భోపాల్: ప్రతిపక్ష ఇండియా కూటమిని గర్విష్టిగా ప్రధాని నరేంద్ర మోడీ అభివర్నించారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని ఇండియా కూటమి భావిస్తోందని ఆయన ఆరోపించారు. గురువారం మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలోని బీనా రిఫైనరీ వద్ద రూ. 49,000 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయతలపెట్టిన పెట్రోకెమికల్స కాంప్లెక్స్‌తోపాటు 10 పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని మోడీ ప్రసంగించారు.
ఈ గర్విష్టి కూటమి నాయకులు ఇటీవల ముంబైలో సమావేశమయ్యారని, వారికి విధానాలు కాని అంశాలు కాని నాయకుడు కాని లేరని మోడీ విమర్శించారు. సనాతన ధర్మంపై దాడి చేయడం, దాని నాశనం చేయడమే వారి రహస్య అజెండా అంటూ ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా జి20 సదస్సును విజయవంతం చేసినందుకు భారత్‌లోని 140 కోట్ల మంది ప్రజలు కారణమని ఆయన కొనియాడారు. భారత ప్రజల, దేశ గౌరవం జి20 సదస్సుతో ఇనుమడించిందని ఆయన తెలిపారు.
మధ్యప్రదేశ్‌ను సుదీర్ఘ కాలం పాలించిన అవినీతి, నేరాలు చేయడం మినహా రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని ఆయన కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు.
దేశంలో 75 లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్లు అందచేస్తామని ప్రధాని ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లో రూ. 50,000 కోట్ల ప్రాజెక్టులను నెలకొల్పుతామని, దీని వల్ల రాష్ట్ర ప్రగతి వేగం పుంజుకుంటుందని ఆయన తెలిపారు.