Monday, December 23, 2024

నితీశ్ కినుక..రాహుల్ బుజ్జగింపు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ప్రతిపక్ష ఇండియా కూటమి సమావేశంలో ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే పేరును కొందరు ప్రతిపాదించడంపై బీహార్ ముఖ్యమంత్రి, జెడియు అధినేత నితీశ్ కుమార్ కినుక వహించినట్ల్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం నితీశ్‌తో ఫోన్‌లో మాట్లాడి ఈ విషయంలో కాంగ్రెస్ వైఖరిని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. గత మంగళవారం ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో తమ కూటమి తరఫున ప్రధాన మంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించినట్లు వార్తలు వెలువడ్డాయి. దేశంలో తొలి దళిత ప్రధాన మంత్రి ఖర్గే అవుతారని మమతా బెనర్జీ, కేజ్రీవాల్ అభిప్రాయం వ్యక్తం చేయగా దీనిపై తుది నిర్ణయం జరగలేదు. ఈ విషయాన్ని సమావేశం అనంతరం ఎండిఎంకె నాయకుడు వైకోతోసహా పలువురు నాయకులు ధ్రువీకరించారు.

అయితే ఖర్గే మాత్రం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి గెలిచి, బలాన్ని పెంచుకోవడం ముఖ్యమని, మిగిలిన విషయాలను తర్వాత నిర్ణయించుకోవచ్చని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే నితీశ్ మాత్రం ఖర్గే గురించి ప్రస్తావన వచ్చినట్లు తనకు తెలియదని నితీశ్ రాహుల్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. కాగా..ప్రతిపక్ష కూటమి బలాన్ని గురించి కూడా రాహుల్, నితీశ్ తమ టెలిఫోన్ సంభాషణలో చర్చించారు. బీహార్ క్యాబినెట్ విస్తరణ ప్రస్తావన కూడా వారి మధ్య వచ్చింది. బీహార్ క్యాబినెట్‌లో కాంగ్రెస్ మంత్రుల సంఖ్యను పెంచడానికి తాను సిద్ధమని రాహుల్‌కు నితీశ్ చెప్పారు. ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ నుంచి స్పష్టత లేనందువల్లే క్యాబినెట్ విస్తరణలో జాప్యం జరుగుతోందని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా&ముఖ్యమంత్రి పదవిలో తన కుమారుడు, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కూర్చోవాలని లాలూ ప్రసాద్ కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు.

తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేస్తేనే బీహార్ అభివృద్ధి చెందుతుందని విమానంలో పాట్నాకు వెళుతుండగా గిరిరాజ్‌తో లాలూ ప్రసాద్ అన్నట్లు తెలుస్తోంది. ఇలా ఉండగా&2024 లోక్‌సభ ఎన్నికల కోసం తమ పార్టీ అభ్యర్థులను త్వరలోనే నిర్ణయిస్తామని కాంగ్రెస్ గురువారం తెలిపింది. అధికార బిజెపి, దాని మిత్రుపక్షాలకు దీటుగా ప్రతిపక్ష ఇండియాకూటమి అభ్యర్థులను నిలబట్టేందుకు అవసరమైనఅన్ని చర్యలు తీసుకుంటున్నామని కాంగ్రెస్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News