ప్రధాని పదవి కోసంఅప్పడే ఇండియా కూటమిలో కీచులాట
ప్రధాని మోడీ ఎద్దేవా
మహేంద్రగఢ్(హర్యానా): రానున్న ఐదు సంవత్సరాలలో ఐదుగురు ప్రధాన మంత్రుల గురించి ప్రతిపక్ష ఇండియా కూటమి మాట్లాడుతోందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఆవు పాలు ఇవ్వక ముందే కూటమిలో నెయ్యి కోసం కీచులాట మొదలైందని మోడీ ఎద్దేవా చేశారు. ఆరవ దశ ఎన్నికల ప్రచారం గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ఆయన హర్యానాలోని మహేంద్రగఢ్‌లో ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దళితులు, గిరిజనుల రిజర్వేషన్లను ఎవ్వరూ లాక్కోలేరని ప్రకటించారు. ఎన్నికలలో మీరు దేశ ప్రధాన మంత్రిని మాత్రమే ఎంపిక చేసుకోవడం లేదని, దేశ భవిష్యతును కూడా నిర్ణయిస్తున్నారని ఆయన ప్రజలనుద్దేశించి స్పష్టం చేశారు. మీరు స్వయంగా చూసి తెలుసుకున్న మీ సేవకుడు మోడీ ఒక పక్క, ఎవరో కూడా తెలియని వ్యక్తి మరో పక్క ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కళగంతో కూడిన ఇండియా కూటమిపై ధ్వజమెత్తుతూ అది పూర్తిగా మతతత్వ, కులతత్వ, వారసత్వ కూటమని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలో అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని అనుమతించలేదని మోడీ ఆరోపించారు. ఐదేళ్లలో ఐదుగురు ప్రధాన మంత్రులు ఉంటారని ఇండియా కూటమి మాట్లాడుతోందని ఆయన విమర్శించారు.
1990 దశకంలో హర్యానాలో బిజెపి కోసం తాను పనిచేసిన రోజులను ఆయన గుర్తు చేసుకుంటూ, హర్యానా తన పట్ల చాలా ప్రేమ చూపిందని, తనకు ఇక్కడి ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయని మోడీ తెలిపారు. హర్యానా అభివృద్ధి ఆగదని తాను హామీ ఇస్తున్నానని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ చేసిన పాపాలను కడిగేందుకు గత పదేళ్లు చాలా కష్టపడ్డామని ఆయన వ్యాఖ్యానించారు. తమ ఓటమికి ఎవరిని నిందించాలో ఇండియా కూటమి అప్పుడే సాకులు వెతకడం మొదలు పెట్టిందని ఆయన విమర్శించారు. హర్యానాలోని 10 లోక్‌సభ స్థానాలకు మే 25న(శనివారం) పోలింగ్ జరగనున్నది. గురువారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడింది.