Wednesday, January 29, 2025

పెర్త్ లో మనదే గెలుపు

- Advertisement -
- Advertisement -

బోర్డర్‌గవాస్కర్ టెస్టు సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 295 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని నమోదు చేసింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో 10 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 534 పరుగుల క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 238 పరుగులకు కుప్పకూలింది. మ్యాచ్‌లో 8 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ జస్‌ప్రిత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

ఆరంభంలోనే..
ఓవర్ నైట్ స్కోరు 12/3తో సోమవారం నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్‌లోనే ఉస్మాన్ ఖ్వాజా (4) ఔటయ్యాడు. అతన్ని సిరాజ్ వెనక్కి పంపాడు. దీంతో ఆస్ట్రేలియా 17 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో స్టీవ్ స్మిత్‌తో కలిసి ట్రావిస్ హెడ్ కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఇద్దరు జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచేందుకు ప్రయతించారు. స్మిత్ తన మార్క్ డిఫెన్స్‌తో వికెట్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. హెడ్ మాత్రం దూకుడును ప్రదర్శించాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన స్మిత్ 60 బంతుల్లో 17 పరుగులు చేసి సిరాజ్ చేతికి చిక్కాడు.

హెడ్, మార్ష్ పోరాటం..
స్మిత్ ఔటైనా హెడ్ తన పోరాటం కొనసాగించాడు. అతనికి మిఛెల్ మార్ష్ అండగా నిలిచాడు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇటు మార్ష్, అటు ట్రావిస్ భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ స్కోరును ముందుకు నడిపించారు. కానీ 101 బంతుల్లో 8 బౌండరీలతో 89 పరుగులు చేసిన హెడ్‌ను బుమ్రా ఔట్ చేశాడు. దీంతో 82 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ అలెక్స్ కారె కూడా కుదురుగా ఆడాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన మార్స్ 67 బంతుల్లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 47 పరుగులు చేసి తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి వేసిన అద్భుత బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. నితీశ్‌కు ఇదే తొలి టెస్టు వికెట్ కావడం విశేషం.

తర్వాత వచ్చిన మిఛెల్ స్టార్క్ కొద్ది సేపు వికెట్లను కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. అయితే 35 బంతుల్లో 12 పరుగులు చేసిన అతన్ని వాషింగ్టన్ సుందర్ ఔట్ చేశాడు. ఆ వెంటనే నాథన్ లియాన్‌ని కూడా సుందర్ వెనక్కి పంపాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అలెక్స్ 2 ఫోర్లతో 36 పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 58.4 ఓవర్లలో 238 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ మూడేసి వికెట్లను పడగొట్టారు. వాషింగ్టన్‌కు రెండు, హర్షిత్, నితీశ్‌లకు చెరో వికెట్ లభించింది. కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా 104 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 487 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది.

భారత్ మొదటి ఇన్నింగ్స్ : 150 ఆలౌట్.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 104 ఆలౌట్.
భారత్ రెండో ఇన్నింగ్స్ : 487/6 డిక్లేర్డ్.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: నాథన్ మెక్ స్విని ఎల్బీబి బుమ్రా 0, ఉస్మాన్ ఖ్వాజా (సి) పంత్ (బి) సిరాజ్ 4, పాట్ కమిన్స్ (సి) కోహ్లి (బి) సిరాజ్ 2, మార్నస్ లబుషేర్ ఎల్బీబి బుమ్రా 3, స్టీవ్ స్మిత్ (సి) పంత్ (బి) సిరాజ్ 17, ట్రావిస్ హెడ్ (సి) పంత్ (బి) బుమ్రా 89, మిఛెల్ మార్ష్ (బి) నితీష్ రెడ్డి 47, అలెక్స్ కారె (బి) హర్షిత్ రాణా 36, మిఛెల్ స్టార్క్ (సి) జురెల్ (బి) వాషింగ్టన్ 12, లియాన్ (బి) వాషింగ్టన్ 0, హాజిల్‌వుడ్ నాటౌట్ 4, ఎక్స్‌ట్రాలు 24, మొత్తం 58.4 ఓవర్లలో 238 ఆలౌట్.
బౌలింగ్: జస్‌ప్రిత్ బుమ్రా 121423, మహ్మద్ సిరాజ్ 142513, హర్షిత్ రాణా 13.41691, వాషింగ్టన్ సుందర్ 150482, నితీశ్ రెడ్డి 40211.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News