న్యూజిలాండ్‌తో బెంగళూరుతో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య టీమిండియా మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో 92 ఏళ్ల టెస్టు చరిత్రలో అత్యంత చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన న్యూజిలాండ్ గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసి మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరింది. కివీస్‌కు ఇప్పటికే కీలకమైన 134 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓపెనర్ డెవోన్ కాన్వే 105 బంతుల్లోనే 11 ఫోర్లు, మూడు సిక్సర్లతో 91 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. కెప్టెన్ టామ్ లాథమ్ (15), విల్ యంగ్ (33) తమవంతు పాత్ర పోషించారు. కాగా, రచిన్ రవీంద్ర (22), డారిల్ మిఛెల్ (14) క్రీజులో ఉన్నారు.
టపా..టపా
సొంత గడ్డపై టీమిండియాకు ఎదురే లేదని భావిస్తున్న తరుణంలో న్యూజిలాండ్ బౌలర్లు మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓరౌర్కీ అసాధారణ బౌలింగ్‌తో భారత బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వీరి ధాటికి తట్టుకోలేక టీమిండియా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ క్రమంలో ఐదుగురు బ్యాట్స్‌మెన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారంటే భారత బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన అతి పెద్ద తప్పుగా చెప్పాలి. భారీ వర్షంతో చిన్నస్వామి స్టేడియం ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉన్న సమయంలో బ్యాటింగ్ తీసుకోవడం ఎంత పొరపాటు టీమిండియాకు ఆరంభంలోనే అర్థమైపోయింది. రోహిత్ చెత్త నిర్ణయానికి భారత్ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆరంభం నుంచే కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. వీరిని ఎదుర్కొవడంలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అయితే దాదాపు ఆరు ఓవర్ల పాటు భారత ఓపెనర్లు ఓపిగ్గా బ్యాటింగ్ చేశారు. కానీ అప్పటికే సహనం కోల్పోయిన కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేయాలని నిర్ణయించాడు. కానీ ఈ వ్యూహం ఫలించలేదు. కివీస్ సీనియర్ బౌలర్ టిమ్ సౌథి అద్భుత ఇన్‌స్వింగర్‌తో రోహిత్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత భారత్ వెంటవెంటనే మరో రెండు వికెట్లను కోల్పోయింది. జట్టును ఆదుకుంటాడని భావించిన సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి పూర్తిగా నిరాశ పరిచాడు. 9 బంతులు ఎదుర్కొన్న కోహ్లి కనీసం ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. ఆ వెంటనే యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కూడా ఔటయ్యాడు. అతను కూడా సున్నాకే వెనుదిరిగాడు. ఈ దశలో యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ 11 ఓవర్ల పాటు ప్రత్యర్థి బౌలర్లకు వికెట్ ఇవ్వలేదు. కానీ కీలక సమయంలో యశస్వి ఏకాగ్రత కోల్పోయాడు.
భారీ షాట్‌కు ప్రయత్నించి వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఆ తర్వాత టీమిండియా మళ్లీ కోలుకోలేక పోయింది. వచ్చిన బ్యాటర్ వచ్చినట్లే పెవిలియన్ బాట పట్టారు. కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు సున్నాకే వెనుదిరిగారు. కుల్దీప్ యాదవ్ (2), బుమ్రా (1) కూడా విఫలమయ్యారు. భారత బ్యాటర్లలో యశస్వి (13), రిషబ్ పంత్ (20) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 15 పరుగులకే 5, విలియమ్ ఓరౌర్కీ 4 వికెట్ల పడగొట్టారు. సౌథికి ఒక వికెట్ దక్కింది.
ఏళ్ల చరిత్రలో..
కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా తన 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. న్యూజిలాండ్ చేతిలో భారత్ 46 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో సొంత గడ్డపై తన అత్యల్ప స్కోరును నమోదు చేసింది. గతంలో 1987లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 75 పరుగులకు ఆలౌటైంది. ఇప్పటి వరకు ఇదే భారత అత్యల్ప స్కోరుగా ఉండేది. కానీ తాజాగా బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 46 పరుగులకే ఆలౌటై చెత్త రికార్డును తిరగరాసింది. ఈ మ్యాచ్‌లో ఐదుగురు భారత బ్యాటర్లు డకౌట్ కావడం గమనార్హం.