భారత్-అమెరికా బంధం నింగికెదగాలి
నాసా మాజీ అధికారి మైక్ ఆశాభావం
వాషింగ్టన్: భారత్-అమెరికా మధ్య సంబంధాలు కేవలం భూమిపైనే కాకుండా ఆకాశంలోనూ అత్యంత కీలకమని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) మాజీ ఉన్నతాధికారి మైక్‌గోల్డ్ తెలిపారు. అంతరిక్ష ప్రయోగాలలో ఇరుదేశాలు మరింతగా సహకరించుకోవల్సి ఉందన్నారు. భారతదేశం ఖగోళానికి సంబంధించి నిద్రాణ శక్తిగా ఉందని, అయితే ఇండియాకు ఆకాశం ఇక ఓ పరిమితి కాదని తెలిపారు. నాసా సంబంధిత పాలసీ, భాగస్వామ్య విషయాలపై గోల్డ్ పర్యవేక్షకులుగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన ఫ్లోరిడాలోని రెడ్‌వైర్ స్పేస్ ప్రధాన వృద్ధి అధికారిగా ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే వారం అమెరికాలో పర్యటించనున్నారు.
ఈ దశలో ఈ నిపుణులు భారత్ అమెరికాల మధ్య అంతరిక్ష ప్రయోగాల దిశలో మరింత సహకారం అవసరం అని స్పష్టం చేశారు. ఇరు దేశాల నేతల నడుమ అంతరిక్ష రంగంలో పరస్పర సహకారం, ప్రయోగాల దిశలో ముందడుగు ప్రధాన అంశం కావల్సి ఉందని గోల్డ్ తెలిపారు. ఇండియా పలు రకాలుగా అంతరిక్ష ప్రయోగాలలో విజయం సాధించిందని, ఇప్పుడు నిద్రాణంగా ఉంది. త్వరలోనే ఇండియా తన పౌరులను అంతరిక్షంలోకి యాత్రగా పంపించనుంది. దీనిని పరిగణనలోకి తీసుకుని ఇరుదేశాలు కలిసి ఈ కీలక రంగంలో మరింతగా కొత్త ఆవిష్కరణలకు ముందుకు సాగాల్సి ఉందన్నారు.