Wednesday, January 22, 2025

ఎగుమతుల నిషేధానికి రైతాంగం బలి

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ తీరు తెన్నులను చూస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి మూడోసారి అధికారానికి వచ్చేందుకు కోట్లాది మంది రైతాంగాన్ని బలిపెట్టేందుకు పూనుకుందా అంటే అవునని చెప్పాల్సి వస్తోంది. తాను చెప్పిన మాటలను తానే దిగమింగి ప్రకటిత విధానాల నుంచి వైదొలగటాన్ని చూసి అనేక మంది అలాగే భావిస్తున్నారు. ఎగుమతి నిషేధాల జాబితాలో ఇక పంచదార వంతు అంటూ ఆగస్టు 23వ తేదీన ఒక వార్త వెలువడింది. అంతకు ఒక రోజు ముందు “రైతులు లాభపడటాన్ని అడ్డుకుంటున్న ప్రభుత్వం” అనే శీర్షికతో డెక్కన్ హెరాల్డ్ పత్రికలో అజిత్ రనడే అనే ఆర్థికవేత్త కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి ఒక విశ్లేషణ రాశారు. కేంద్ర నిర్ణయాల మీద వివిధ కోణాల్లో మరికొందరు కూడా రాస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఉన్న ఆంక్షలన్నింటినీ సడలిస్తామని, ఎలాంటి పరిమితులు విధించబోమంటూ 2018లో కేంద్ర ప్రభుత్వం ఎగుమతిదిగుమతి విధానంలో పేర్కొన్నది.

తరువాత దాని కొనసాగింపుగా రాష్ట్రాలతో సంప్రదించకుండా, వాటి అభిప్రాయం తీసుకోకుండా మూడు సాగు చట్టాలను తీసుకువచ్చి దేశం మీద రుద్దాలని చూసిన సంగతి తెలిసిందే. రైతుల ఆందోళన కారణంగా తప్పనిసరై వాటిని వెనక్కు తీసుకున్నప్పటికీ వాటితో నిమిత్తం లేకుండా అంతకు రెండేళ్ల ముందు ప్రకటించిన ఎగుమతి దిగుమతి విధానాన్ని కూడా అటక ఎక్కించింది. ఎప్పుడేం చేస్తారో తెలియని ఇలాంటి పాలకులను నమ్మి ఎవరైనా ముందుకు పోగలరా ? గడచిరైతొమ్మిదేండ్ల పాలనలో ఒకటి స్పష్టం. పారిశ్రామిక, వాణిజ్యవేత్తల మీద ఉన్న శ్రద్ద, ప్రేమ రైతాంగం మీద లేదు. వారికి ఇచ్చినన్ని రాయితీలు, రద్దు చేసిన రుణాలు రైతులకు లేవు.ఇప్పటి వరకు పంచదార ఎగుమతుల మీద ఆంక్షలు, పరిమితులు మాత్రమే విధించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా నిషేధం విధిస్తూ నేడో రేపో ప్రకటన చేయనుందని ఆగస్టు 23న రాయిటర్ వార్తా సంస్థ పేర్కొన్నది. అంతకు ముందు వచ్చే సీజన్‌లో 40లక్షల టన్నులకు ఎగుమతులు పరిమితం చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అక్టోబరు ఒకటవ తేదీ నుంచి చెరకు ఆర్థిక సంవత్సరం ప్రారంభమౌతుంది.

దేశంలో అనేక ప్రాంతాల్లో తగినంత వర్షపాతం లేని కారణంగా చెరకు దిగుబడి తగ్గవచ్చని అందువలన పంచదార ధరలు పెరగకుండా ఎగుమతులపై నిషేధం విధించవచ్చని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు వార్తలో తెలిపింది. సెప్టెంబరు 30వ తేదీ వరకు 61లక్షల టన్నుల పంచదార ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం మిల్లులకు అనుమతి ఇచ్చింది. గత ఏడాదిలో 111లక్షల టన్నుల ఎగుమతికి అనుమతించారు.వచ్చే రెండు సంవత్సరాల్లో దిగుమతి తగ్గవచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరో నెల రోజుల్లో ముగియనున్న సంవత్సరంలో పంచదార ఉత్పత్తి 3.6 కోట్ల టన్నులు ఉంటుందని అంచనా వేయగా 3.28ోట్లకు మించే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. మన దేశం నుంచి ఎగుమతి లేకుంటే ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో పెరిగిన ధరలు మరింత పెరుగుతాయని, బ్రెజిల్ ఎగుమతిదారులు మంచి ధరతో లబ్దిపొందుతారని భావిస్తున్నారు.

2022 ఏప్రిల్ 13న గుజరాత్ రాజధాని అహమ్మదాబాద్‌లో ఒక భవనాన్ని నరేంద్రమోడీ వీడియో ద్వారా ప్రారంభించారు. ఆ సందర్భంగా సందేశమిస్తూ ఉక్రెయిన్ యుద్దం తరువాత ఏ దేశానికి ఆ దేశం తన ఆహార భద్రత సంగతి తాను చూసుకుంటోందని తాను ఒకసారి అమెరికా అధినేత జో బైడెన్‌తో మాట్లాడినపుడు ప్రస్తావించానని, ప్రపంచ వాణిజ్య సంస్థ గనుక అనుమతి ఇస్తే ప్రపంచానికి ఆహార ధాన్యాలను సరఫరా చేసేందుకు సిద్దంగా ఉన్నాం అని చెప్పినట్లు మోడీ ఆ సందర్భంగా వెల్లడించారు. మన జనానికి సరిపడా ఆహారం ఇప్పటికే మన దగ్గర ఉందని, కానీ మన రైతులను చూస్తుంటే ప్రపంచానికే ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నదని, ప్రపంచ వాణిజ్య సంస్థ ఎప్పుడు అనుమతిస్తుందో తెలియదు గానీ మనం మాత్రం ప్రపంచానికి ఆహారం అందించగలం అని నరేంద్రమోడీ చెప్పారు.

అదే ఏడాది మేనెల నాలుగవ తేదీన ఐరోపాలోని కోపెన్‌హాగన్‌లో ఒక సమావేశానికి హాజరైన ప్రధాని మోడీ అక్కడి భారతీయుల సమావేశంలో మాట్లాడుతూ ఆహార ధాన్యాల్లో భారత్ స్వయ సమృద్ధి సాధించిందనీ, ఆకలి నుంచి ప్రపంచాన్ని రక్షించేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. ప్రపంచ ఆకలి సూచిక 2013లో 78 దేశాల జాబితాలో మనది 63 కాగా శ్రీలంక 43, నేపాల్ 49, పాకిస్తాన్ 57వ స్థానాలతో మన కంటే ఎగువన ఉన్నాయి. 2022లో 121 దేశాలకు గాను 107వ స్థానంలో మన దేశం ఉంది. శ్రీలంక 64, మయన్మార్ 71, నేపాల్ 81, బంగ్లాదేశ్ 84, పాకిస్తాన్ 99 స్థానాల్లో ఉన్నాయి. ఈ వివరాలన్నీ తెలిసిన తరువాత కూడా ప్రపంచ ఆకలి తీరుస్తామని వేదికల మీద చెప్పటం నరేంద్రమోడీకి తప్ప మరొక నేతకు సాధ్యం అవుతుందా ?
ప్రధాని మాటల కొనసాగింపుగా అంతకు ముందు ఏడాది చేసిన 20లక్షల టన్నులను 202223లో కోటి టన్నులకు పెంచి గోధుమలను ఎగుమతి చేసే లక్ష్యాన్ని సాధించేందుకు ఇండోనేషియా,ట్యునీషియా, మొరాకో, ఫిలిప్పీన్స్,టర్కీ, థాయిలాండ్, వియత్నాం, అ

ల్జీరియా, లెబనాన్‌లకు ప్రతినిధి బృందాలను పంపనున్నట్లు మే 12న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ప్రకటించింది.అంతే కాదు, కొన్ని దేశాలకు ఎగుమతులు ప్రారంభమైనట్లు కూడా చెప్పారు. చిత్రం ఏమిటంటే మరుసటి రోజే గోధుమల ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. తరువాత సెప్టెంబరు తొమ్మిది నుంచి అమల్లోకి వచ్చే విధంగా బాస్మతేతర బియ్యం ఎగుమతులపై ఇరవైశాతం ఎగుమతి పన్ను విధించటంతో పాటు, కొద్దిగా ముక్కలైన బియ్యం ఎగుమతులపై కూడా పూర్తి నిషేధం విధించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఓడలకు ఎక్కించేందుకు వివిధ రేవుల్లో ఉన్న ఐదు లక్షల టన్నుల గోధుమలను ఎగుమతిదార్లు వెనక్కు తీసుకువచ్చి మార్కెట్లో అమ్మేందుకు పూనుకోవటంతో మార్కెట్లో పదిపదిహేనుశాతం ధరలు పడిపోయాయి. దాంతో ఎగుమతిదార్ల వత్తిడికి లొంగి రేవుల్లో నమోదైన మేరకు ఎగుమతులు చేసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తరువులను సవరించింది. మొత్తం మీద రైతులు పెద్ద ఎత్తున నష్టపడ్డారు.

ఈ ఏడాది తాజాగా గోధుమ పిండి, మైదా, గోధుమ రవ్వ ఎగుమతులను కూడా నిషేధించింది. అంతే కాదు ఇప్పటికే రష్యా నుంచి తక్కువ ధరలకు ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న మన దేశం ఇప్పుడు గోధుమలను కూడా దిగుమతి చేసుకోవాలని చూస్తోంది. టన్నుకు 25 నుంచి 40 డాలర్ల వరకు తక్కువకు దిగుమతి చేసుకోవచ్చని వార్తలు వచ్చాయి. స్థానిక మార్కెట్లో పెరిగిన ధరలను తగ్గించేందుకు అని చెబుతున్నారు. ఇదంతా త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు,తదుపరి జరిగే లోక్‌సభ ఎన్నికల నాటికి ధరలను తగ్గించామని జనం ముందు చెప్పుకొనేందుకు తప్ప వేరు కాదన్నది స్పష్టం.. ఉల్లి ధరల పెరుగుదల సూచన కనిపించటంతో వాటి ఎగుమతులపై 40శాతం పన్ను విధించుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో నాసిక్ ప్రాంతంలోని వ్యాపారులు ఉల్లి కొనుగోళ్లను నిలిపివేశారు. క్వింటాలు రు.2,410 రూపాయల ధరతో తాము కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రి పియుష్ గోయల్ ప్రకటించారు.ఎగుమతులు లేక కేంద్రం దిగుమతులు చేసుకుంటే తాము కొన్న ధరలకంటే మార్కెట్లో తగ్గితే నష్టపోతామన్న భయంతో వారు మానుకున్నారు.

ధరలు పెరిగినపుడు కొద్ది నెలలు ఉల్లి తినటం మానుకుంటే సరి అధిక ధరలకు ఎవరు కొనమన్నారు అంటూ మహారాష్ర్ట బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వ మంత్రి దాదా భూసే అన్నారు. 2019లో ఉల్లి ధర కిలో రు.100కు చేరినపుడు నేను ఉల్లిపాయలు తినను అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్న సంగతి తెలిసిందే. ఉల్లి ధరలను ఎన్నికల ప్రచార అస్త్రంగా మార్చిన గతం బిజెపికి గుర్తుకు వచ్చి ముందు జాగ్రత్తపడుతున్నది. కానీ నష్టపోతున్నది రైతులే. ధరలు పతనమైనపుడు కేంద్ర ప్రభుత్వం క్వింటాలు రు.2,410కి కొన్న దాఖలా లేదు. స్వేచ్చామార్కెట్‌లో ఎక్కడ ధర ఎక్కువగా ఉంటే అక్కడే అమ్ముకోవచ్చు, రైతులు కూడా నేరుగా ఎగుమతులు కూడా చేసుకోవచ్చు అందుకే మూడు సాగు చట్టాలు అని బల్లలు చరిచి, ఊరూవాడా తిరిగి మరీ చెప్పారు. వ్యాపారుల నిల్వలతో సహా అన్ని రకాల నియంత్రణలను ఎత్తివేస్తామని రైతులు నేరుగా ఎగుమతులు చేసుకోవచ్చని అరచేతిలో ప్రపంచ మార్కెట్లను చూపారు. ఇప్పుడు ఆ అవకాశాలను ఎందుకు అడ్డుకున్నట్లు ? తమ మీద ఉద్యమించినందుకు రైతుల మీద కక్ష తీర్చుకుంటున్నారా ?

మరోవైపున పారిశ్రామిక, సేవా ఉత్పత్తుల ఎగుమతులకు ప్రోత్సాహకాలిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులపై ఎగుమతి పన్ను విధించి అడ్డుకుంటున్నారు, రైతులపై ఎందుకీ కత్తి ? పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న ఎగుమతి ప్రోత్సాహకాల మాదిరే రైతాంగ ప్రయోజనాలను కాపాడాలా లేదా ? ఎగుమతులకు రాయితీలు ఇచ్చి విదేశీయులకు మన వస్తువులను చౌకగా అందించేందుకు పడుతున్న తాపత్రయంలో నూరోవంతు మన వినియోగదారుల మీద చూపి సబ్సిడీలు ఇచ్చి ఆదుకోవాలి తప్ప రైతుల నడ్డి విరవటం ఏమిటి ?ఏ రోటి దగ్గర ఆ పాట పాడుతున్న బిజెపి పాలకుల విధానాలు తెలియనంత అమాయకంగా జనాలు లేరు. ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మే సందర్భంగా ప్రభుత్వాలు పాలన కోసం తప్ప వ్యాపారాలు చేసేందుకు కాదని చెబుతారు. అదే కేంద్ర ప్రభుత్వం ఇటీవల మాటాలను, ఇప్పుడు ఉల్లిపాయలను కూడా రాయితీ ధరలకు ఎన్‌సిసిఎఫ్, నాఫెడ్ ద్వారా అమ్ముతూ వ్యాపారం చేస్తున్నది.

ఇందుకోసం వెచ్చిస్తున్న సబ్సిడీ మొత్తాన్ని ఎక్కడ నుంచి చెల్లిస్తున్నట్లు ? ప్రజల సొమ్మును బిజెపికి ఓట్ల కోసం ప్రభుత్వం ద్వారా ఖర్చు చేస్తున్నారు. ఇటీవల బాస్మతి రకాలు తప్ప మిగిలిన అన్ని రకాల బియ్యం ఎగుమతుల మీద కేంద్రం నిషేధం విధించింది. దాంతో అమెరికాలో మనవారు అక్కడి దుకాణాల మీద ఎగబడి ఎలా కొనుగోలు చేసిందీ చూశాము. కొంత మంది చెబుతున్నదాని ప్రకారం ఇథనాల్ ఉత్పత్తిదారుల కోసమే ఈ పని చేశారు. ముక్కలుగా మారిన 5060లక్షల టన్నుల బియ్యంలో 30లక్షల టన్నులను ఇథనాల్‌కు కేటాయించనున్నట్లు వార్తలు. బియ్యం ఎగుమతులపై నిషేధం రైతాంగానికి నష్టం.తమకు కావాల్సిన బియ్యానికి క్వింటాలుకు రు.3,400 చెల్లించి మరీ కొంటామని అడిగినప్పటికీ కర్ణాటక రాష్ర్ట ప్రభుత్వానికి విక్రయించేందుకు కేంద్ర నిరాకరించింది. అదే ప్రభుత్వం పెట్రోలులో కలిపేందుకు తయారు చేసే ఇథనాల్‌కు మాత్రం రు.2,000కే సరఫరా చేస్తున్నది. నీతి అయోగ్ రూపొందించిన ఒక పత్రంలో పేర్కొన్న సమాచారం మేరకు 202526 నాటికి పెట్రోలులో 20శాతం ఇథనాల్‌ను మిళితం చేయాలని ప్రతిపాదించారు.

దీనిలో సగం బియ్యం నుంచి తయారు చేయాల్సి ఉంది.నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి సంవత్సరం 201415 నుంచి ఇప్పటి వరకు వివిధ బాంకుల నుంచి రద్దు చేసిన రుణాల మొత్తం రు.14లక్షల 56వేల కోట్లు. దీనిలో సగానికిపైగా మొత్తం బడా పారిశ్రామికవేత్తలు, సేవలందించే కంపెనీలవే ఉన్నాయి.ఈ రుణాలను రద్దు అనకూడదు, పక్కన పెట్టాము, వసూలు చేస్తాము అని కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతారు. అదేలా ఉంది.2014 ఏప్రిల్ నుంచి 2023 మార్చి నెల వరకు వసూలు చేసిన మొత్తం రు.2.04లక్షల కోట్లు మాత్రమే. బడా సంస్థలకు పన్ను రాయితీల మొత్తం ఎలా ఉందో చూద్దాం.201415లో కార్పొరేట్ టాక్సు రు.4.3లక్షల కోట్లు ఉండగా అది 201819నాటికి 6.6లక్షల కోట్లకు పెరిగింది. తరువాత దాన్ని తగ్గించటంతో 202122 నాటికి రు.5.5లక్షల కోట్లకు పడిపోయింది. దిగుమతుల మీద విధించే కస్టవ్‌‌సు సుంకం రు.1.9లక్షల కోట్ల నుంచి రు.1.4లక్షల కోట్లకు తగ్గింది.

మధ్య తరగతి ఉద్యోగులు ఎక్కువగా చెల్లించే ఆదాయపన్ను మాత్రం ఇదే కాలంలో రు.2.6 నుంచి 5.6లక్షల కోట్లకు పెరిగింది. ఈ కాలంలోనే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే మొత్తం పన్నుల్లో కార్పొరేట్ టాక్సు వాటా 34.5 నుచి 24.7శాతానికి, కస్టవ్‌‌సు పన్ను 15.1 నుంచి 6.1శాతానికి తగ్గగా ఆదాయపన్ను 20.8 నుంచి 25.3శాతానికి పెరిగింది. ఇంతగా కార్పొరేట్ల కొమ్ము కాస్తున్న పాలకులు రైతుల దగ్గరకు వచ్చేసరికి ఎగుమతులపై నిషేధాలతో వారి నడ్డివిరిచేందుకు చూస్తున్నారు. వారి స్వయం ప్రకటిత విధానాలనే పక్కన పెట్టి మరీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదంతా వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికలు, తరువాత లోక్‌సభ ఎన్నికల నాటికి ధరల పెరగకుండా చూసుకోవటం, ఆ ఘనత తమదే అని చెప్పుకొనేందుకు తప్ప మరొకటి కాదు. ఎగుమతుల రద్దు అంటే దాన్ని అవకాశంగా తీసుకొని కృత్రిమ కొరతను సృష్టించి ధరలను పెంచిన గతం పునరావృతం అవుతుందా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News