హైదరాబాద్: సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత కుర్రాళ్లు అదరగొట్టారు. సీనియర్ ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగిన టీమిండియా 21 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుని ప్రకంపనలు సృష్టించింది. సొంత గడ్డపై కళ్లు చెదిరే రికార్డు కలిగిన సౌతాఫ్రికాను వారి హోం గ్రౌండ్‌లోనే ఓడించి భారత యువ టీమ్ కొత్త సంప్రదాయానికి తెరలేచింది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, బుమ్రా, షమి, జడేజా, సిరాజ్, కోహ్లి, శ్రేయస్ వంటి స్టార్ ఆటగాళ్లు లేకుండానే భారత్ వన్డే సిరీస్‌లో బరిలోకి దిగింది. మరోవైపు సౌతాఫ్రికా పూర్తి స్థాయి జట్టుతో సిరీస్‌లో పోటీ పడింది. అయినా యువ ఆటగాళ్లతో కూడిన భారత్ చారిత్రక ప్రదర్శనతో అలరించింది. తొలి వన్డేలో అద్భుత ఆటతో అలరించింది. హెండ్రిక్స్, డుస్సెన్, జోర్జీ, మార్‌క్రమ్, క్లాసెన్, మిల్లర్, ముల్డర్, మహారాజ్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్న సౌతాఫ్రికాను 116 పరుగులకే పరిమితం చేసింది.
యువ బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్‌లు అసాధారణ బౌలింగ్‌తో చెలరేగి పోయారు. ఇద్దరు పోటీ పడి వికెట్లు తీయడంతో సఫారీ టీమ్ అత్యల్ప స్కోరుకే కుప్పకూలింది. అర్ష్‌దీప్ ఐదు, అవేశ్ ఖాన్ నాలుగు వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక మూడో వన్డేలోనూ భారత బౌలర్లు అసాధారణ రీతిలో రాణించారు. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బౌలర్లు మరోసారి జట్టుకు అండగా నిలిచారు. అర్ష్‌దీప్, అవేశ్ ఖాన్‌లు మరోసారి సత్తా చాటాడు. అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న అర్ష్‌దీప్ నాలుగు వికెట్లను పడగొట్టాడు. అవేశ్ ఖాన్ కూడా రెండు వికెట్లు తీసి తనవంతు పాత్ర పోషించాడు. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లు కూడా మెరుగైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు.
సత్తా చాటిన సుదర్షన్..
మరోవైపు తొలిసారి టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన యువ ఓపెనర్ సాయి సుదర్షన్ మొదటి సిరీస్‌లోనే అసాధారణ బ్యాటింగ్‌తో అలరించాడు. మూడు మ్యాచుల్లోనూ అద్భుతంగా రాణించాడు. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా మెరుగైన స్కోర్లు సాధించాడు. తొలి రెండు మ్యాచుల్లో వరుస అర్ధ సెంచరీలు సాధించాడు. ఆరంగేట్రం సిరీస్‌లోనే సత్తా చాటాడు. రానున్న రోజుల్లో జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు మార్గం సుగమం చేసుకున్నాడు. జట్టు యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకాన్ని సుదర్షన్ నిలబెట్టాడు. సంజు శాంసన్ కూడా చివరి వన్డేలో సెంచరీతో అదరగొట్టాడు.
ఈ సెంచరీ శాంసన్ కెరీర్‌ను మలుపు తిప్పుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు క్రికెటర్ తిలక్‌వర్మ కూడా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మూడు మ్యాచుల్లోనూ మెరుగైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. యువ సంచలనం రింకు సింగ్ కూడా మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. ఇలా యువ ఆటగాళ్లందరూ తమకు వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ఇది టీమిండియా శుభసూచకంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.