Monday, December 23, 2024

అణు దాడి చేయకుండా రష్యాను భారత్, చైనాలు ఆపి ఉంటాయి: బ్లింకెన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై అణ్వాయుధ దాడి చేయకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌ను చైనా, భారత్‌లు ఆపి ఉండొచ్చునని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ భారత్, చైనాలు అడ్డుపడి ఉండకపోతే బహుశా యుద్ధాన్ని ముగించేయడానికి రష్యా అణ్వాయుధాలు ప్రయోగించి ఉండేదన్నారు. ఆయన ‘ది అట్లాంటిక్’కు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయం చెప్పారు. ‘భారత్, చైనాలు అడ్డుపడి ఉండకపోతే వ్లాదిమీర్ పుతిన్ మరింత రెచ్చిపోయి ఉండేవాడు, మాస్కో నుంచి వెలువడిన హెచ్చరికల తీవ్రత అలా ఉండింది…పుతిన్ అణ్వాయుధాలు వాడి ఉండేవాడు’ అని చెప్పారు.

‘రష్యాను నివారించమని మేము కోరాము. ఆ విషయంలో కొంత విజయం సాధించామనే అనుకుంటున్నాము. భారత్, చైనాలు రష్యాను నివారించాయి. భారత్, చైనాల ప్రభావం కొంత మేరకు పనిచేసిందనే అనుకుంటున్నాము’ అని ఆయన వివరించారు. భారత్‌తో రష్యాకు దశాబ్దాలుగా స్నేహ సంబంధాలున్నాయి, అయితే ఇప్పుడు అమెరికాతో, ఫ్రాన్స్‌తో కూడా భారత్ స్నేహసంబంధాలను వృద్ధి చేసుకుంది అన్నారు.

ఇదిలావుండగా ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో శుక్రవారం ఉక్రెయిన్ యుద్ధం ఆపాలన్న తీర్మానంపై ఓటింగ్ జరిగింది. ఇందులో 193 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. కాగా వాటిలో 141 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. గైర్హాజరైన 32 దేశాలలో భారత్, చైనా కూడా ఉన్నాయి. భారత్, చైనా తటస్థ విధానాన్ని అనుసరించాయి.

‘భారత దేశం బహుళపక్షానికి కట్టుబడి ఉంది, ఐక్యరాజ్యసమితి సూత్రాలను సమర్థిస్తుంది. మేము ఎల్లప్పుడూ చర్చలు, దౌత్యం మాత్రమే ఆచరణీయమైన మార్గం అంటాము. నేటి తీర్మానం పేర్కొన్న లక్ష్యాన్ని మేము చూశాము. అయితే మన లక్ష్యాన్ని చేరుకోవడంలో దాని స్వాభావిక పరిమితులను పరిగణనలోకి తీసుకుంటాము. శాశ్వత శాంతిని సాధించాలనే లక్ష్యంతోనే మేము దూరంగా ఉన్నాము’ అని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News