Thursday, December 19, 2024

కూటమి చేయవలసిందేమిటి?

- Advertisement -
- Advertisement -

‘ఇండియా’ కూటమి ప్రధాని నరేంద్ర మోడీకి పగ్గాలు వేయటం వరకు మంచిపనే చేసింది. కాని అంతటితో పొంగిపోక 2029 ఎన్నికల నాటికి తన అజెండా ఏమిటో నిర్ణయించుకుని ఆ ప్రకారం వ్యవహరించినట్లయితే మాత్రమే ఉపయోగం ఉంటుంది. లేనట్లయితే, రాగల అయిదేళ్లలో తమ ప్రస్తుత విజయం ఈ విధంగానే నిలవగలదని గాని, ఈ బలం ఇదే విధంగా ఆటోమేటిక్‌గా పెరుగుతుందని గాని హామీ లేదు. అంతేకాదు. ప్రస్తుతం తగిలిన ఎదురు దెబ్బల నుంచి మోడీ, బిజెపి, సంఘ్‌పరివార్‌లు పాఠాలు నేర్చుకొనబోవని గాని, పొరపాట్లను సరిదిద్దుకుని 2029 నాటికి తిరిగి పుంజుకోవని కూడా హామీ లేదు. అందువల్ల ‘ఇండియా’ కూటమి పార్టీలు ప్రస్తుతం ఉత్సాహోద్వేగాల నుంచి కొద్ది కాలానికి తేరుకున్న తర్వాత ఏమి చేయగలవన్నది కీలకమైన ప్రశ్న.

మోడీకి పాఠం చెప్పి, కూటమికి కొంత ప్రోత్సాహం ఇచ్చిన దేశ ప్రజలు అటు ఆయన దిద్దుబాట్లను, ఇటు కూటమి తన గత వైఫల్యాలకు చేసుకునే దిద్దుబాట్లను కూడా జాగ్రత్తగా గమనిస్తారు. ప్రజలు మోడీ సీట్లను తగ్గించి కూటమి సీట్లనయితే పెంచారు గాని, మోడీని పూర్తిగా తిరస్కరించటమో, కూటమి పూర్తిగా ఆమోదించటమో చేయలేదన్నది గమనించవలసిన విషయం. అంకెల వివరాలు, హెచ్చుతగ్గులు ఎట్లున్నా అంతిమంగా తేలేది మోడీ ప్రభుత్వం వరుసగా మూడవసారి ఏర్పడుతుండటం. యథాతథంగా అది ఒక ఘనతేనని అంగీకరించక తప్పదు. అదే విధంగా, మోడీ పదేళ్ళ పాటు పాలించి ఇంతటి యాంటీ ఇన్‌కంబెన్సీని మూటగట్టుకున్నా, ఇన్నిన్ని పార్టీలు కూటమిగా ఏర్పడి కూడా స్వంత మెజారిటీ సాధించలేకపోయాయి. కాంగ్రెస్ అయితే మిత్ర పక్షాల మద్దతుతో అయినా 100 సీట్లకు చేరలేకపోయింది. ఇవన్నీ కూటమి వైఫల్యాలని కూడా అంగీకరించక తప్పదు. మోడీ 2014 లో అధికారానికి వచ్చిన పదేళ్ళ తర్వాత పరిస్థితి ఇది. అనగా, 2029 వరకు మరొక అయిదేళ్ళు కలిపి మొత్తం 15 సంవత్సరాల స్థితి ఇదన్నమాట. కాంగ్రెస్‌కు గాని, దాని మిత్ర పక్షాలకు గాని ఇది సాధారణమైన అనుభవం కాబోదు.

విషయం ఏమంటే, పైన అనుకున్నట్లు, కాంగ్రెస్ పార్టీ, ‘ఇండియా’ కూటమి సమయాన్ని వృథా చేయకుండా తమ విధానాలు ఏమిటో ఉమ్మడిగా చర్చించి నిర్ణయించుకోవాలి. అవి పూర్తి ప్రజానుకూలంగా ఉండాలి. వాటిని ఇప్పటి నుంచే నిరంతరం ప్రజలలోకి దేశమంతటా తీసుకు వెళ్ళాలి. మరొక స్థాయిలో, కూటమి ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో వాటిని నిజాయితీతో, పట్టుదలగా అమలు జరుపుతూ, తమ పరిపాలన బిజెపి కన్న, ఎన్‌డిఎ కన్న ఏ విధంగా మెరుగైనదో ఆయా రాష్ట్రాల ప్రజలతో పాటు మొత్తం దేశానికి రుజువు పరచాలి.అది చూసి, ఎన్‌డిఎ రాష్ట్రాల ప్రజలు కూడా తమ పట్ల ఆకర్షితులయేట్లు చేసుకోవాలి. అంతేతప్ప, మోడీ ఇపుడు విఫలమైనట్లు 2029 నాటికి మరింత విఫలమై తీరగలరని, అపుడు అధికారం దానంతట అదే, మిగల పండిన పండువలే చెట్టుపై నుంచి రాలి తమ దోసిట పడగలదనే ధోరణిని రానివ్వకూడదు.

ఇదంతా ఇంత దీర్ఘంగా అనుకోవటానికి రెండు ముఖ్యమైన కారణాలున్నాయి. ఒకటి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తన దీర్ఘ కాలపు లోపాలను ఎంత కాలం గడిచినా సరిదిద్దుకోవటం లేదు. ఆ పార్టీకి సంబంధించి విధానపరమైన, పరిపాలనా పరమైన, నైతికతాపరమైన, సంస్థాగతమైన, నాయకత్వపరమైన లోపాలు అనేకం ఉన్నాయి. అవి ఏళ్ళ తరబడిగా ఎటువంటు దిద్దుబాట్లు లేక ఇంకా పేరుకుపోతూ వస్తున్నాయి. ఇదంతా చాలదన్నట్లు పార్టీ నాయకత్వం బలహీనంగా మారింది. ఈ పరిస్థితులన్నింటి ఫలితంగానే కాంగ్రెస్ అత్యధిక రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలోనూ అధికారం కోల్పోతున్నది. ఈ ధోరణి మొదలైన తర్వాత కూడా ఆ పార్టీ మేల్కొనలేదు.

సుమారు 15 సంవత్సరాల కిందట సోనియా గాంధీ అప్పటికి గల సుమారు తొమ్మిది మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో చింతన్ బైఠక్ సమావేశం ఒకటిని నిర్వహించారు. తమ రాష్ట్రాల పరిపాలన ఆదర్శవంతంగా సాగాలని, ఆ తీరుపై నివేదికలను తరచు ఎఐసిసికి పంపాలని, వాటిపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వాలకు తగు సూచనలు చేయగలమని చెప్పారు. అది ఒక కొత్త పద్ధతి కాగలదని, అందువల్ల అనేక ఉపయోగాలు ఉండగలవని కాంగ్రెస్ వాదులతో పాటు దేశ ప్రజలకు కూడా ఆశాభావం కలిగింది. ఆ ప్రణాళిక అమలై ఉంటే ఎట్లుండేదో గాని కొద్ది కాలానికే అది మూలనపడిపోయింది.

దీనంతటిని బట్టి అర్థమయేదేమిటి? కాంగ్రెస్ కేవలం స్వయంకృతమైన వివిధ వైఫల్యాల కారణంగానే 2014, 2019, 2024 లలో వరుసగా మూడు సార్లు అధికారానికి రాలేకపోయింది. ఈసారి సీట్లు 99కి పెంచుకోగలిగామని, మోడీ జోరును అరికట్టామని అల్ప సంతోషంతో సంబరాలు చేసుకోవచ్చుగాక.అందులో తప్పుందని కాదు. మనుషులు అల్ప సంతోషాన్నయినా అనుభవించి తమకు తాము ధైర్యం చెప్పుకోవలసిందే. కాని, అక్కడి నుంచి బయలుదేరి భవిష్యత్తు గురించి ఆలోచించటం అంతకన్న ముఖ్యం. ఆ పని చేయగలరా అన్నది ప్రజలు గమనించవలసిన విషయం. నిజానికి వారికి ఈ స్పృహ 2014 లోనే కలగవలసింది. 2019 నుంచి కొనసాగవలసింది. అది జరిగితే, తమ ఏలుబడిలో గల కర్నాటక, తెలంగాణలలో సీట్లు ఈ విధంగా పరిమితమయేవి కాదు.

తాము ‘ఇండియా’ కూటమి పేర ఇన్ని పార్టీలను వెంట చేర్చుకుని వాటిపై ఆధారపడి కొన్ని సీట్లు తెచ్చుకోవలసిన విధిలేని స్థితి ఎదురయేది కాదు. కాంగ్రెస్ పార్టీ 2004, 2009లో యుపిఎ పేరిట కూటమి ప్రభుత్వాలను ఏర్పాటు చేసినప్పుడు తమది పూర్తి పైచేయిగా ఉండేది. కాని ఇపుడు అందుకు భిన్నంగా, ‘ఇండియా’ కూటమి పార్టీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసిన దుస్థితిలో ఉన్నారు. అనగా, కాంగ్రెస్ భవిష్యత్ ప్రయాణం సుదీర్ఘమైనది అన్న మాట. ఇండియా వంటి వైవిధ్యతతో కూడిన వర్ధమాన దేశానికి బిజెపి వంటి మతతత్వ మితవాద పార్టీ గాక, కాంగ్రెస్ వంటి మధ్యే మార్గ, ఉదారవాద పార్టీ అవసరమని చెప్పాలి. ఆ పార్టీ స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి అదే పద్ధతిలో రూపొందుతూ రావటం తెలిసిందే. కాని అంతటి గొప్ప స్థితిని, అవకాశాన్ని ఆ పార్టీ చేజేతులా కోల్పోవటం పైన చెప్పుకున్న పలు విధాలైన స్వీయ వైఫల్యాల వల్లనే.
ప్రస్తుత ఫలితాల దరిమిలా కాంగ్రెస్ గాని, ‘ఇండియా’ కూటమి గాని ఏమి చేయాలన్నది రెండవ ప్రశ్న.

ఫలితాల వివరాలు వస్తుండగా అర్థమవుతున్నది, మోడీ ఆర్థిక విధానాల వల్ల జీవితాలు ఛిన్నాభిన్నమవుతున్న పేదలు, దిగువ మధ్య తరగతి వారు, గ్రామీణులు 2014, 2019 కి భిన్నంగా ఈసారి ఎక్కువగా మోడీకి వ్యతిరేకంగా ఓటు చేశారు. ఎగువ తరగతుల వారు, పట్టణ వాసులు ఎక్కువగా ఆయన పట్ల మొగ్గు చూపారు. గత రెండు ఎన్నికలలో పేదలు, దిగువ మధ్య తరగతివారు బిజెపికి, మోడీ మతతత్వానికి ఓటు చేయడానికి నిపుణులు సబ్ ఆల్టర్న్ కమ్యూనలిజం అనే పేరు పెట్టారు. అనగా, మతతత్వం దిగువ తరగతులలోకి వ్యాపించడమన్న మాట. ఆ ధోరణి కొనసాగితే ప్రమాదకరంగా మారి ఫాసిస్టు ధోరణికి అవకాశం ఏర్పడగలదనే భయాలు వ్యక్తమయ్యాయి.

కాని ఈ వ్యాప్తి తాత్కాలికమని, ప్రజలకు అంతిమంగా తమ జీవిత స్థితిగతులు ప్రధానం కాగలవని ఈ ఎన్నికలు రుజువు చేశాయి. ఇందులో కాంగ్రెస్‌కు, ‘ఇండియా’ కూటమికి సైతం పాఠాలున్నాయి. దాని బట్టి వారు అన్నింటికన్న ప్రధానంగా గ్రహించవలసింది, తాము 1990ల నుంచి మొదలుకొని మన్మోహన్ సింగ్ కాలం వరకు అనుసరించిన ఆర్థిక విధానాలలో తగు సవరణలు చేసుకోవటం. ఆ విధానాలను ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లు అంతర్జాతీయ, జాతీయ వ్యాపార వర్గాల ప్రయోజనాల కోసం ఉపదేశించాయన్నది ఎప్పుడో స్పష్టమైంది.

అయినా కాంగ్రెస్ ప్రభుత్వాలు వాటిని విచక్షణ లేకుండా గుడ్డిగా ఆచరించి, ప్రజలను నష్టపరిచి, వనరులను యధేచ్ఛగా ఆ వర్గాలకు అప్పగిస్తూ, ధనిక పేద తారతమ్యాలను పెంచుతూ, నిరుద్యోగాన్ని పెంచుతూ, వ్యవసాయాన్ని, చిన్న రైతులను కునారిల్ల జేస్తూపోయారు. అందుకే కాంగ్రెస్ వివిధ వర్గాలకు దూరమై బలం కోల్పోతూ వచ్చింది. కనుక, ఆ పార్టీ గాని, ‘ఇండియా’ కూటమి గాని, తమ తక్కిన లోపాల కన్న ముందుగా సవరించుకోవలసింది ఆర్థిక విధానాలను. వారు తిరిగి వెనుకటి ప్రజాదరణ పొందటానికి అది మొదటి అడుగు కాగలదు.

టంకశాల అశోక్
9848191767

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News