Wednesday, January 22, 2025

భారత్ నయా చరిత్ర..

- Advertisement -
- Advertisement -
  •  రెండో టెస్టులో సౌతాఫ్రికాపై 7 వికెట్లతో విజయం
  •  సిరీస్ 1-1తో సమం

కేఫ్‌టౌన్ : సఫారీల గడ్డపై భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. రెండడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కేఫ్‌టౌన్ వేదికగా జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో సునయాస‚ విజయాన్ని నమోదు చేసింది. దీంతో సౌతాఫ్రికా పర్యటనను టీమిండియా చారిత్రాత్మక విజయంతో ముగించినట్లైంది. ఇక ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది.

అంతకుముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసి లక్షాన్ని చేరుకుంది. బౌలర్లకు అనునూలంగా.. బౌన్సర్లు దూసుకొస్తున్న ఈ పిచ్‌పై యశస్వి జైస్వాల్ 28 (23 బంతుల్లో 6×4), రోహిత్ శర్మ 17 నాటౌట్ (22 బంతుల్లో 2×4), శుభ్‌మన్ గిల్ 10 (11 బంతుల్లో 2×4), విరాట్ కోహ్లీ 12 (11 బంతుల్లో 2×4), శ్రేయస్ అయ్యర్(4 నాటౌట్) రాణించడంతో భారత విజయం లాంఛమైంది. ఇక సఫారీ బౌలర్లలో కగిసో రబడా, నండ్రే బర్గర్, మార్కో జాన్సెన్ తలో వికెట్ పడగొట్టారు.

బౌలర్లదే హవా..
తొలిరోజు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సఫారీలు 23.2 ఓవర్లలో 55 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ సిరాజ్(6/15) ఆరు వికెట్లతో సఫారీ టీమ్ పతనాన్ని శాసించగా… జస్‌ప్రీత్ బుమ్రా(2/25), ముఖేష్ కుమార్(2/0) రెండేసి వికెట్లతో చెలరేగారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన భారత్ 153 పరుగులకు కుప్పకూలింది. ఓ దశలో 153/4 స్కోర్‌తో పటిష్టంగా కనిపించినా 11 బంతుల వ్యవధిలో ఒక్క పరుగు కూడా చేయకుండా చివరి 6 వికెట్లు కోల్పోయి చెత్త రికార్డును మూటగట్టుకుంది భారత్. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 46 (59 బంతుల్లో 6×4, 1×6), శుభ్‌మన్ గిల్ 36 (55 బంతుల్లో 5×4), రోహిత్ శర్మ 39 (50 బంతుల్లో 7×4) మాత్రమే రాణించారు. సఫారీ బౌలర్లలో లుంగి ఎంగిడి(3/30), కగిసో రబడా(3/38), నండ్రే బర్గర్(3/42)లు మెరుపు బౌలింగ్‌తో సమష్టిగా రాణించి రోహిత్‌సేన పతనాన్ని శాసించారు.

బుమ్రా చెడుగుడు..
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 36.5 ఓవర్లలో 176 పరుగులకు కుప్పకూలింది. జస్‌ప్రీత్ బుమ్రా(6/61) ఆరు వికెట్లతో సఫారీ బ్యాటర్లకు చుక్కలు చూపెట్టాడు. బుమ్రా ధాటికి ఎయిడెన్ మార్క్మ్ 106 (103 బంతుల్లో 17×4, 2×6) తప్ప మరెవరూ రాణించలేకపోయారు. భారత బౌలర్లలో బుమ్రాకు తోడుగా ముఖేష్ రెండు వికెట్లు, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు. ఇక ఈ ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 98 పరుగుల వెనకబడి బ్యాటింగ్ ప్రారంభించింది. కాగా, సౌ తాఫ్రికా స్టార్ బ్యాటర్ మార్‌క్రమ్ సెంచరీతో 78 పరుగులు మాత్రమే అదనంగా చేసింది. దాంతో టీమిండియా ముందు 79 పరుగుల స్వల్ప ల క్ష్యం నమోదైంది. పూర్తిగా పేస్‌కు అనుకూలించే పిచ్‌తో సౌతాఫ్రికా మూల్యం చెల్లించుకుంది.

తక్కువ బంతుల్లోనే ముగిసి టెస్టు..
107 ఓవర్లలోనే ఈ మ్యాచ్ ఫలితం తేలింది. ఈ టెస్టు అతి తక్కువ బంతులు బౌలింగ్ చేసిన టెస్ట్ మ్యాచ్‌గా రికార్డుల్లోకి ఎక్కి.92 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. 1932లో మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తలపడిన టెస్టు మ్యాచ్ 656(109.3 ఓవర్లు) బంతుల్లోనే ముగిసింది. ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉండగా.. తాజా భారత్, సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్ దానిని బ్రేక్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News