Monday, January 20, 2025

ఎన్నికల్లో కర్ణాటక రిపీట్ ఖాయం

- Advertisement -
- Advertisement -

ముంబై : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి పరాజయం తప్పదని కాంగ్రెస్ నేత, ఎంపి రాహుల్ గాంధీ చెప్పారు. ఇక త్వరలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కర్నాటక తరహా విజయం కాంగ్రెస్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో కర్నాటక రిపీట్ అవుతుందన్నారు. స్థానిక తిలక్‌భవన్‌లోని కాంగ్రెస్ కార్యాలయంలో రాహుల్ శుక్రవారం పార్టీ కార్యకర్తలను ఉద్ధేశించి ప్రసంగించారు. ముంబైలో ఇండియా కూటమి సభలలో పాల్గొనేందుకు రాహుల్ వచ్చారు. దేశ అత్యంత పురాతనమైన కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం చూసి ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్, ప్రధాని మోడీ, బిజెపి నేతలకు భయం పట్టుకుందన్నారు. మీడియాలో కొందరు కాంగ్రెస్ పార్టీ బలం లేకుండా పోయిందని వ్యాఖ్యానిస్తున్నారని, ఇది సత్యదూరం అయిన మాటలని రాహుల్ తేల్చిచెప్పారు. బలం లేకపోతే కర్నాటకలో బిజెపిని ఓడించింది ఏ పార్టీ అని ప్రశ్నించారు.

కర్నాటకతో ఈ విజయం ఆగబోదని, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ల్లోనూ ఈ విజయ ప్రభజనం కొనసాగుతుందని తెలిపారు. కార్యకర్తలు ఈ స్ఫూర్తితోనే పనిచేయాల్సి ఉందని పిలుపు నిచ్చారు. లోక్‌సభ ఎన్నికలలో ఇండియా కూటమి గెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం ఖాయం అన్నారు. ఎన్ని పరిణామాలు ఎదురైనా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీలో చీలిక రాలేదని, ఇదంతా కూడా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం వల్లనే సాధ్యమైందన్నారు. సిద్ధాంత బలం ఉంటే ఏ పార్టీని ఇతరత్రా ప్రలోభాలు ఏమి చేయలేవన్నారు. త్వరలోనే మహారాష్ట్రలో కూడా బిజెపి తుడిచిపెట్టుకుపోతుందని, దేశంలో రెండో అతి పెద్ద సంఖ్యలో అంటే 48 మంది ఎంపిలున్న ఈ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని, ఎక్కువ మంది ఎంపిలను లోక్‌సభకు పంపిస్తుందని తెలిపారు.

ఇండియా కూటమికి కన్వీనర్ అవసరం లేదు ః ఉద్ధవ్
ప్రతిపక్ష కూటమి ఇండియాకు ఇప్పటికిప్పుడు కన్వీనర్ అవసరం లేదని శివసేన (యుబిటి) నేత ఉద్ధవ్ థాకరే తెలిపారు. ఇప్పటికే పలు విషయాలపై చర్చించుకునేందుకు సమన్వయ కమిటీలు ఉన్నాయి. సమన్వయం సాధించుకుని ముందుకు సాగడమే వీటి పని అని చెప్పారు. ఇక ఇండియా కూటమి లోగో ఇప్పుడు ఆవిష్కృతం కాకపోవడానికి వేరే కారణాలు ఏమీ లేవని, లోగోపై ప్రజల సూచనలు, అభిప్రాయాలు స్వీకరించేందుకు దీనిని తాత్కాలికంగా పక్కకు పెట్టడం జరిగిందని ఉద్ధవ్ తెలిపారు. జరిగేది ప్రజల నుంచి ప్రజల కొరకు సాగే కార్యక్రమం .

ఇది కేవలం పార్టీలకే పరిమితం కాదు. ఇండియా కూటమి చిహ్నాన్ని ప్రజలలో మరింతగా పరిచయం చేసేందుకు వీలుగా ముందుగా వారి అభిప్రాయాలను తెలుసుకుంటామని ఉద్ధవ్ వివరించారు. గడువులోగా ప్రజల నుంచి స్పందనలు కోరుతామని తరువాత లోగో విడుదల చేస్తామని తెలిపారు. లోగో గురించి ఎటువంటి సందిగ్థత లేదన్నారు. ఇప్పటికే రెండు మూడు చిహ్నాలను రూపొందించినట్లు, అయితే ముందుగా ప్రజల స్పందనలు తీసుకుందామనే ఏకాభిప్రాయం కుదరడంతో లోగోను ఖరారు చేయలేదని ఉద్ధవ్ వివరించారు. ప్రతి రాష్ట్రంలో సమన్వయ కమిటీలు ఉంటాయని, వీటి ద్వారా అంతర్గత విషయాలను చక్కదిద్దుకుంటారని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News