అంతర్జాతీయ సమాజానికి భారత్ వినతి
నూర్ సుల్తాన్ : వాతావారణ మార్పులను, కరోనా మహమ్మారిని ఏ విధంగా తీవ్రంగా పరిగణించి సమష్టిగా పోరు సాగించాలని సన్నధ్ధమౌతున్నామో అదే విధంగా ఖండాంతర ఉగ్రవాదాన్ని తీవ్రమైన ముప్పుగా భావించి సమష్టిగా పోరు సాగించాలని భారత్ మంగళవారం అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. ఆసియాలో దేశాల మధ్య పరస్పర అనుసంధానం, విశ్వాసం పెంపొందించే చర్యలకు సంబంధించి విదేశాంగ మంత్రుల సదస్సు (సిఐసిఎ) ఆరో సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ఈమేరకు విజ్ఞప్తి చేశారు. దేశ సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రత అన్నవి గౌరవిస్తూ దేశాలు పరస్పరం మైత్రి పెంపొందించుకోవడం అంతర్జాతీయ సంబంధాలకు ముఖ్యమైన సిద్ధాంతమని ఆయన పేర్కొన్నారు. శాంతి, అభివృద్ది అన్నది మన ఉమ్మడి లక్షం అయితే మనం ఎదిరించ వలసిన ప్రధాన శత్రువు ఉగ్రవాదమే అని ఆయన పేర్కొన్నారు. ఒకదేశంతో మరో దేశం వ్యతిరేకతతో ఉగ్రవాదాన్ని ముఖాముఖిగా ఎదుర్కోలేమని, ఇది ఏ ఒక్క దేశం తయారు చేసింది కాదని, ఇది ఉగ్రవాద రూపంలో ఉన్న ముప్పు అని వ్యాఖ్యానించారు.