Sunday, December 22, 2024

రాజ్యసభలో ఇండియా కూటమి పార్టీల వాకౌట్

- Advertisement -
- Advertisement -

ప్రధాని మోడీ ప్రసంగం మధ్యలో వారి నిరసన
మోడీ మాట్లాడుతుండగా ప్రతిపక్షాల నినాదాల హోరు
వాకౌట్‌ను నిరసించిన సభ చైర్మన్ ధన్‌ఖర్
రాజ్యసభ నిరవధిక వాయిదా

న్యూఢిల్లీ : బుధవారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తుండగా జోక్యానికి ప్రతిపక్ష నాయకుడు (ఎల్‌ఒపి) మల్లికార్జున్ ఖర్గేకు అనుమతి లభించకపోవడంతో కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమి పార్టీలు సభలో నుంచి వాకౌట్ చేశాయి. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని మోడీ సమాధానం ఇస్తుండగా ఎల్‌ఒపి ఖర్గే జోక్యం చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఖర్గే విజ్ఞప్తులను చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖర్ తిరస్కరించారు. దీనితో ఇండియా కూటమి ఎంపిలు నినాదాలు చేస్తూ, ఎల్‌ఒపి ఖర్గేని మాట్లాడనివ్వాలని కోరారు. వారి నినాదాల మధ్య మోడీ తన ప్రసంగం కొనసాగించారు. ఇది కొంత సేపు కొనసాగింది. తనను మాట్లాడనివ్వాలని ఖర్గే పదే పదే అభ్యర్థించారు.

ఖర్గేకు ఎట్టకేలకు అనుమతి లభించినప్పుడు ఇండియా కూటమి ఎంపిలు సభలో నుంచి వాకౌట్ చేశారు. వారి వాకౌట్‌ను ధన్‌ఖర్ ఖండించారు. అది రాజ్యాంగానికి అవమానకరం అని ఆయన అన్నారు. మోడీ కూడా వారి వాకౌట్‌ను గర్హించారు. తాను స్వప్రయోజనం కోసం ప్రయత్నించడం లేదని, కానీ తన ప్రభుత్వ పని తీరును వివరించడం తన కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానాన్ని రాజ్యసభ ఆమోదించిన అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది. జూన్ 27న మొదలైన రాజ్యసభ 264వ సెషన్ ధన్యవాదాల తీర్మానానికి ప్రధాని మోడీ సమాధానం ఇచ్చిన తరువాత తీర్మానాన్ని ఆమోదించిన పిమ్మట సభ వాయిదా పడింది. లోక్‌సభను మంగళవారం నిరవధికంగా వాయిదా వేసిన విషయం విదితమే.

ప్రతిపక్షం వాకౌట్ ‘ప్రమాదకర సంప్రదాయం’: ధన్‌ఖర్

ప్రధాని మోడీ సమాధానం ఇస్తున్న సమయంలో వాకౌట్ చేయడం ద్వారా ప్రతిపక్షం ‘ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైన ప్రమాదకర సంప్రదాయాన్ని’ నెలకొల్పిందని రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖర్ బుధవారం విమర్శించారు. సభను నిరవధికంగా వాయిదా వేసే ముందు ధన్‌ఖర్ ముగింపు ఉపన్యాసం ఇస్తూ, సెషన్ సమయంలో సభాధ్యక్షుని వేదిక ముందుకు ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే రావడం ‘పార్లమెంటరీ ప్రవర్తనకు, ఔచిత్యానికి అవమానకరం’ అని కూడా ధన్‌ఖర్ వ్యాఖ్యానించారు. సెషన్ కార్యక్రమాలపై చైర్మన్ వివర ణ ఇస్తూ, అధికార పక్షం, ప్రతిపక్షం నుంచి సభ్యులు చురుకుగా పాల్గొనగా, కొన్ని వ్యాఖ్యలు ‘కార్యకలాపాలను దెబ్బ తీసిన అంతరాయాలు నన్ను బాగా కలచివేశాయి’ అని చెప్పారు. ‘అనుభవజ్ఞులైన సభ్యులు బాధ్యతారహితంగా ప్రవర్తించడం ముఖ్యంగా బాధాకరం.

అంతరాయం ముందు పేర్కొన్న కార్యకలాపాలను అడ్డుకోవడమే కాకుండా ఈ ప్రసిద్ధ వ్యవస్థ ప్రతిష్ఠను కూడా దెబ్బ తీస్తుంది’ అని ఆయన స్పష్టం చేశారు. ఖర్గే శుక్రవారం రాజ్యసభ వెల్‌లోకి ప్రవేశించడాన్ని ధన్‌ఖర్ ప్రస్తావిస్తూ, ‘తుదకు ప్రతిపక్ష నాయకుడు కూడా సభ వెల్‌లోకి రావడం ఎంతైనా బాధాకరం. అది పార్లమెంటరీ ప్రవర్తనకు, ఔచిత్యానికి అవమానకరం’ అని పేర్కొన్నారు. ‘ఈ సభ సమాలోచనలు, చర్చలు, సంభాషణల ఆలయం కావడానికి వీలుగా సభ్యులు తమ ప్రవర్తనను చూపాలి’ అని ఆయన కోరారు. ‘ఇప్పుడు వారి వాకౌట్ తీవ్ర బాధాకరం, ఇది చారిత్రక సందర్భం. ప్రభుత్వం మూడవ టెర్మ్‌లో ఉంది. ప్రధాని ఆరు దశాబ్దాల తరువాత ప్రభుత్వానికి వరుసగా సారథ్యం వహిస్తున్నారు. వారు తమ రాజ్యాంగ బాధ్యతల నుంచి వాకౌట్ చేశారు. అది ప్రజాస్వామిక విలువలకు విరుద్ధమైన ప్రమాదకర సంప్రదాయాన్ని నెలకొల్పింది’ అని ధన్‌ఖర్ పేర్కొన్నారు.

ఎగువ సభ 264వ సెషన్ పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో మొదలైంది. ‘అది ప్రభుత్వ అజెండాను విశదం చేసిన ముఖ్యమైన సంప్రదాయం’ అని చైర్మన్ అన్నారు. వరుసగా మూడవ సారి ప్రధానిగా తాను ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మోడీ తన కొత్త మంత్రి మండలిని సభకు పరిచయం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై 21 గంటలకు పైగా సాగిన చర్చలో 76 మంది సభ్యులు పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన 19 మంది సభ్యుల తొలి ప్రసంగాలను కూడా సభ ఆలకించింది’ అని ధన్‌ఖర్ తెలియజేశారు. ప్రధాని ‘చర్చలో పాల్గొంటూ స్ఫూర్తిదాయక ప్రసంగం’ చేశారని రాజ్యసభ చైర్మన్ తెలిపారు. అయితే, నిర్బంధ వాయిదాల కారణంగా సభ 43 నిమిషాలు కోల్పోయిందని, కానీ, ఆ లోటును ‘లంచ్ విరామం, నిర్ణీత వ్యవధిని మించి సమావేశం కావడం ద్వారా చర్చను కొనసాగించి భర్తీ చేసింది’ అని ఆయన తెలిపారు. ‘నిర్ణీత వ్యవధిని మించి సమావేశం కావడం ద్వారా మనం 100 శాతం పైగా ఉత్పాదకత సాధించాం’ అని ధన్‌ఖర్ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News