Sunday, April 13, 2025

అందరి చూపు.. భారత్ వైపు

- Advertisement -
- Advertisement -

ట్రంప్ మొదటి పదవీకాలంలో ఉన్నంత సన్నిహితంగా నరేంద్ర మోడీ ట్రంప్‌తో వ్యవహరిస్తారా అన్నది చూడాలి. ఎందుకంటే ట్రంప్ దాదాపు డైరెక్టుగానే భారత దేశంతో అంత సన్నిహిత స్నేహసంబంధాలు లేవని పదేపదే అంటూ, మోడీకి ఖేదం కలిగిస్తున్నారు. ట్రంప్ భారతదేశం గురించి చెడుగా, కాస్త తక్కువచేసి మా ట్లాడడాన్ని భారతదేశంలోని ఉన్నత వర్గాలు, మీడియా, రాజకీయ వర్గాలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీనిపై వివరణ ఇచ్చేందుకు సిద్ధపడినవారూ ఉన్నారు. మోడీ వంటి ఆత్మాభిమానం గల, స్వీయంగా ఇమేజ్ గల నాయకుడు తనకు ఎదురైన అవమానాలపై లోలోన ఆగ్రహించి ఉండవచ్చు. అమెరికా భారతదేశం మధ్య చాలా ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి. అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిలుపుకోవాలని కూడా భారతదేశం కోరుకుంటోంది. అయితే జపాన్ కు చెందిన షిగేరు ఇషిబా, ఇటలీకి చెందిన జార్జియా మెలోని మాదిరిగా ట్రంప్ ముందు సాగిలపడాలని ఏ భారతీయ నాయకుడు అనుకోరు అన్నది సుస్పష్టం.

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చిన్న వెనుకడుగు వేశారు. బాండ్ మార్కెట్లో జరిగిన పరిణామాలు ఆయన తన నిర్ణయం 90 రోజులపాటు వాయిదా వేసుకునేలా చేశాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సంఘటనలు ఊహించదగినవే. చైనాకు సంబంధించినంత వరకూ వ్యూహం ఎంతవరకూ స్థిరంగా ఉంటుందో చూడాలి. చైనా ప్రెసిడెంట్ జీ జిన్‌పింగ్ ఉద్దండుడు. ఎదురులేని నాయకుడు. మిగతా ప్రపంచ దేశాలకు కొంత ఊరట కల్పించిన ప్రెసిడెంట్ ట్రంప్ చైనాను ఆకట్టుకునేందుకు మారిన నిబంధనలతో మరో పటిష్టమైన వ్యూహం కనుగొనాలి. ట్రంప్ 90 రోజుల సడలింపు ఏకపక్షం. దానికి రోడ్ మ్యాప్ ఏదీలేదు. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఆయన సలహాదారుల బృందం ఒక ప్రణాళిక ప్రకారం నిర్ణయాలు చేస్తున్నారని అభిప్రాయం గొప్పగా ఉంటుంది కానీ, నిజానికి అదో స్పష్టమైన అబద్ధం. సుంకాలపై ట్రంప్ ప్రకటించిన 90 రోజుల విరామం అనిశ్చితిని పెంచుతుంది.

ఆర్థిక కార్యకలాపాలు అన్నీ అంచనాలపై ఆధారపడే సాగుతాయి. అనిశ్చితి అంచనాలను తారుమారు చేస్తుంది. కంపెనీలు, సంస్థలు దేశాలు కూడా అప్రమత్తంగా ఉండేటట్లు చేస్తుంది. ట్రంప్ విధించిన 90 రోజుల వాయిదా అనిశ్చితిని పెంచుతుందే కానీ, పరిస్థితిని చక్కదిద్దదు. దేశాలు ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకున్నా.. ప్రపంచవ్యప్తంగా ఆర్థికమాద్యం ప్రమాదం ఉండనే ఉంది. ట్రంప్ తన విధ్వంసకర సుంకాల విధానం ద్వారా రెండు లక్ష్యాలను సాధించాలని ఆశిస్తున్నారు. మొదటిది అమెరికాలో ఉత్పాదకత పెంచే సంస్థల పునరుద్ధరణ, అలాగే అమెరికన్లు కోల్పోయిన బ్లూ కాలర్ ఉద్యోగాలను తిరిగి పొందేలా చేయడం. రెండవది ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో చైనా లాభపడి పైచేయి సాధించకుండా చూడడం. యుఎస్‌లో ట్రంప్‌కు గల రాజకీయ మద్దతు నేపథ్యంలో దేశీయ ఉత్పాదకత పెంచే సంస్థల ప్రోత్సాహం చాలా ముఖ్యం.

రెండో లక్ష్యం నెరవేరడం కొంత కష్టం. దేశంలో కొత్తగా ఉద్యోగాలు పెరగకుండా, కేవలం అన్ని ఉత్పత్తుల ధరలు పెరిగిపోతే చైనాకు నష్టం కలిగించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటన్నది ప్రశ్న. సమస్య ఏమిటం, ట్రంప్ మొదటి లక్ష్యాన్ని సాధించడం. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం, రెండో లక్ష్యమైన చైనాను దెబ్బ తీయడం చాలా కష్టం. ట్రంప్ వ్యూహాలను ఎదుర్కొనేందుకు మరో పక్క చైనా సంసిద్ధంగానే ఉంది. రెండు దశాబ్దాలుగా చైనా భౌగోళిక -ఆర్థిక నియంత్రణకు సంబంధించిన వ్యూహాలపై అమెరికాకు పూర్తి ఎరుక ఉన్న నేపథ్యంలో చైనాకు అమెరికా విషయంలో ఏమి ఆశించాలో, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలో అన్న స్పష్టమైన ఆలోచన ఉంది. అసలు ప్రశ్న ఏమిటం. ట్రంప్ పతనానికి అమెరికా సిద్ధంగా ఉందా.. దేశంలో సంస్థలను నెలకొల్పి, ఉత్పాదతకను పునరుద్ధరించడం పార్టీ చేసుకున్నంత సులభం కాదు.

దీనికి ఎంతో సమయం అవసరం. ట్రంప్‌కు మద్దతుగా ఉన్న నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రెండు సంవత్సరాలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉన్నా నిరాశ చెందరు. కానీ స్వల్పకాలిక ప్రణాళికలు, దీర్ఘకాలంలో సమకూరే ప్రయోజనాలు రాజకీయంగా లాభదాయకంకాదు. ట్రంప్ కు దేశీయంగా మద్దతు తగ్గితే ఆయన విదేశాంగ విధానం వల్ల సమకూరే ప్రయోజనం ఏమిటి.. మరింతకాలం గడువు పెరగడమేనా.. గత వారంరోజులుగా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వాణిజ్యం, ట్రంప్ విధిస్తున్న సుంకాలపైనే చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఆర్థికవేత్తలే ఈ అంశాలపై వ్యాఖ్యానిస్తున్నారు. ట్రంప్ సుంకాల నిర్ణయాన్ని వాయిదా వేసిన నేపథ్యంలో అంతర్జాతీయ సంబంధాలలో దీర్ఘకాలిక పరిణామాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకునేందుకు రాజకీయ విశ్లేషకులు రంగంలోకి దిగుతున్నారు.

అతి ముఖ్యమైన పరిణామం మాత్రం అమెరికాపై అంతర్జాతీయ దేశాలు నమ్మకం కోల్పోవడం. డొనాల్డ్ ట్రంప్ తన చర్యలన్నింటినీ వెనక్కి తీసుకుని, తన ప్రకటనలను, మాటలను దిగమించినా, ప్రపంచవ్యాప్తంగా కొద్ది మంది ప్రభుత్వాధినేతలు తప్ప ట్రంప్ పరిపాలనను ఇకపై ఎవరూ విశ్వసించరు. ట్రంప్ బాహాటంగా టార్గెట్ చేసి, స్పష్టంగా దూరం చేసుకున్న దేశాలలో కెనడా, మెక్సికో, డెన్మార్క్, దక్షిణాఫ్రికా ముఖ్యమైనవి. ఆ తర్వాత ట్రంప్‌ను బహిరంగంగా విమర్శించేందుకు సిద్ధమైన నాయకులు ఉన్న దేశాలలో బ్రెజిల్, కొలంబియా, జర్మనీ, ఫ్రాన్స్, సింగపూర్, నమీబియా, ఆస్ట్రేలియా ఉన్నాయి. అయితే, ఇప్పటివరకూ ట్రంప్ పట్ల ప్రపంచవ్యాప్తంగా పూర్తిస్థాయి లో అసమ్మతి వ్యక్తం కాలేదు. యురోపియన్ యూనియన్ దేశాలలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మెజారిటీ దేశాలు మాత్రం అమెరికాను ఇకపై విశ్వసించవు. యురోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డేర్ లేయన్ వివిధ దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజులపాటు వాయిదా వేయడాన్ని స్వాగతించారు.

అదే సమయంలో యురోపియన్ యూనియన్ తమ అంతర్గత మార్కెట్‌ను మరింత విస్తృతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యురోపియన్ యూనియన్ చైనాతో వాణిజ్య సంబంధాలను సజావుగా కొనసాగిస్తోంది. మున్ముందు భారతదేశంతోనూ, ఇతర దేశాలతోనూ వాణిజ్య సంబంధాలు పెంచుకోవచ్చు. జపాన్ పరిస్థితి మరోలా ఉంది. జపాన్ అమెరికా బాండ్ మార్కెట్‌లో అమ్మకాలు చేయడం ద్వారా 90 రోజుల వాయిదాను తిప్పికొట్టి ఉండవచ్చు. జపాన్ కూడా చైనాతో వాణిజ్య సంబంధాలను మరింత పెంచుకోవచ్చు. భారత రాజకీయ నాయకత్వం మాత్రం ఆచీతూచీ అడుగులు వేస్తోంది. ట్రంప్ దాడి ప్రధానంగా చైనాపై ఉండడం పట్ల సంతోషంగానే ఉంది. అమెరికా నుంచి మరిన్ని రక్షణ పరికరాలతో పాటు, కీలక ఉత్పత్తులు కొనుగోలు చేయడానికిఆఫర్ చేయడం ద్వారా ట్రంప్‌తో పలు వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునేందుకు సిద్ధపడుతోంది.

అయితే, ట్రంప్ మొదటి పదవీకాలంలో ఉన్నంత సన్నిహితంగా నరేంద్రమోడీ ట్రంప్‌తో వ్యవహరిస్తారా అన్నది చూడాలి. ఎందుకంటే ట్రంప్ దాదాపు డైరెక్టుగానే భారత దేశంతో అంత సన్నిహిత స్నేహసంబంధాలు లేవని పదేపదే అంటూ, మోడీకి ఖేదం కలిగిస్తున్నారు. ట్రంప్ భారతదేశం గురించి చెడుగా, కాస్త తక్కువచేసి మాట్లాడడాన్ని భారతదేశంలోని ఉన్నత వర్గాలు, మీడియా, రాజకీయ వర్గాలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీనిపై వివరణ ఇచ్చేందుకు సిద్ధపడినవారూ ఉన్నారు. మోడీ వంటి ఆత్మాభిమానం గల, స్వీయంగా ఇమేజ్ గల నాయకుడు తనకు ఎదురైన అవమానాలపై లోలోన ఆగ్రహించి ఉండవచ్చు. అమెరికా భారతదేశం మధ్య చాలా ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి.

అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిలుపుకోవాలని కూడా భారతదేశం కోరుకుంటోంది. అయితే జపాన్‌కు చెందిన షిగేరు ఇషిబా, ఇటలీకి చెందిన జార్జియా మెలోని మాదిరిగా ట్రంప్ ముందు సాగిలపడాలని ఏ భారతీయ నాయకుడు అనుకోరు అన్నది సుస్పష్టం. భారత ప్రధాని మోడీ ఇంతవరకూ మౌనం వహించారు. బహుశా అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై జరుగుతున్న చర్చలు ఇంకా పురోగమదిశలో ఉండడమే కారణం కావచ్చు. దీంతో ఇతర ప్రపంచ దేశాలకు స్పందించే అవకాశం వచ్చింది. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల ఆందోళనలను ఎత్తిచూపుతూ, సంఘీభావం వ్యక్తం చేసేందుకు చైనా సంసిద్ధమైంది. ఈ విషయంలో భారతదేశాన్ని కలుపుకుపోవడానికి ముందడుగు వేసింది. చైనాతో పాటు బ్రెజిల్, దక్షిణాఫ్రికా నాయకులు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశాయి. ఇక భారతదేశం నుంచి స్పష్టమైన ప్రకటన కోసం ప్రపంచం ఎదురు చూస్తోంది.

– సంజయ్ బారు( రచయిత సీనియర్ సంపాదకులు, మాజీ ప్రధాన మంత్రి మీడియా సలహాదారు)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News