Sunday, January 19, 2025

ఆసియా హాకీ ఛాంపియన్ భారత్

- Advertisement -
- Advertisement -

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్ విజేతగా నిలిచింది. మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్ 1-0 తేడాతో ఆతిథ్య జట్టు చైనాను ఓడించింది. భారత్‌కు ఇది ఐదో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కావడం విశేషం. తుదిపోరులో భారత్‌కు చైనా నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియాకు ఆతిథ్య టీమ్ గట్టి పోటీ ఇచ్చింది. భారత్ గోల్ కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పలు సార్లు గోల్ సాధించే అవకాశాలు దక్కినా ఫలితం లేకుండా పోయింది. పటిష్టమైన డిఫెన్స్‌తో చైనా హర్మన్ సేనను నిలువరించింది. చైనా కూడా అటాకింగ్ గేమ్‌తో భారత్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. వరుస దాడులు చేస్తూ హడలెత్తించింది. ప్రథమార్ధంలో రెండు జట్లు కూడా గోల్ సాధించడంలో విఫలమయ్యాయి. తొలి హాఫ్‌లో భారత్ కాస్త ఆధిపత్యం చెలాయించినా గోల్ మాత్రం సాధించలేక పోయింది. రెండో హాఫ్‌లో కూడా పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇటు భారత్ అటు చైనా గోల్ కోసం సర్వం ఒడ్డాయి.

రెండు జట్లు ఒకరి గోల్ పోస్ట్‌పై మరోకరూ దాడులు చేస్తూ ముందుకు సాగాయి. చాలా సేపటి వరకు గోల్ మాత్రం లభించలేదు. అయితే 51వ నిమిషంలో భారత్ శ్రమ ఫలించింది. డిఫెండర్ జుగ్‌రాజ్ సింగ్ అద్భుత గోల్‌తో భారత్‌కు పైచేయి సాధించి పెట్టాడు. ఈ ఆధిక్యాన్ని చివరి వరకు కాపాడు కోవడంలో సఫలమైన భారత్ 1-0తో మ్యాచ్‌ను గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. భారత్‌కు ఇది ఐదో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్. కిందటి సీజన్‌లో కూడా భారత్ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని సాధించింది. ఇక చైనా వేదికగా జరిగిన ఈ టోర్నీలో కూడా ఒక్క ఓటమి కూడా చవిచూడకుండానే ట్రోఫీని దక్కించుకుంది. ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లోనూ హర్మన్‌ప్రీత్ సింగ్ సేన కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే పాకిస్థాన్ టీమ్ ఆసియా ట్రోఫీలో కాంస్యం గెలుచుకుంది. కాంస్యం కోసం దక్షిణ కొరియాతో జరిగిన పోరులో పాకిస్థాన్ 52తో విజయం సాధించింది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పోటీ పడ్డాయి. భారత్, పాకిస్థాన్, చైనా, దక్షిణ కొరియా జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. దక్షిణ కొరియాపై భారత్, పాకిస్థాన్‌పై చైనా గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. తాజాగా మంగళవారం చైనాతో జరిగిన తుది పోరులో గెలిచిన భారత్ ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News