చెలరేగిన అక్షర్, రాణించిన అశ్విన్, లాథమ్ సెంచరీ మిస్, కివీస్ 296 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 14/1.
కాన్పూర్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు అనూహ్యంగా పుంజుకున్నారు. రెండో రోజు ఒక్క వికెట్‌ను కూడా పడగొట్టని భారత బౌలర్లు శనివారం మూడో రోజు ఆటలో చెలరేగి పోయారు. స్పిన్ త్రయం అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ అద్భుత బౌలింగ్‌ను కనబరచడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 142.3 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియాకు కీలకమైన 49 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ శనివారం ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (1)ను జేమిసన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. మయాంక్ అగర్వాల్ (4), చటేశ్వర్ పుజారా (9) క్రీజులో ఉన్నారు. దీంతో టీమిండియా ఆధిక్యం 63 పరుగులకు చేరింది.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 129/0తో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ విల్ యంగ్ 214 బంతుల్లో 15 ఫోర్లతో 89 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో 151 పరుగుల తొలి వికెట్ భాగస్వామానికి తెరపడింది. యంగ్ ఔటైనా మరో ఓపెనర్ టామ్ లాథమ్ తన పోరాటాన్ని కొనసాగించాడు. అతనికి కెప్టెన్ విలియమ్సన్ అండగా నిలిచాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న లాథమ్ స్కోరును ముందుకు నడిపించాడు. ఇటు విలియమ్స్ కూడా బాగానే ఆడాడు. ఇద్దరు కుదురు కోవడంతో కివీస్ మరింత పటిష్టస్థితికి చేరుకుంది. కానీ 64 బంతుల్లో రెండు బౌండరాలతో 18 పరుగులు చేసిన విలియమ్సన్‌ను ఉమేశ్ వెనక్కి పంపాడు. దీంతో కివీస్ 197 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది.
అక్షర్ జోరు..
ఆ తర్వాత భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ చెలరేగి పోయాడు. ప్రత్యర్థి అద్భుత బౌలింగ్‌తో కివీస్ బ్యాటర్లను హడలెత్తించాడు. తొలు సీనియర్ బ్యాటర్ రాస్ టెలర్‌ను వెనక్కి పంపాడు. రాస్ 11 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే హెన్రీ నికోల్స్‌ను కూడా అక్షర్ ఔట్ చేశాడు. నికోల్స్ రెండు పరుగులు మాత్రమే చేసిన అక్షర్ వేసిన బంతికి వికెట్ల ముందు దొరికి పోయాడు. కొద్ది సేపటికే ప్రమాదకర బ్యాట్స్‌మన్ టామ్ లాథమ్‌ను కూడా అక్షర్ వెనక్కి పంపాడు. లాథమ్ సెంచరీకి ఐదు పరుగుల దూరంలో ఔటయ్యాడు. 282 బంతుల్లో పది బౌండరీలతో 95 పరుగులు చేసిన లాథమ్ భారీ షాట్‌కు ప్రయత్నించి స్టంపౌట్ అయ్యాడు. అంతేగాక వికెట్ కీపర్ టామ్ బ్లుండెల్ (13)ను కూడా అక్షర్ పెవిలియన్ బాట పట్టించాడు. మరోవైపు రచిన్ రవీంద్రను జడేజా వెనక్కి పంపాడు.
రచిన్ 13 పరుగులు చేశాడు. చివర్లో జేమిసన్ ఒక్కడే కాస్త పోరాటం చేశాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన జేమిసన్ ఒక ఫోర్ 23 పరుగులు సాధించాడు. టిమ్ సౌథి ఐదు పరుగులు చేసి అక్షర్ వేసిన అద్భుత బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇక సోమర్ విల్లే రక్షణాత్మకమైన బ్యాటింగ్ భారత బౌలర్లను విసుగెత్తించాడు. 52 బంతులు ఎదుర్కొన్న సోమర్‌విల్లే ఆరు పరుగులు చేసి అశ్విన్‌బౌలింగ్‌లో ఔటయ్యాడు. అశ్విన్ అద్భుత బంతితో అతన్ని క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో కివీస్ ఇన్నింగ్స్ 296 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 62 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ మూడు, రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్‌లు చెరో వికెట్ పడగొట్టారు. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.
అనూహ్య మలుపు..
భారత్‌న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు అనూహ్య మలుపులు తిరుగుతోంది. తొలి రోజు ఆటలో భారత్ ఆధిపత్యం చెలాయించింది. అయితే రెండో రోజు ఆటలో న్యూజిలాండ్ పైచేయి సాధించింది. భారత్‌ను అనుకున్నదానికంటే తక్కువ స్కోరుకే కివీస్ పరిమితం చేసింది. అంతేగాక బ్యాటింగ్‌లోనూ రాణించి వికెట్ నష్టపోకుండా 129 పరుగులు నమోదు చేసింది. అయితే శనివారం మూడో రోజు ఆటలో మళ్లీ భారత్ ఆధిపత్యం చెలాయించింది. ఒక దశలో వికెట్ నష్టానికి 196 పరుగులతో ఉన్న న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు 296 పరుగులకే కుప్పకూల్చారు. అక్షర్ పటేల్, అశ్విన్‌లు అసాధారణ బౌలింగ్‌తో కివీస్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. మరోవైపు రెండో ఇన్నింగ్స్ చేపట్టిన భారత్‌ను జేమిసన్ దెబ్బతీశాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను అతను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో భారత్ రెండు పరుగుల వద్దే తొలి వికెట్‌ను కోల్పోయింది.