1-1తో సిరీస్ సమం
మీర్పూర్ : భారత్‌బంగ్లాదేశ్ మహిళల జట్ల శనివారం జరిగిన మూడో, చివరి వన్డే టైగా ముగిసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 11తో సమంగా ముగిసింది. తొలి వన్డేలో బంగ్లాదేశ్ విజయం సాధించగా, రెండో వన్డేలో టీమిండియా జయకేతనం ఎగుర వేసింది. మూడో వన్డే టైగా ముగియడంతో సిరీస్ సమమైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 4 వికెట్ల కోల్పోయి 225 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన భారత్ 49.3 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. దీంతో మ్యాచ్ టై అయ్యింది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ షఫాలీ వర్మ (4), వన్‌డౌన్‌లో వచ్చిన యస్తిక భాటియా (5) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు.
దీంతో భారత్ 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ఓపెనర్ స్మృతి మంధాన, హర్లీన్ డియోల్ తమపై వేసుకున్నారు. ఇద్దరు బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. మంధాన, హర్లీన్‌లు భారీ షాట్ల జోలికి వెళ్లకుండా సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. ఈ జోడీని విడగొట్టేందుకు బంగ్లా బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మంధాన, హర్లీన్‌లు కలిసి మూడో వికెట్‌కు కీలకమైన 107 పరుగులు జోడించారు. అయితే కుదరుగా ఆడుతున్న మంధానను ఫహిమా ఖతూన్ పెవిలియన్ పంపించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మంధాన 5 ఫోర్లతో 59 పరుగులు చేసింది. ఆ తర్వాత బంగ్లా బౌలర్లు పుంజుకున్నారు. వరుస క్రమంలో వికెట్లు తీసి భారత్‌ను కష్టాల్లోకి నెట్టారు. మరోవైపు అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన హర్లీన్ డియోల్ 108 బంతుల్లో 9 ఫోర్లతో 77 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగింది. జెమీమా రోడ్రిగ్స్ 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.
ఫర్జానా సెంచరీ…
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ను ఓపెనర్లు షమీమా సుల్తానా, ఫర్జానా హక్‌లు ఆదుకున్నారు. వీరిద్దరూ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొని శుభారంభం అందించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన షమీమా 5 ఫోర్లతో 52 పరుగులు చేసింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించారు. మరోవైపు అద్భుత ఇన్నింగ్స్‌తో అలరించిన ఫర్జానా 7 ఫోర్లతో 107 పరుగులు చేసింది. శోభన 23 (నాటౌట్), కెప్టెన్ నిగర్ సుల్తానా (24) తమవంతు పాత్ర పోషించారు.