మొహాలీ: ప్రపంచకప్‌నకు సన్నాహకంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత్ అదరగొట్టింది. శుక్రవారం మొహాలీ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రాహుల్ సేన 10 ఆధిక్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. కంగారూ టీమ్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (52), స్టీవ్ స్మిత్ (41), లబుషేన్ (39), గ్రీన్ (31), జోస్ ఇంగ్లిస్ (45), స్టోయినిస్ (29) పరుగులు చేశారు. కెప్టెన్ కమిన్స్ వేగంగా 21 పరుగులు చేశాడు.
భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 48.4 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్‌లు శుభారంభం అందించారు. రుతురాజ్10 ఫోర్లతో 71, గిల్ ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 74 పరుగులు చేశారు. ఇద్దరు తొలి వికెట్‌కు 142 పరుగులను జోడించారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 58 పరుగుల చేశాడు. సూర్యకుమార్ (50) అర్ధ సెంచరీతో అలరించాడు.