మొదటి సారి హైదరాబాద్‌లో ఏర్పాటు
250 మంది కళాకారులు, 30 ఆర్ట్ గ్యాలరీలు, 3500 కళాఖండాలు
మన తెలంగాణ / హైదరాబాద్ : కళా ప్రియులైన హైదరాబాద్ వాసులను అలరించేలా ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ జూన్ 7 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో జరగనుంది. ప్రతి ఏటా ముంబై, బెంగళూర్‌లో నిర్వహించే ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ మొదటిసారి హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నారు. అద్భుతమైన, అరుదైన వందలాది కళాఖండాలు ఈ ఆర్ట్ ఫెస్టివల్ లో అలరించనున్నాయి. హైదరాబాద్, రేతీబౌలి, పిల్లర్ 68, పివి నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వే, కింగ్స్ కోహినూర్ (క్రౌన్) కన్వెన్షన్‌లో మూడు రోజుల పాటు నిర్వహించే ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ లో దేశం నలు మూలల నుంచి దాదాపు 250 మంది ప్రముఖ కళాకారులు, 30 ఆర్ట్ గ్యాలరీల యాజమానులు పాల్గొంటున్నారు.
జూన్ 7న ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆర్ట్ ఫెస్టివల్ జూన్ 9వ తేదీతో ముగుస్తుంది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు కొనసాగుతుంది. ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ 2011లో ప్రారంభించి ఇప్పటి వరకు న్యూ ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాల్లో ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ డైరెక్టర్ రాజేంద్ర తెలిపారు. ఇప్పటివరకు 25 ఫెస్టివల్ ను విజయవంతంగా నిర్వహించామన్నారు. విశేష చారిత్రక, సాంస్కృతిక చరిత్ర ఉన్న హైదరాబాద్ లో మొదటి సారి ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ఫెస్టివల్ లో గ్యాలరీ ఎగ్జిబిట్‌లు, ఇండిపెండెంట్ కళాకారుల ప్రదర్శనలు ఉంటాయన్నారు. విభిన్నమైన కళాఖండాలును కళా ప్రియులకు అందించడానికి , కళాకారుల మధ్య నెట్‌వర్క్ ఏర్పాటు చేసి వారి పెంయింటింగ్స్ కు మార్కెట్ కల్పించడానికి ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ కృషి చేస్తుందని రాజేంద్ర తెలిపారు.
ఒకే చోట ప్రముఖ కళాకారులు వేసిన చిత్రాలు, కళాకృతులు లభిస్తాయని, కళా ప్రేమికులకు ఇది మంచి అవకాశం అని ఆయన అన్నారు. ఈ ఫెస్టివల్ లో ప్రఖ్యాత కళాకారులు జోగెన్ చౌదరి, మను పరేఖ్, కిషన్ ఖన్నా, శక్తి బర్మన్, సీమా కోహ్లీ, పరేష్ మైతీ, యూసుఫ్ అరక్కల్, ఎస్‌జి వాసుదేవ్, అంజోలీ ఎలా మీనన్, అతుల్ దోడియా, లక్ష్మా గౌడ్, టి. వైకుంఠం, లక్ష్మణ్‌ఏలే , అశోక్ భౌమిక్, లాలూ ప్రసాద్ షా, గురుదాస్ షెనాయ్, వినీతా కరీం, ఎం నారాయణ్ తదితరుల కళాఖండాలు ప్రదర్శనలో ఉంటాయి. ప్రముఖ కళాకారులు గుర్మీత్ మార్వా, లాల్‌బహదూర్ సింగ్, రాయ్ కె జాన్, ఎమ్ వి రమణా రెడ్డి, ఆసిఫ్ హుస్సేన్, వివేక్ కుమావత్, భాస్కర్ రావు, యూసుఫ్, అమిత్ భర్, సుప్రియ అంబర్, తౌసిఫ్ ఖాన్, కప్పరి కిషన్, జి. ప్రమోద్ రెడ్డి, రమణారెడ్డి, కాంత ప్రసాద్, ఔత్సాహిక కళాకారులు ప్రవీణ పారేపల్లి, ఓం తాడ్కర్, పంకజ్ బావ్డేకర్, దేవ్ మెహతా, ప్రవీణ్ కుమార్, సత్య గౌతమ్ తదితరులు వారి కళాఖండాలు ప్రదర్శించనున్నారు.
ఫెస్టివల్ లో హైదరాబాద్ నుంచి ఆరట్స్ బ్రీజ్ ఆర్ట్ గ్యాలరీ, స్నేహ ఆరట్స్, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, బెంగళూరు నుంచి చార్వి ఆర్ట్ గ్యాలరీ, సారా అరక్కల్ గ్యాలరీ, న్యూఢిల్లీ నుంచి ఆర్ట్‌హట్, గ్యాలరీ పయనీర్, ఎమినెంట్ ఆర్ట్ గ్యాలరీ, పాస్టెల్ టేల్స్, స్టూడియో 3 ఆర్ట్ గ్యాలరీ, ఉచాన్,ముంబై నుంచి బియాండ్ ది కాన్వాస్, బొకే ఆఫ్ ఆర్ట్ గ్యాలరీ, హౌస్ ఆఫ్ ఎనర్జీ, దేవ్ మెహతా ఆర్ట్ గ్యాలరీ, మ్రియా ఆరట్స్, ట్రెడిషన్స్ ఆర్ట్ గ్యాలరీ, కలాస్ట్రోట్, రిగ్వేద ఆర్ట్ గ్యాలరీ, స్టూడియో పంకజ్ బావ్డేకర్, ది బాంబే ఆర్ట్ సొసైటీ, తేలా ఆర్ట్ గ్యాలరీ పాల్గొంటాయి. ఇవే కాకుండా జ్ఞాని ఆరట్స్ (సింగపూర్), ఎక్స్‌క్లూజివ్ ఆర్ట్ గ్యాలరీ (బరోడా), ది ఇండియన్ ఆర్ట్ కాటేజ్ (కోల్‌కతా), కాన్వాస్ డ్రీమ్స్ ఆర్ట్ గ్యాలరీ (నాగ్‌పూర్), ఎం నారాయణ్ స్టూడియో (పుణె) తదితర ఆర్ట్ గ్యాలరీలు ఈ ఫెస్టివల్ లో పాల్గొంటాయి.
సాంస్కృతిక మహోత్సవం
ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ లో కళా ఖండాల ప్రదర్శనతో పాటు వివిధ రకాల ఫ్యూజన్ షోలు, సంగీత కచేరీలు, లైవ్ పెయింటింగ్ ప్రదర్శనలు ఉంటాయి. చరిత్ర పూర్వ కాలం నుండి నేటి వరకు భారత గొప్ప కళాత్మక వారసత్వాన్ని అన్వేషించే చలన చిత్రం ‘ది ఎటర్నల్ కాన్వాస్ – 12,000 ఇయర్స్ జర్నీ త్రూ ఇండియన్ ఆర్ట్‘, ఈవెంట్‌లో హైలైట్ అవుతుంది. మరింత సమాచారం కోసం ఐఎఎఫ్ డైరెక్టర్ రాజేంద్ర ఫోన్ 7400009978, 9820737692 నెంబర్లను సంప్రదించవచ్చన్నారు.