Monday, January 20, 2025

వెస్టిండీస్‌తో రెండో టెస్టు: యశస్వి, రోహిత్ జోరు..

- Advertisement -
- Advertisement -

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్‌తో గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో టీమిండియా శుభారంభం చేసింది. మొదటి లంచ్ విరామ సమయానికి భారత్ 26 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 121 పరుగులు చేసింది. భారత్‌-వెస్టిండీస్ జట్ల మధ్య ఇది వందో టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈసారి కూడా భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మలు మెరుగైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు.

ఇద్దరు విండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. ఈ జోడీని ఓడించేందుకు ఆతిథ్య టీమ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రోహిత్ సమన్వయంతో బ్యాటింగ్ చేయగా, యశస్వి దూకుడును ప్రదర్శించాడు. ఆరంభంలో రోహిత్ చెలరేగి ఆడగా ఆ తర్వాత యశస్వి బ్యాట్‌ను ఝులిపించాడు. కెరీర్‌లో రెండో టెస్టు మ్యాచ్ ఆడుతున్న యశస్వి అర్ధ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ధాటిగా ఆడిన యశస్వి 56 బంతుల్లోనే 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 52 పరుగులు చేశారు.

మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న రోహిత్ శర్మ 102 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 63 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. డొమినికా వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఊహించినట్టే భారత్‌కు మెరుగైన ఆరంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్, యశస్వి దూకుడుగా ఆడడంతో భారత్ మొదటి సెషన్ ఆటలో పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో ముకేశ్ కుమార్ ఆరంగేట్రం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News