Tuesday, January 7, 2025

జపాన్‌పై భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

ఆసియా అండర్19 వన్డే క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ తొలి విజయం నమోదు చేసింది. సోమవారం జపాన్‌తో జరిగిన గ్రూప్‌ఎ మ్యాచ్‌లో యువ భారత జట్టు 211 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన జపాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 128 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవిచూసింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన జపాన్‌ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. ఓపెనర్లు హుగొ కెల్లి, నిహార్ పార్మర్‌లు డిఫెన్స్‌కే పరిమితమయ్యారు. ఇద్దరు భారీ షాట్ల జోలికి వెళ్లకుండా రక్షణాత్మకంగా బ్యాటింగ్ చేశారు.

దీంతో స్కోరు నత్తను తలపించింది. పార్మర్ 31 బంతుల్లో 14 పరుగులు చేసి హార్దిక్ రాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో కెల్లితో కలిసి తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ కోజి అబె ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. కార్తీకేయ అద్భుత బంతితో అతన్ని క్లీన్‌బౌల్డ్ చేశాడు. కొద్ది సేపట్టికే కజుమా (8) కూడా వెనుదిరిగాడు. అతను రనౌటయ్యాడు. మరోవైపు ఒంటిరి పోరాటం చేసిన హుగొ కెల్లి 111 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మిగతా వారిలో చార్లెస్ హిన్జె 35 (నాటౌట్) ఒక్కడే కాస్త రాణించారు. ఇతర బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో చేతన్ శర్మ, కార్తీకేయ, హార్దిక్ రాజ్ రెండేసి వికెట్లను పడగొట్టారు.

ఆయూష్ దూకుడు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు ఆయూస్ మాత్రె, వైభవ్ సూర్యవంశీ శుభారంభం అందించారు. ఇద్దరు జాగ్రత్తగా ఆడుతూ స్కోరును ముందుకు నడిపించారు. వైభవ్ సమన్వయంతో బ్యాటింగ్ చేయగా ఆబూష్ చెలరేగి ఆడాడు. వైభవ్ 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 23 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదే సమయంలో 65 పరుగుల తొలి వికెట్ భాగస్వాంలో పాలుపంచుకున్నాడు. ఇక విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించిన ఆయూష్ 29 బంతుల్లోనే 4 సిక్సర్లు, ఆరు ఫోర్లతో 54 పరుగులు చేశాడు.

అమాన్ అజేయ శతకం..
తర్వాత ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను అండ్రే సిద్ధార్థ్, కెప్టెన్ మహ్మద్ అమాన్ తమపై వేసుకున్నారు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. సిద్ధార్థ్ 35 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరోవైపు అమాన్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టుకు అండగా నిలిచాడు. అతనికి కార్తీకేయ సహకారం అందించాడు. కార్తీకేయ, అమాన్‌లు కుదురుగా ఆడుతూ జట్టుకు మెరుగైన స్కోరును అందించారు. ఇదే సమయంలో నాలుగో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ధాటిగా ఆడిన కార్తీకేయ 49 బంతుల్లోనే ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 57 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ అమాన్ 118 బంతుల్లో 7 ఫోర్లతో 122 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి హార్దిక్ రాజ్ 25 (నాటౌట్) అండగా నిలిచాడు. దీంతో భారత్ స్కోరు 6 వికెట్లకు 339 పరుగులకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News