Sunday, January 26, 2025

ఇండియా కూటమి విచ్ఛిన్నమైపోయినట్లేనా?

- Advertisement -
- Advertisement -

ఇండియా కూటమి మూడునాళ్ల ముచ్చటే అని తేలిపోయింది. విభిన్న సిద్ధాంతాలు, అభిప్రాయాలు గల దాదాపు 24 పార్టీలు ఏకంకావడమే అరుదు. జెడి(యు) అధినేత నితీశ్ కుమార్ సూచనతో కేంద్రంలో బిజెపిని 2024 పార్లమెంటు ఎన్నికలలో ఓడించడమే లక్ష్యంగా కూటమి ఏర్పడింది. అనూహ్యంగా కాంగ్రెస్ కూటమిలో పెద్దన్నపాత్ర వహించాల్సి వచ్చింది. కూటమి కన్వీనర్‌గా నితీశ్ కుమార్‌ను ఎన్నుకోవాలన్న భావన అదిలోనే దెబ్బతింది. ఫైర్ బ్రాండ్‌గా పేరుపొందిన మమతా బెనర్జీ మొదటినుంచి ఇండియా కూటమిపట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. కాంగ్రెస్ పెత్తనం ఆమెకు అసలే ఇష్టం లేదు. ఇక కమ్యూనిస్ట్‌లు అంటే ఎప్పుడూ చుక్కెదురే.

కూటమిలో లెఫ్ట్ పార్టీలతో సహ భాగస్వామిగా ఉండేందుకు విముఖత చూపారు. ఇక బెంగాల్‌లో అసెంబ్లీ గానీ, పార్లమెంటు ఎన్నికలు గానీ ఏ ఎన్నికల్లో అయినా ఒంటరిపోరే తమ సిద్ధాంతంగా ఎంచుకున్నారు. కాంగ్రెస్‌కు 2 పార్లమెంటు స్థానాలు కూడా ఇచ్చేందుకు అంగీకరించలేదు. బెంగాల్‌లో 34 ఏళ్లు అధికారంలో ఉన్నా.. నానాటికీ దిగజారిపోయాయి వామపక్షాలు. బెంగాల్‌లో 48ఏళ్లుగా అధికారానికి దూరమై ఏ ఏటికాయేడు పతనమై.. ప్రస్తుతం నామమాత్రంగా మిగిలిన కాంగ్రెస్, కమ్యూనిస్ట్ లతో కలిసినా కనీసం ఏ ఎన్నికలలోనూ విజయాన్ని అందుకోలేకపోయారు. పార్లమెంటు ఎన్నికల నాటికి కూటమిలో కీలక పార్టీలు బిజెపికి దీటుగా ఒకే ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలన్న లక్ష్యం మసక బారిపోయింది. ఆమ్‌ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ పరిస్థితి మరోలా ఉంది. ఇష్టం లేకుండానే కూటమిలో చేరినట్లు కన్పించారు. లోక్‌సభ ఎన్నికల నాటికి ఢిల్లీలో పొత్తు.. పంజాబ్‌లో లేదు అన్నట్లు వ్యవహరించారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ తీరు మరోలా ఉంది. కాంగ్రెస్‌తో ఉన్నట్లే ఉన్నా.. ఎప్పటికప్పుడు ఆ పార్టీకి చెక్ పెట్టే ధోరణిలోనే వ్యవహరించారు.

మధ్యప్రదేశ్‌లో కనీసం స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ సహకరించకపోవడంతో పూర్తిగా దూరమయ్యారు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమితో ఆ పార్టీపై ప్రతిపక్షాలలో ముఖ్యంగా కూటమి పార్టీలలో పూర్తిగా నమ్మకంపోయింది. కాంగ్రెస్‌కు దాదాపు అన్ని పార్టీలు దూరమయ్యాయి. జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కలిసినా, మహబూబా ముఫ్తీ ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. వయో భారం, అనారోగ్యం కారణంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ అంత చురుగ్గా రాజకీయాల్లో పాల్గొనడం లేదు. ఎన్‌సిపిను అజిత్ పవార్‌వర్గం చీల్చిన తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత శరద్ పవార్ ఇంటికే పరిమితమయ్యారు. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో ఇండియా కూటమి పూర్తిగా రద్దయి పోయినట్లయింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ రెండు టర్మ్‌లుగా అధికారంలో ఉంటోంది.

పదేళ్లుగా కాంగ్రెస్ ఒక అసెంబ్లీ స్థానం కూడా గెలవలేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బిజెపి, ఆమ్‌ఆద్మీ పార్టీకి డైరెక్ట్ ఫైట్‌గా కన్పిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది. ఢిల్లీలో బిజెపి అధికారంలోకి రాకుండా చూడాలంటే.. ఆమ్‌ఆద్మీ పార్టీకి గంపగుత్తగా మద్దతు ఇవ్వాలని ఇండియా కూటమిలో కీలక పార్టీలు నిర్వహించాయి. దీంతో సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఆర్‌జెడి, శివసేన ఉద్ధవ్ పార్టీ ఆమ్‌ఆద్మీ పార్టీకే మద్దతుగా నిలిచాయి. దీంతో కాంగ్రెస్ ఏకాకి అయింది. ఆ పార్టీకి ఆఖరుకు నేషనల్ కాన్ఫరెన్స్ కూడా దూరమైంది. ఇండియా కూటమి అన్నది కేవలం పార్లమెంటు ఎన్నికల కోసం ఏర్పడిందని ఆయన ప్రకటించారు కూడా. దీంతో ఇండియా కూటమి ముక్కచెక్కలైనట్లు స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కలే… భవిష్యత్‌లో. ప్రతిపక్షాల ఐక్యత అసాధ్యమే అని తేలిపోయింది.

పళ్లంరాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News