ఛాంపియన్స్ ట్రోఫీ టీమిండియా కైవసం ఫైనల్లో కివీస్ చిత్తు
రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆదుకున్న శ్రేయస్, అక్షర్
దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన అభిమానుల సంబరాలు
టీమిండియాకు ప్రధాని మోడీ, సిఎం రేవంత్ అభినందనలుః
ప్రతిష్ఠాత్మకమైన ఐసిసి వన్డే ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా సొతం చేసుకుంది. ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో చివరి వరకు ఆసక్తికరంగా జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఈ క్రమంలో గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కివీస్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. 12 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. దీంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాల్లో మునిగి పోయారు. రోడ్లపైకి వచ్చి టపాసులు కాలుస్తూ, స్వీట్లు పంచుకుని ఆనందాన్ని వ్యక్తపరిచారు. భారత విజయంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. టీమిండియాకు అభినందనలు తెలిపారు.
ప్రతిష్ఠాత్మకమైన ఐసిసి వన్డే ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంది. ఆదివారం న్యూజిలాండ్‌తో చివరి వరకు ఆసక్తికరంగా జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ క్రమంలో గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కివీస్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.
శుభారంభం..
ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ,గిల్ శుభారంభం అందించారు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ స్కోరును పరిగెత్తించారు. గిల్ రక్షణాత్మక బ్యాటింగ్‌ను కనబరచగా రోహిత్ దూకుడును ప్రదర్శించాడు. ఈ జోడీని విడగొట్టేందుకు కివీస్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలాసేపటి వరకు ఫలించలేదు. కీలక ఇన్నింగ్స్ ఆడిన గిల్ 50 బంతుల్లో ఒక సిక్స్‌తో 31 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో రోహిత్‌తో కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించాడు. తర్వాత వచ్చిన సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి నిరాశ పరిచాడు. ఒక పరుగు మాత్రమే చేసి బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఔటయ్యాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 83 బంతుల్లో ఏడు ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో భారత్ 122 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆదుకున్న శ్రేయస్..
ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను శ్రేయస్ అయ్యర్ తనపై వేసుకున్నాడు. అతనికి అక్షర్ పటేల్ అండగా నిలిచాడు. ఇద్దరు కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ జట్టును లక్షం దిశగా నడిపించారు. భారీ షాట్లో జోలికి వెళ్లకుండా సింగిల్స్, డబుల్స్‌తో స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఇద్దరు కుదురు కోవడంతో భారత్ లక్షం దిశగా అడుగులు వేసింది. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ 62 బంతుల్లో రెండు ఫోర్లు, 2 సిక్స్‌లతో 48 పరుగులు చేసి సాంట్నర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కొద్ది సేపటికే అక్షర్ పటేల్ కూడా వెనుదిరిగాడు. అక్షర్ ఒక ఫోర్, మరో సిక్స్‌తో 29 పరుగులు చేశాడు. ఇద్దరు వెంటవెంటనే ఔట్ కావడంతో భారత్ మళ్లీ కష్టాల్లో పడింది. కానీ వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. అతనికి హార్దిక్ పాండ్య (18), రవీంద్ర జడేజా 9 (నాటౌట్) అండగా నిలిచారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ ఒక ఫోర్, సిక్స్‌తో 34 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. దీంతో భారత్ మరో ఓవర్ మిగిలివుండగానే విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. కివీస్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్‌వెల్ రెండేసి వికెట్లను పడగొట్టారు.
ఆదుకున్న మిఛెల్, బ్రేస్‌వెల్
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు విల్ యంగ్, రచిన్ రవీంద్ర శుభారంభం అందించారు. యంగ్ రెండు ఫోర్లతో 15 పరుగులు చేశాడు. మరోవైపు ధాటిగా ఆడిన రచిన్ 29 బంతుల్లోనే 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 37 పరుగులు సాధించాడు. కేన్ విలియమ్స్ 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. వికెట్ కీపర్ లాథమ్ (14) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. దీంతో కివీస్ 108 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో డారిల్ మిఛెల్, గ్లెన్ ఫిలిప్స్ అద్భుత పోరాట పటిమతో కివీస్‌ను ఆదుకున్నారు. ఫిలిప్స్ (34) పరుగులు చేశాడు. సమన్వయంతో ఆడిన మిఛెల్ 3 ఫోర్లతో 63 పరుగులు చేశాడు. ఇక చెలరేగి ఆడిన బ్రేస్‌వెల్ 40 బంతుల్లోనే 3 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో కివీస్ స్కోరు 251 పరుగులకు చేరింది. భారత బౌలర్లలో వరుణ్, కుల్దీప్ రెండేసి వికెట్లను పడగొట్టారు.