బ్రిటన్‌లో 2 వేల మంది కొవిడ్ రోగులపై ట్రయల్స్‌కు సన్నాహాలు
న్యూఢిల్లీ : అశ్వగంధ ఓషధి నుంచి తయారు చేసిన ఔషధం కరోనా రోగులు వేగంగా కోలుకోడానికి ఉపయోగపడగలదన్న లక్షంతో ఆయుష్ మంత్రిత్వశాఖ బ్రిటన్ లోని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ (ఎల్‌ఎస్‌హెచ్‌టిఎం) తో కలసి అధ్యయనం చేయడానికి సన్నద్ధమైంది. స్వతంత్ర పాలక వర్గమైన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎఐఐఎ) విభాగం ఆయుష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈమేరకు బ్రిటన్ లోని ఎల్‌ఎస్‌హెచ్‌టిఎంతో ఒప్పందం కుదుర్చుకుంది. బ్రిటన్ లోని లీసెస్టర్, బర్మింగ్‌హామ్, లండన్ నగరాల్లో దాదాపు రెండు వేల మంది పోస్ట్, లాంగ్ కొవిడ్ రోగులపై అధ్యయనం చేయనున్నట్టు ఏఐఐఎ డైరెక్టర్, ప్రాజెక్ట్ కో ఇన్వెస్టిగేటర్ డాక్టర్ తనూజ మనోజ్ నేసరి తెలిపారు. ప్రతి వేయి మందితో రెండు గ్రూపులను చేయడం ద్వారా ఈ అధ్యయనం జరుగుతుందని చెప్పారు.
ఈ రెండు గ్రూపుల తులనాత్మక అధ్యయనం చేపట్టి ఫలితాలను విశ్లేషిస్తారు. అధ్యయనం లోకి తీసుకున్న వారికి రోజుకు రెండు సార్లు 500 ఎంజి అశ్వగంధ మాత్రలు ఇస్తారు. వీరిలో రోజువారీ దైనందిన జీవన చర్యలో ఎలాంటి మార్పులు వస్తాయో, మానసికంగా, భౌతికంగా ఎలా ఆరోగ్యంగా ఉంటారో నెలనెలా అధ్యయనం చేస్తారు. రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరడానికి 16 నెలల పాటు దాదాపు 100 సార్లు సమావేశమై చర్చించడమైందని డాక్టర్ నేసరి చెప్పారు. మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రోడక్ట్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్‌ఆర్‌ఎ)ఈ అధ్యయనానికి అనుమతించిందని, డబ్లుహెచ్‌ఒ జిఎంపి సర్టిఫై చేశాయని ఆమె వివరించారు.
భారత్‌లో ఇటీవల అశ్వగంధ ప్రయోజనాలపై అధ్యయనం జరిగింది. కొవిడ్ రోగులపై ఇది సమర్థంగా పనిచేస్తుందని నిరూపిత మైంది. సుదీర్ఘకాల కొవిడ్ లక్షణాల రోగులకు ఇది బాగా పనిచేస్తుందని తేలింది. ఇప్పుడు బ్రిటన్ లోని అధ్యయనాల్లో దీని సమర్ధత రుజువైతే ప్రపంచ దేశాల శాస్త్రవేత్తల సమాజం గుర్తిస్తుందని నేసరి చెప్పారు. సమర్ధవంతమైన టీకాలు అభివృద్ధి చెందినప్పటికీ బ్రిటన్‌లోను, ప్రపంచ దేశాల్లోను కరోనా మహమ్మారి ప్రమాదకరంగానే ఉంటోంది. బ్రిటన్ లోని వయో వృద్దుల్లో 15 శాతం మంది కన్నా ఎక్కువ మందిపై అశ్వగంధ ప్రయోగాలు జరగనున్నాయి.