ధర్మశాల : వన్డే వరల్డ్ కప్‌లో భారత్ వరుస విజయాలతో దూసుకు పోతోంది. బౌలర్లు, బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో టీమిండియా అలవోకగా విజయాలు సాధిస్తూ పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి ఎగబాకింది. న్యూజిలాండ్‌తో ఆదివారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయాలకు చెక్ పెట్టింది. అంతేకాదు 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు కుప్పకూలింది. డారిల్ మిచెల్ 130 (127 బంతుల్లో 9×4, 5×6), రచిన్ రవీంద్ర 75 (87 బంతుల్లో 6×4, 1×6) రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ(5/54) ఐదు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించాడు.
కుల్దీప్ యాదవ్(2/73) రెండు వికెట్లు, బుమ్రా(1/45), సిరాజ్(1/45) తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 48 ఓవర్లలో 6 వికెట్లకు 274 పరుగులు చేసి సునాయస విజయాన్ని నమోదు చేసింది. విరాట్ కోహ్లీ 95 (104 బంతుల్లో 8×4, 2×6) తృటిలో శతకం చేజార్చుకోగా.. రోహిత్ శర్మ 46 (40 బంతుల్లో 4×4, 4×6), రవీంద్ర జడేజా 39 నాటౌట్ (44 బంతుల్లో 3×4, 1×6) కీలక ఇన్నింగ్స్ ఆడారు. న్యూజిలాండ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ 2 వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, మ్యాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీసారు.
రాణించిన టీమిండియా బ్యాటర్లు
274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ(46), శుభ్‌మన్ గిల్(26) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా రోహిత్ శర్మ సిక్సర్లతో కివీస్ బౌలర్లను పరుగులు పెట్టించాడు. దాంతో టీమిండియా పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీకి చేరువైన రోహిత్‌ను ఫెర్గూసన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 71 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఫెర్గూసన్ మరుసటి ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్.. విరాట్ కోహ్లీతో కలిసి ధాటిగా ఆడాడు. వరుస బౌండరీలతో దూకుడు కనబర్చాడు. శ్రేయస్ అయ్యర్ జోరు కనబర్చాడు. అయితే ట్రెంట్ బౌల్ట్.. అయ్యర్ బలహీనతపై దెబ్బ కొడుతూ షార్ట్ పిచ్ బాల్‌తో బోల్తా కొట్టించాడు.
దాంతో మూడో వికెట్‌కు నమోదైన 52 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడాడు. 54 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని సాంట్నర్ విడదీసాడు. రాహుల్‌ను ఎల్బీ గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన సూ ర్యకుమార్ యాదవ్ రాగా.. కోహ్లీ 60 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే సూర్య(2) విరాట్ కోహ్లీతో సమన్వయలోపం కారణంగా రనౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో టీ మిండియా 191 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చి న జడేజాతో కోహ్లీ ఆచితూచి ఆడాడు. భారత్ విజయానికి 19 పరుగులు అవసరమవ్వగా.. కోహ్లీ 6, 4 బాది సెంచరీపై ఆసక్తి రేకెత్తించాడు. కానీ మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగి 5 పరుగుల దూరంలో శతకం చేజార్చుకున్నాడు. అనంతరం క్రీజులోకి షమీ రాగా.. జడేజా బౌండరీ బాది మ్యాచ్‌ను ముగించాడు.