Friday, December 20, 2024

2040 నాటికి చంద్రుడిపైకి తొలి భారతీయుడు.. శాస్త్రవేత్తలకు మోడీ సూచన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : చంద్రయాన్ 3 చారిత్రక విజయం , ఆదిత్య ఎల్ 1 ప్రయోగంతో అంతరిక్ష రంగంలో భారత ఖ్యాతి మరింత పెరిగింది. ఆ విజయ పరంపరను కొనసాగిస్తున్న రాబోయే 20 ఏళ్లకు మరిన్ని ప్రతిష్ఠాత్మక లక్షాలను నిర్దేశించుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ దేశ శాస్త్రవేత్తలకు సూచించారు. మరో పదేళ్లలో భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు, 2040 నాటికి చంద్రుడిపై తొలి భారతీయుడు అడుగు పెట్టేలా లక్షం పెట్టుకోవాలని ప్రధాని దిశా నిర్దేశం చేశారు.

గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా మొట్టమొదటి వెహికల్ డెవలప్‌మెంట్ ఫ్లైట్ (టీవీడీ1) క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ను అక్టోబర్ 21న పరీక్షించనున్నారు. ఈ కార్యక్రమ సన్నద్ధత, ప్రయోగ ఏర్పాట్లపై ప్రధాని మోడీ నేతృత్వంలో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో భవిష్యత్ అంతరిక్ష పరిశోధనా ప్రయోగాలపై శాస్త్రవేత్తలకు ప్రధాని పలు సూచనలు చేశారు. శుక్రగ్రహంపై ఆర్బిటర్ మిషన్, అంగారకుడిపై ల్యాండర్ వంటి ప్రయోగాల దిశగా శాస్త్రవేత్తలు కృషి చేయాలన్నారు. “ చంద్రయాన్ 3 , ఆదిత్య ఎల్1 విజయాలు అందించిన ఉత్సాహంతో భారత్ ఇప్పుడు మరిన్ని కొత్త, ప్రతిష్ఠాత్మక లక్షాలను నిర్దేశించుకోవాలి. 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు, 2040 నాటికి చంద్రుడి పైకి తొలి భారతీయుడిని పంపించే విధంగా ప్రయోగాలు చేపట్టాలి ” అని మోడీ సూచించినట్టు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది.

2025 నాటికి గగన్‌యాన్ మిషన్‌ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం 20 ప్రధాన పరీక్షలను నిర్వహించనున్నారు. మొట్టమొదటి క్రూ ఎస్కేప్ సిస్టమ్ పరీక్షను అక్టోబర్ 21న చేపట్టనున్నారు. పరీక్షలో భాగంగా మాడ్యూల్‌ను అంతరక్షం లోకి పంపడం , దానిని సముద్రంలో పడేలా చేయడం, అనంతరం మోడ్యూల్‌ను స్వాధీనం చేసుకుని పునర్వినియోగానికి సిద్ధం చేయడం వంటివి చేపట్టనున్నారు. నౌకాదళం ఇప్పటికే మాడ్యూల్‌ను తిరిగి పొందేందుకు అవసరమైన మాక్ ఆపరేషన్లను చేపట్టింది. అంతరిక్షంలో వ్యో మనౌక సమస్యను ఎదుర్కొంటే సిబ్బందిని తిరిగి భూమికి తీసుకురావడంలో ఈ టెస్ట్ సాయపడుతుంది. ఈ గగన్‌యాన్ మిషన్ విజయవంతమైతే భారత్ చేపట్టే మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర ఇదే కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News