Monday, December 23, 2024

జి20 ఓ కాఫీ క్లబ్!

- Advertisement -
- Advertisement -

ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరు పొందిన జి20 అధ్యక్ష బాధ్యతలను భారత్ డిసెంబర్ 1న చేపట్టింది. ఇటీవల ఇండోనేషియాలో జరిగిన జి20 సమావేశాల్లో ఈ బాధ్యతలను భారత్‌కు బదిలీ చేశారు. స్వాతంత్య్ర భారత దేశ చరిత్రలోనే ఎంతో ప్రతిష్ఠాకరమైన పదవి, గుర్తింపు భారత్‌కు దక్కినదని, ఇదంతా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అంతర్జాతీయంగా పెరుగుతున్న పలుకుబడియే కారణం అని విశేషంగా ప్రచారం కూడా జరుగుతోంది. ఈ అధ్యక్ష స్థానంతో మొత్తం ప్రపంచం గతినే మార్చబోతున్నట్లు ప్రకటనలు ఇస్తున్నారు. దీని ద్వారా స్థిరమైన జీవనశైలి, ప్రపంచ ఆహార, ఎరువులు, మందులు, ఇతర వస్తువుల సరఫరా వ్యవస్థను రాజకీయాలతో సంబంధం లేకుండా చేయడం కోసం భారత్ ఎదురు చూస్తోందని స్వయంగా ప్రధాన మంత్రి చెప్పారు.

అయితే, ఈ కూటమి నిజంగా అంత బలమైన కూటమియా? అనేక అంతర్జాతీయ కూటముల మాదిరిగా ఓ కాఫీ క్లబ్ కన్నా ప్రాముఖ్యత కలిగినదా? ప్రపంచ జిడిపిలో జి20 దేశాలు 85 శాతాం వాటాను కలిగి ఉండగా, జనాభాలో రెండింతలు ఈ జి 20 దేశాల్లోనే ఉన్నారు. దానితో అంతర్జాతీయ వాణిజ్య, వ్యాపార రంగాలను ఈ కూటమి నిర్దేశిస్తుందనే అభిప్రాయం నెలకొంది. వాస్తవానికి జి-20లో నిజమైన అధికారాన్ని అమెరికా నేతృత్వంలోని మరో చిన్న దేశాల సమూహం జి- 7 చెలాయిస్తున్నది. మిగిలిన వారు చెప్పుకోదగిన ప్రభావాన్ని చూపే అవకాశం లేదు. పచ్చిగా చెప్పాలంటే సర్కస్‌లో విదూషకులవలె మిగిలిపోవాల్సిందే. ఉదాహరణకు ఈ కూటమిలోకి వెనిజులా, ఈజిప్టు, నైజీరియా, ఇరాన్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలను కూడా చేర్చుకోవాలని ప్రతిపాదన చాలా కాలంగా ముందుకు వెళ్లడం లేదు. వారు వస్తే భిన్నాభిప్రాయాలను ముందుంచే ప్రమాదం ఉందని వారి ప్రవేశాన్ని అమెరికా నిరోధిస్తున్నది.

అధ్యక్ష హోదాలో ప్రధాని మోడీ ఈ విషయంలో ఏ విధంగానైనా చొరవ చూపగలరా? 2021లో ఇటలీ అధ్యక్ష హోదాలో ఉన్నప్పటికీ ఆ కాలమంతా కరోనా మహామ్మారితో గడిచిపోయింది. ఆర్ధికంగా చితికిపోయిన దేశం ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. 2022లో ఆ హోదా పొందిన ఇండోనేషియా సహితం జి-20 నాయకుల కోసం ఒక మహోత్సవాన్ని నిర్వహించడం తప్ప మరేమీ చేయలేక పోయింది. ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు ప్రయత్నించినప్పుడు నవ్వులపాలు అయ్యారు. స్వదేశంలో ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా చట్టాలను సవరించడం ద్వారా ఆయన విదేశీ పెట్టుబడులను సులభతరం చేశారు. అయితే ఆయన చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కార్మిక, పర్యావరణవేత్తల నేతృత్వంలో దేశం విస్తృత నిరసనను చూసింది.

ఇప్పుడు మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేలా రాజ్యాంగాన్ని సవరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఆయన నియంత అని పిలుస్తుండగా, దేశంలోని సంపన్నుల మద్దతుతో కొనసాగుతున్నారు. భారతదేశంలో సహితం జి-20 సదస్సు పేరుతో విస్తృతంగా సంబరాలు జరపడం కోసం ప్రణాళికలు వేస్తున్నారు. 2023 చివరిలో జరిగే కీలకమైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలలో; 2024 లోక్‌సభ ఎన్నికలలో ప్రధాని మోడీని తిరుగులేని అంతర్జాతీయ నాయకుడిగా ప్రచారం చేయడానికి ఈ సంబరాలు ఉపయోగపడవచ్చు. కానీ నిర్దుష్టంగా జాతీయంగా, అంతర్జాతీయంగా భారత్ ఏ విధంగానూ నిర్ణయాత్మక పాత్ర వహించేందుకు దోహదపడే అవకాశం లభిస్తుంది? అంటే సందేహాస్పదమే. చైనాతో గల మన వైరుధ్యాలను పక్కన పెట్టి ఇండోనేషియాలో ప్రధాని జింగ్ పింగ్‌ను పలకరింపవలసి రావడం కేవలం భారత్ లో వచ్చే ఏడు జరిగే ఈ సదస్సుకు ఆయన హాజరయ్యే విధంగా చూసేందుకే.

అంతర్జాతీయంగా ఒక వంక అమెరికా, మరో వంక చైనా తమ, తమ రాజకీయ, ఆర్ధిక, సైనిక ఆధిపత్యాల కోసం కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్న సమయంలో భారత్ స్వతంత్రించి వ్యవహరించేందుకు ఈ సదస్సు ఉపయోగపడే అవకాశం ఉండదు. జి-20లో అంతర్జాతీయ ద్రవ్యసంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ), ఆర్ధిక స్థిరీకరణ బోర్డు (ఎఫ్‌ఎస్‌బి), ఆర్ధిక సహకారం, అభివృద్ధి సంస్థ (ఒఇసిడి) వంటి అన్ని శక్తివంతమైన ఆర్ధిక సంస్థలు ఉన్నాయి. కీలక విధానాలను ఆ సంస్థలే నిర్దేశించే అవకాశం ఉంటుంది. వీటితో పాటు సభ్యదేశాలు ఆమోదించిన ఒప్పందాలను సహితం అమలు పరచలేని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ), ‘2000 నాటికి అందరికీ ఆరోగ్యం’ లక్ష్యం చేరుకోలేకపోయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ), స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను అమలు చేయలేని ఐక్యరాజ్యసమితి (యుఎన్) వంటి నిస్సహాయ ప్రపంచ సంస్థలు కూడా ఉన్నాయి.

జి20 అధ్యక్షత కాలంలో రాబోయే సంవత్సర కాలంలో వరుసగా సమావేశాలు, సంబరాలు జరపడం ద్వారా సంపన్నులు, శక్తివంతులకు వినోదం కలిగించే కార్యక్రమాలు అనేకం జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ పేదలు, రైతులు, ఎంఎస్‌ఎంఇలు, నిరుద్యోగులు, పేద-, మధ్య తరగతి మహిళల ప్రయోజనాల గురించి పట్టించుకునే అవకాశం ఉండదు. ఇది రాజకీయాల ద్వారా అంతర్జాతీయ ఆర్ధిక విధానాలను మెరుగుపరిచే రీతిలో కేవలం ఎజెండాను సెట్ చేయడం వరకే పరిమితం కాకుండా, ఆర్ధిక అంశాల ఆలంబనగా పాశ్చాత్య రాజకీయ వత్తిడులను తట్టుకొని నిర్ణయాత్మక పాత్రను భారత్ ఏ మేరకు వహింప గలదు అన్నది సందేహాస్పదమే. నేడు అమెరికా, చైనాల మధ్య ప్రపంచ దేశాలు బృందాలుగా విడిపోతున్న తరుణంలో ఏకాభిప్రాయం సాధించి, ఆచరణలకు పూనుకొనే విధంగా చేయడం సాధ్యమయ్యే అంశం కాబోదు.

ఈ రెండు బృందాల మధ్య విభజనను, వివాదాలను శాంతిప చేయడం ద్వారా స్తంభించిపోతున్న సరఫరా గొలుసును పునర్నిర్మించడానికి మార్గాలను, సాధనాలను వ్యూహాత్మకంగా నిర్దేశింపగలమా? ఒక వంక జి20 నుండి రష్యాను వెలుపల ఉంచాలని పశ్చిమ దేశాలు చూస్తుండగా, నాటో దేశాలు ఉక్రెయిన్‌కు దూరంగా ఉంచాలని రష్యా ప్రయత్నం చేస్తున్నది. ఈ రెండింటి మధ్య మధ్యేమార్గం కనుగొననిదే అంతర్జాతీయ వ్యవస్థ ఓ గాడిన పడే అవకాశం లేదు. ఆ దిశలో పరిష్కారం కనుగొంటేగాని అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం భూతం, ముఖ్యంగా ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను కట్టడి చేయడం సాధ్యం కాదు. ఈ విషయంలో జి20 క్రియాశీలకంగా పాత్ర ఏ మేరకు వహింపగలదు అన్న అంశంపైననే ఈ కూటమి సాధికారిక మనుగడ ఆధారపడి ఉంటుంది. జి20 దేశాలలో మూడు దేశాలు 10 శాతం మించి ద్రవ్యోల్బణం ఎదుర్కొంటుండగా, 7 దేశాలు 7.50 నుండి 10 శాతం వరకు ఎదుర్కొంటున్నాయి.

ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆర్ధిక ఆంక్షలు ఇప్పుడు పెద్దగా ప్రభావం చూపడంలేదు. అయితే ఇంధన సంక్షోభానికి దారితీస్తుంది. రష్యా సరఫరా చేసే గ్యాస్ పై పశ్చిమ దేశాలు ఆధారపడి ఉండడంతో రాబోయే కాలంలో పెను ఇంధన సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంది. ఇంధనం ఉత్పత్తి చేసే అమెరికా, రష్యా, సౌదీ అరేబియా దేశాలతో పాటు ఇంధనం వినియోగించే ఐరోపా తదితర దేశాల ప్రయోజనాల మధ్య అనుసంధానం కలిగించడం ప్రస్తుతం జి20 ముందున్న పెద్ద సవాల్. ఆహార, ఇంధన ధరలు పెరుగుతూ ఉండటం ప్రజాస్వామ్య దేశాలలో రాజకీయ అస్థిరతకు దారితీసే అవకాశం ఉంది. ఇప్పటికే పలు దేశాలలో బ్యాంకు వడ్డీ రేట్లు పెంచుతూ ఉండడంతో సులభంగా వాణిజ్యం జరిపే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. తక్షణ ఆహార కొరతను కట్టడి చేయడంతో పాటు, నూతన ఆహార సరఫరా మార్గాలను రూపొందించడంలో జి20 క్రియాశీల పాత్ర వహింప కలిగితే ఈ సమస్యలు పరిష్కారం కనుగొనే అవకాశం ఉంటుంది.

ద్రవ్యోల్బణం కారణంగా ఆర్ధిక వృద్ధి స్తంభించే అవకాశం ఉంటుంది. దానితో ప్రజల కొనుగోలుశక్తి తగ్గి, ఉత్పత్తులకు డిమాండ్ పడిపోతుంది. ప్రస్తుతం భారత్ ఆ దిశలో సమస్యలు ఎదుర్కొంటున్నది. ఇటువంటి మౌలికమైన ఆర్ధిక సమస్యలపై దృష్టి సారించకుండా జి20 పర్యావరణం వంటి సైద్ధాంతిక అంశాలపై దృష్టి సారిస్తే ఒనగూరే ప్రయోజనం ఉండదు. జి20 అధ్యక్ష స్థానంలో తక్షణం ఎదురవుతున్న సమస్యలను భారత్ ఏ మేరకు అంతర్జాతీయ అజెండాలో ముందుంచి, సామరస్య పరిష్కారం సాధించే విధంగా కృషి చేయగలదో చూడాలి. ఈ దిశలో చెప్పుకోదగిన ఫలితాలు సాధించలేని పక్షంలో జి20 ఓ కాఫీ క్లబ్ గా మాత్రమే మిగిలిపోతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News