Saturday, November 9, 2024

భారత మహిళా జట్టు నయా చరిత్ర..

- Advertisement -
- Advertisement -

ముంబై: ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ టీమ్ 347 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది. కేవలం ఒకే ఒక్క సెషన్‌లో ప్రత్యర్థికి చెందిన పది వికెట్లను పడగొట్టి టీమిండియా పెను ప్రకంపనలు సృష్టించింది. ఇదే క్రమంలో మహిళల క్రికెట్ చరిత్రలోనే భారీ విజయం సాధించిన జట్టుగా భారత్ నయా రికార్డును నెలకొల్పింది. ఇప్పటి వరకు శ్రీలంక పేరిట ఈ రికార్డు ఉండేది. గతంలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక మహిళా జట్టు 309 పరుగుల తేడాతో విజయం సాధించింది. తాజాగా టీమిండియా ఈ రికార్డును తిరగరాసింది. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 9 వికెట్లను పడగొట్టిన దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. భారత్ శనివారం మూడో రోజు 186/6 ఓవర్‌నైట్ స్కోరు వద్దనే రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. దీంతో ఇంగ్లండ్ ముందు 479 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఉంచింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ మహిళలు 27.3 ఓవర్లలో కేవలం 131 పరుగులకే కుప్పకూలారు. భారత బౌలర్లు తొలి సెషన్‌లోనే ఏకంగా పది వికెట్లను పడగొట్టి జట్టుకు చారిత్రక విజయాన్ని అందించారు.

క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు సోఫియా డంక్లె (15), టామీ బ్యూమౌంట్ (17) విఫలమయ్యారు. జట్టును ఆదుకుంటుందని భావించిన కెప్టెన్ హీథర్ నైట్ కూడా నిరాశ పరిచింది. నైట్ 21 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరింది. ఇక నాట్ సివర్ బ్రంట్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగింది. పూజా వస్త్రాకర్ ఆరంభంలోనే కీలకమైన మూడు వికెట్లను పడగొట్టి ఇంగ్లండ్‌కు కోలుకోలేని దెబ్బతీసింది. ఆ తర్వాత దీప్తి శర్మ తన జోరును కొనసాగించింది. డానియల్ వ్యాట్ (12), అమీ జోన్స్ (5)లను దీప్తి వెనక్కి పంపింది. అంతేగాక లౌరెన్ ఫిలర్ (0), కేట్ క్రాస్ (16) వికెట్లను కూడా దీప్తి తన ఖాతాలో వేసుకుంది. గైక్వాడ్ సోఫి ఎక్లెస్టోన్, లౌరెన్ బెల్‌లను ఔట్ చేసింది. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 131 పరుగుల వద్దే ముగిసింది. కాగా, టెస్టుల్లో ఇంగ్లండ్‌పై భారత మహిళలకు ఇదే తొలి విజయం కావడం విశేషం. దీప్తి శర్మ ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టింది.

రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 87 పరుగులు చేసింది. అంతేగాక మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండు ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లను పడగొట్టి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పతనాన్ని శాసించింది. ఇదిలావుంటే తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 428 పరుగులు చేసింది. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే కుప్పకూలింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News