Sunday, November 17, 2024

‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థి ఖర్గే!

- Advertisement -
- Advertisement -

ప్రతిపాదించిన మమత, మద్దతు పలికిన కేజ్రీవాల్,  సున్నితంగా తోసిపుచ్చిన ఖర్గే, ముందు మనం గెలవాలి.. ఆ తర్వాతే నిర్ణయమని స్పష్టీకరణ,  రాష్ట్రస్థాయిలోనే సీట్ల సర్దుబాటు , జనవరి రెండో వారానికల్లా సీట్ల పంపిణీ పూర్తి,  మీడియాకు వెల్లడించిన ఖర్గే

న్యూఢిల్లీ : రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అధికార బిజెపిని దీటుగా ఎదుర్కోవడమే ఏకైక లక్షంగా ఏర్పడిన ప్రతి పక్షాల ఇండియా’ కూటమి నాలుగో సమావేశం మంగళవారం ముగిసింది. ఢిల్లీలోని అశోకా హోటల్‌లో దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ కీలక భేటీలో పార్లమెంటులో చోటు చేసుకున్న ఘటనలతో పాటుగా భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చించారు. అయితే సమావేశంలో ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించగా, ఢిల్లీ సిఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్‌తో పాటుగా పలువురు నేతలుసమర్థించినట్లు సమాచారం.

సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎండిఎంకె నేత వైకో కూడా ఇదే విషయం చెప్పారు. మమత ప్రతిపాదనకు ఎలాంటి వ్యతిరేకతా రాలేదని ఆయన చెప్పారు. అయితే ఈ ప్రతిపాదనను ఖర్గే సున్నితంగా తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ప్రధాని అభ్యర్థిత్వంపై ఇప్పుడే ప్రకటన చేయవద్దని వారించినట్లు తెలుస్తోంది. ‘తొలుత సమష్టిగా పోరాడుదాం..ఆ తర్వాత ప్రధాని అభ్యర్థిని నిర్ణయిద్దాం’ అని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. మమత ప్రతిపాదన తర్వాత బీహార్ సిఎం నితీశ్ కుమార్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

కాగా సోమవారం ఢిల్లీ చేరుకున్న తర్వాత విలేఖరులతో మాట్లాడిన మమత కూటమి ప్రధాని అభ్యర్థిపై ఏ నిర్ణయమైనా ఎన్నికల తర్వాతే తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. అయితే ఒక్క రోజులోనే ఆమె తన వైఖరిని మార్చుకుని ఖర్గే పేరును సూచించడం గమనార్హం. కాగా సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ తాజాగా జరిగిన విపక్ష కూటమి సమావేశం ముగిసిన అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై 28 పార్టీల నేతల సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని చెప్పారు. దేశవ్యాప్తంగా 8 10 సభలను కలిసికట్టుగా నిర్వహిస్తామని చెప్పారు.అలా చేయకపోతే ప్రజల్లో చైతన్యం తీసుకురాలేమన్నారు. పార్లమెంటు ఉభయ సభలనుంచి విపక్ష ఎంపిలను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేసినట్లు చెప్పారు.

22న దేశవ్యాప్త నిరసన
పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై ప్రధాని, హోంమంత్రి ప్రకటన చేయాలని తాము కోరుతుంటే .. పార్లమెంటులో వారు ఎందుకు మాట్లాడడం లేదని ఖర్గే ప్రశ్నించారు. ఎంపిల సస్పెన్షన్‌పై ఈ నెల 22న దేశవ్యాప్తంగా నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. సీట్ల పంపకాలు రాష్ట్రస్థాయిల్లోనే జరుగుతాయని .. అక్కడ ఏదయినా సమస్య ఉంటే కేంద్ర స్థాయిలో పరిష్కరిస్తామని చెప్పారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, బీహార్, యుపి, ఢిలీ ్లలేదా పంజాబ్ ఎక్కడైనా సరే సీట్ల పంపకంలో సమస్యలను పరిష్కరించుకుంటామని ఖర్గే తెలిపారు. కాగా డిసెంబర్ 30 నాటికల్లా రాష్ట్రాల్లో , కనీసం పశ్చిమ బెంగాల్‌లోనైనా సీట్ల పంపిణీ ఖరారు కావాలని మమత సూచించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కనీసం 300 సీట్లకు పోటీ చేయాలని, ఈ స్థానాల్లో బిజెపితో నేరుగా పోటీ ఉండాలని కూడా మమత సూచించినట్లు తెలుస్తోంది.

జనవరి రెండో వారంలోగా సీట్ల పంపకం ఖరారు
జనవరి రెండో వారంలోగా ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలను ఖరారు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ‘ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి మీరేనా?’అని మీడియా అడిగిన ప్రశ్నకు ఖర్గే సందిస్తూ…తొలుత తాము మెజారిటీ సాధించాలని… ఆ తర్వాతే ఎంపిలు ప్రజాస్వామ్య బద్ధంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ‘ఎంపిలు లేకుండా ప్రధాని అభ్యర్థితత్వం గురించి చర్చించడంలో అర్థం ఏముంటుంది? ముందు మేమంతా కలిసికట్టుగా మెజారిటీ సాధించాలి’ అని అన్నారు.

మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌లు ఖర్గే పేరును ప్రతిపాదించినట్లు వైకో చెప్పిప్పటికీ, దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో కాంగ్రెస్ సహా 28 పార్టీల నేతలు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న ముఖ్య నేత ల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, స్టాలిన్, కేజ్రీవాల్, శరద్‌పవార్, సీతారాం ఏచూరి, డి రాజా,నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News