషయంలో ఎలాంటి స్పష్టత రాదని ఆ సీనియర్ నాయకులు గట్టిగా చెబుతున్నారు. అప్పటి వరకూ వేచిచూడండి అని అంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News