Wednesday, January 22, 2025

భారత్ 156 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరుకుంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే కుప్పకూలింది. దీంతో కివీస్‌కు 103 పరుగుల కీలక మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన న్యూజిలాండ్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 53 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. దీంతో కివీస్ ఓవరాల్ ఆధిక్యం 301 పరుగులకు చేరింది. మరో వంద పరుగులు సాధిస్తే ఈ మ్యాచ్‌లోనూ భారత్‌కు ఓటమి ఖాయమనే చెప్పాలి. అదే జరిగితే సుదీర్ఘ విరామం తర్వాత సొంత గడ్డపై టీమిండియా ఓ టెస్టు సిరీస్ ఓడి పోవడం తథ్యం. ఇప్పటికే బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మ్యాచ్‌లోనూ భారత్‌కు ఇలాంటే పరిస్థితే ఎదురయ్యే అవకాశాలున్నాయి.

సాంట్నర్ జోరు..
ఓవర్‌నైట్ స్కోరు 16/1తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ ఆరంభంలో కాస్త బాగానే ఆడింది. యశస్వి జైస్వాల్, గిల్‌లు కుదురుగా ఆడుతూ స్కోరును ముందుకు నడిపించారు. ఇద్దరు జాగ్రత్తగా ఆడడంతో భారత్ కోలుకున్నట్టే కనిపించింది. కానీ 72 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 30 పరుగులు చేసిన గిల్‌ను సాంట్నర్ ఔట్ చేశాడు. దీంతో 49 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.ఈ దశలో జట్టును ఆదుకుంటాడని భావించిన సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి మళ్లీ నిరాశే మిగిల్చాడు. భారీ ఆశలు పెట్టుకున్న కోహ్లి పేలవమైన బ్యాటింగ్‌తో అభిమానులను నిరాశ పరిచాడు. 9 బంతులు ఎదుర్కొన్న కోహ్లి కేవలం ఒక పరుగు మాత్రమే చేసి మిఛెల్ సాంట్నర్ వేసిన అద్భుత బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత భారత్ మళ్లీ కోలుకోలేక పోయింది.

సాంట్నర్ అద్భుత బౌలింగ్‌తో టీమిండియా బ్యాటర్లను హడలెత్తించాడు. అతని ధాటికి తట్టుకోలేక బ్యాట్స్‌మెన్‌లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన యశస్వి 60 బంతుల్లో 4 ఫోర్లతో 30 పరుగులు చేశాడు. కొద్ది సేపటికే వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా వెనుదిరిగాడు. 2 ఫోర్లతో 18 పరుగులు చేసిన పంత్‌ను ఫిలిప్స్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇక మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో చిరస్మరణీయ సెంచరీతో అలరించిన సర్ఫరాజ్ ఖాన్ ఈసారి నిరాశ పరిచాడు. 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఈ వికెట్‌ను సాంట్నర్ పడగొట్టాడు. రవిచంద్రన్ అశ్విన్ 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ధాటిగా ఆడిన రవీంద్ర జడేజా 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 30 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆకాశ్‌దీప్ (6), బుమ్రా (0)లను కూడా సాంట్నర్ ఔట్ చేశాడు. వాషింగ్టన్ సుందర్ 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 18 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సాంట్నర్ ధాటికి భారత్ ఇన్నింగ్స్ 45.3 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బౌలర్లలో సాంట్నర్ 53 పరుగులు మాత్రమే ఇచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. ఫిలిప్స్‌కు రెండు వికెట్లు దక్కాయి.

ఆదుకున్న లాథమ్
తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు టామ్ లాథమ్, డెవోన్ కాన్వేలు శుభారంభం అందించారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. అయితే రెండు ఫోర్లతో 17 పరుగులు చేసిన కాన్వేను సుందర్ వెనక్కి పంపాడు. వన్‌డౌన్‌లో వచ్చిన విల్ యంగ్ 23 పరుగులు చేసి అశ్విన్‌కు చిక్కాడు. మరోవైపు స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర 9 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. డారిల్ మిఛెల్ (18) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా లాథమ్ తన జోరును కొనసాగించాడు. భారత బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ 133 బంతుల్లో 10 ఫోర్లతో 86 పరుగులు చేసి ఔటయ్యాడు. శుక్రవారం ఆట ముగిసే సమయానికి టామ్ బ్లుండెల్ (30), ఫిలిప్స్ (9) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News