Monday, December 23, 2024

కెనడాలో అత్యంత జాగ్రత్తగా ఉండండి… అక్కడి భారత పౌరులకు కేంద్రం అడ్వైజరీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఖలిస్థానీ అంశం , ట్రూడో ఆరోపణలతో భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా కెనడా లోని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ఆ దేశం లోని పౌరులు, విద్యార్థులు, అక్కడకు ప్రయాణించాలనుకునేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. “ కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు, రాజకీయ అండతో జరుగుతున్న విద్వేషపూరిత నేరాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులు తమ ప్రయాణాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి.

ఇండియా వ్యతిరేక ఎజెండాను వ్యతిరేకిస్తున్న భారత కమ్యూనిటీ ప్రజలను, మన దౌత్యవేత్తలను లక్షంగా చేసుకుని ఇటీవల కాలంలో బెదిరింపులు వస్తున్నాయి. అందువల్ల అలాంటి హింసాత్తక ఘటనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లొద్దని కోరుతున్నాం. ” అని కేంద్ర విదేశాంగ శాఖ బుధవారం ప్రకటన విడుదల చేసింది. “ కెనడా లోని భారత పౌరులను సంరక్షించేందుకు అక్కడి అధికారులతో భారత హైకమిషన్/కాన్సులేట్ జనరల్ నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాయి. ప్రస్తుతం భద్రతా పరంగా అక్కడ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో … పౌరులు , ముఖ్యంగా విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి.

కెనడా లోని భారత పౌరులు ఒట్టావా లోని హైకమిషన్ లేదా టొరంటో , వాంకోవర్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వద్ద తమ పేర్లను నమోదు చేసుకోండి. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు మిమ్మల్ని వేగంగా సంప్రదించేందుకు వీలవుతుంది” అని విదేశాంగ శాఖ తమ అడ్వైజరీలో సూచించింది. ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేయడంతో ఇరు దేశాల మధ్య విభేదాలు రాజుకున్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ దేశంలో భారత రాయబారిపై కెనడా బహిష్కరణ వేటు వేయగా, బదులుగా భారత్ ఆ దేశ రాయబారిని బహిష్కరించింది. ఈ పరిణామాల వేళ… కెనడా లోని భారత పౌరులు, భారతీయ సంస్థలపై దాడులు జరిగే అవకాశాలున్నట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యం లోనే కేంద్ర ప్రభుత్వం ఈ అడ్వైజరీ జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News