Wednesday, January 22, 2025

ఇద్దరే కూల్చేశారు..

- Advertisement -
- Advertisement -

చెలరేగిన సుందర్, అశ్విన్
కివీస్ 259 ఆలౌట్, భారత్ 16/1
తొలి రోజు బౌలర్ల హవా

పుణె: భారత్‌తో పుణె వేదికగా గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకే కుప్పకూలింది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (6), శుభ్‌మన్ గిల్ (10) క్రీజులో ఉన్నారు. కివీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరును చేరుకోవాలంటే భారత్ మరో 243 పరుగులు చేయాలి.
ఆదుకున్న కాన్వే, రచిన్ అంతకుముందు టాస్ గెలిచి బ్యా టింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌కు ఓపెనర్లు టామ్ లాథమ్, డెవోన్ కాన్వే శుభారంభం అందించారు.

ఇద్దరు కుదురుగా ఆడుతూ స్కోరు ను ముందుకు తీసుకెళ్లారు. కానీ 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన లాథమ్‌ను రవిచంద్రన్ అశ్విన్ వెనక్కి పంపాడు. వన్‌డౌన్‌లో వచ్చిన విల్ యంగ్‌తో కలిసి కాన్వే పోరాటం కొనసాగించాడు. ఇద్దరు జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్‌ను పటిష్టపరిచేందుకు ప్రయత్నించారు. అయితే కుదురుగా ఆడుతున్న యంగ్‌ను అశ్విన్ వెనక్కిం పంపాడు. యంగ్ 18 పరుగులు చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కాన్వే జోరును కొనసాగించాడు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. అతనికి రచిన్ రవీంద్ర అండగా నిలిచాడు.

ఇటు కాన్వే, అటు రచిన్ నిలకడగా ఆడుతూ కివీస్‌ను కష్టాల్లో నుంచి గట్టెక్కించారు. కానీ 141 బంతుల్లో 11 ఫోర్లతో 76 పరుగులు చేసిన కాన్వేను అశ్విన్ ఔట్ చేశాడు. అశ్విన్ మూడు వికెట్లు తీసి కివీస్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశాడు. కాగా, రచిన్ సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ స్కోరును ముందుకు నడిపించాడు.

సుందర్ జోరు..

ఈ దశలో వాషింగ్టన్ సుందర్ అసాధారణ బౌలింగ్‌తో చెలరేగి పోయాడు. కుదురుగా బ్యాటింగ్ చేస్తున్న రచిన్ రవీంద్రను అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. రచిన్ 105 బంతుల్లో ఐదు ఫోర్లు, సిక్స్‌తో 65 పరుగులు సాధించాడు. ఆ తర్వాత కివీస్ మళ్లీ కోలుకోలేక పోయింది. సుందర్ వరుస క్రమంలో వికెట్లను తీస్తూ కివీస్ ఇన్నింగ్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశాడు. చివరి ఏడు వికెట్లను సుందరే పడగొట్టడం విశేషం.

డారిల్ మిఛెల్ (18), టామ్ బ్లుండెల్ (3), గ్లెన్ ఫిలిప్స్ (9), సౌథి (5), ఎజాజ్ పటేల్ (4), సాంట్నర్ (33)లను సుందర్ ఔట్ చేశాడు. అద్భుత బౌలింగ్‌ను కనబరిచిన సుందర్ 59 పరుగులు మాత్రమే ఇచ్చి ఏడు వికెట్లను పడగొట్టాడు. అశ్విన్‌కు మూడు వికెట్లు దక్కాయి. కివీస్ ఇన్నింగ్స్‌లోని పది వికెట్లను వీరిద్దరే పడగొట్టడం విశేషం. కాగా, న్యూజిలాండ్ చివరి ఆరు వికెట్లను 62 పరుగుల తేడాతో కోల్పోవడం గమనార్హం. ఇదిలావుంటే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ 10 ఆధిక్యంలో కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News